అంతా నా ఇష్టం.. గుంటూరు జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే తీరిదీ..!

ABN , First Publish Date - 2020-09-21T09:58:11+05:30 IST

గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని అదో అసెంబ్లీ స్థానం. అక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే అన్ని కీలకపదవుల్లో తన సామాజికవర్గంవారే ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలను దాదాపుగా అదేరీతిలో పోస్టింగ్‌ చేయించుకున్నారు. తాజాగా ఆ నియోజకవర్గంలోని

అంతా నా ఇష్టం.. గుంటూరు జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే తీరిదీ..!

పోస్టింగుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లు

తాజాగా వీఆర్వోల విషయంలో మెలిక 

తహసీల్దార్‌ తీరుపైనా రెవెన్యూ వర్గాల్లో చర్చ

హైకోర్టుకు వెళ్లే యోచన 


గుంటూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని అదో అసెంబ్లీ స్థానం. అక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే అన్ని కీలకపదవుల్లో తన సామాజికవర్గంవారే ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలను దాదాపుగా అదేరీతిలో పోస్టింగ్‌ చేయించుకున్నారు. తాజాగా ఆ నియోజకవర్గంలోని ఒక మండలానికి కేటాయించిన 18మంది వీఆర్వోలను చేర్చుకొనే విషయంలో మెలికపెట్టారు. తనకు లోకల్‌ వాళ్లు వద్దని, నాన్‌ లోకల్‌ వాళ్లు కావాలని తహసీల్దార్‌పై ఒత్తిడి చేసి వారిని విధుల్లో చేరనీయకుండా కొన్నిరోజులుగా అడ్డుకుంటున్నారు.


డెల్టాలో అదో కీలకమైన నియోజకవర్గం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కేంద్రమైన మండలంలో వీఆర్‌ఏలుగా పనిచేస్తూ ఇటీవలే వీఆర్వోలుగా ఉద్యోగోన్నతిపై వచ్చినవారిని చేర్చుకోవద్దని తహసీల్దార్‌కు హుకుం జారీచేశారు. అసలే ఇంచుమించు దశాబ్దకాలం పాటు పోరాడి సాధించుకొన్న ఉద్యోగోన్నతులు. ఎన్నో వివాదాల నడుమ ఇటీవలే కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఉద్యోగోన్నతి, పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులు అందుకున్న సంతోషం వారిని విధుల్లోకి చేరనీయకుండా అడ్డుకుంటుండటంతో ఆవిరైపోతున్నది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తమ పరిస్థితి తయారైందని బాధిత వీఆర్వోలు వాపోతున్నారు. అదేమంటే తమపై తెలుగుదేశం పార్టీ అనుకూలమన్న ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కాగా కలెక్టర్‌ ఉత్తర్వులను తహసీల్దార్‌ బేఖాతరు చేస్తుండటంపై రెవెన్యూవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లాకి విఘాతం కలుగుతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా... జిల్లాలోని మండలస్థాయి అధికారులకు అవేమీ పట్టడం లేదు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వీఆర్వోలను చేర్చుకోకుండా తహసీల్దార్‌ అడ్డుపడుతున్నారు. రేపటిరోజున హైకోర్టులో ఎవరైనా కేసు దాఖలుచేస్తే వెళ్లి చేతులు కట్టుకొని నిలబడాల్సింది తానేనన్న విషయాన్ని మరిచిపోతున్నారు. గతంలో ఎవరైనా ఒకరిద్దరి విషయంలో అభ్యంతరాలుంటే వారినికాకుండా వేరొకరిని పోస్టింగ్‌ చేయమనేవారు. అలాంటిది ఇక్కడ ఏకంగా 18మంది వీఆర్వోలను చేర్చుకోకపోతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల కోసం ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం తగదన్న అభిప్రాయం రెవెన్యూ వర్గాల ద్వారా వ్యక్తమవుతోంది. ఈ వివాదానికి తక్షణం ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే హైకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాయి. 


Updated Date - 2020-09-21T09:58:11+05:30 IST