కోటి ఆశలతో YS Jagan సమక్షంలో YSRCP లో చేరితే ఇలా జరిగిందేంటి..!?

ABN , First Publish Date - 2021-08-16T18:44:57+05:30 IST

పార్టీ బలం పెంచుకునేందుకు హైకమాండ్‌ కొత్త చేరికలను ప్రోత్సహిస్తుంటుంది. అప్పటివరకు...

కోటి ఆశలతో YS Jagan సమక్షంలో YSRCP లో చేరితే ఇలా జరిగిందేంటి..!?

పార్టీ బలం పెంచుకునేందుకు హైకమాండ్‌ కొత్త చేరికలను ప్రోత్సహిస్తుంటుంది. అప్పటివరకు పార్టీలో పనిచేసిన నేతలకు భరోసా ఇస్తుంది. కొత్త వారికి భవిష్యత్తు ఉంటుందని ఆశలు కల్పిస్తుంది. మొత్తానికి ఒకే ఒరలో రెండు కత్తులను చేర్చి కూర్చుంటుంది హైకమాండ్. ఇక ఆ తర్వాత ఇమడలేక ఆ నేతలు కొట్టుకుంటుంటే చూస్తు ఉంటుంది తప్పితే ఏమీ చేయలేదు అధిష్టానం. ఆ ఇద్దరి కొట్లాటలో విజేతగా నిలిచిన వ్యక్తికి  దండేసి జైకొడుతుంది. ఇలా ఏమాత్రం పొసగని రెండు వర్గాల గొడవ వైసీపీలో ఎక్కువవుతోందట. ఆ నియోజకవర్గంలో మాత్రం మరీ మరీ ఎక్కువగా ఉందట? ఇంతకీ ఏ నేతలిద్దరూ సై అంటే సై అంటున్నారు? ఆ వర్గపోరుకు ముగింపు పలికే తంత్రం హైకమండ్ దగ్గర ఉందా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


నరసాపురంలో ఢీ అంటే ఢీ!

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో వైసీపీలో రెండు బలమైన వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వారి పోరును చూస్తున్న హైకమాండ్ ప్రస్తుతానికి ఏమీ చేయలేక వెయిట్‌ అండ్‌ సీ అన్నట్లు ప్రవర్తిస్తోంది. పార్టీ తొలి నుంచి జగన్‌రెడ్డికి వీరవిధేయుడిగా ఉన్న ఎమ్మెల్యే ప్రసాదరాజు  రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై అధికార వైసీపీలో చక్రం తిప్పుతున్నారు. మరొకరేమో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత కొత్తపల్లి సుబ్బారాయుడు. నియోజకవర్గంలో విస్తృతమైన అనుచరబలం ఉన్న నేత. ఈ ఇద్దరు వైసీపీలో ఆధిపత్యపోరులో పైచేయి సాధించేందుకు ఢీ అంటే ఢీ అంటున్నారు.


కోటి ఆశలతో వైసీపీ తీర్థం పుచ్చుకుంటే..!

పార్టీ ఆవిర్బావం నుంచి పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రసాదరాజు సీఎం జగన్‌కు దగ్గరి మనిషిగా చలామణి అవుతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్‌ నేత కొత్తపల్లికి నియోజకవర్గంలో ఉన్న ఫాలోయింగ్‌ను వాడుకోవాలని చూసిన వైసీపీ హైకమాండ్ ఆయన్ను రారమ్మని పిలిచింది. టికెట్‌ మాత్రం ప్రసాదరాజుకు ఇచ్చింది. మున్ముందు ఎమ్మెల్సీ ఇస్తామని కొత్తగా పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి జగన్‌ హామీ ఇచ్చినట్లు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు అంటుంటారు. మొత్తానికి రెండు వర్గాలు ప్రయత్నించడంతో నరసాపురంలో వైసీపీ గెలిచింది. ఎమ్మెల్యేగా ప్రసాదరాజు మరోసారి ఎన్నికయ్యారు. కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలో ప్రముఖ నాయకుడిగా కొనసాగుతున్నారు.


అంతా ఎమ్మెల్యే పెత్తనమే!

కాలం గడుస్తున్న కొద్దీ ఎమ్మెల్యేగారి మాటకు నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయింది. ప్రతీపనిలోనూ ప్రసాదరాజు మాటకే హైకమాండ్ జైకొడుతుందని కొత్తపల్లి వర్గంలో అభిప్రాయం ఏర్పడింది. ఎమ్మెల్సీ పదవి కాదు కదా కనీసం నామినేటెడ్‌ కార్పొరేషన్‌ పదవికూడా లేక అధికార పార్టీలో కొత్తపల్లి.. ఖాళీగా ఉండాల్సివస్తోంది. దీంతో పట్టునిలుపుకునేందుకు కొత్తపల్లి రాజకీయం చేయడం మొదలెట్టారనే టాక్‌ వస్తోంది.నరసాపురంలో పార్టీ పదవుల కేటాయింపులోనూ, నామినేటెడ్ పదవుల కేటాయింపులో అన్నీ ప్రసాదరాజు వర్గానికి అగ్రతాంబూలం అందింది. సుబ్బారాయుడి వర్గానికి ఎటువంటి పదవులూ రాలేదు. అంతేకాదు, నరసాపురంలో నిర్మించిన ఒక షాపింగ్ కాంప్లెక్స్ అంశంలోనూ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి.


కార్పొరేషన్‌లో కో ఆప్షన్‌ పదవుల కోసం ఢీ!

ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరును మున్సిపల్‌ ఎన్నికలు ముదిరిపాకానపడేలా చేశాయి.చైర్మన్ పదవిని వైసీపీ గెలుచుకున్నప్పటికీ మునిసిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలుగా విడిపోయి తమనేతలకు కాపు కాయడం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో మునిసిపాలిటిలో ఉన్న మూడు కో ఆప్షన్ పదవులను ప్రసాదరాజు తన వర్గానికే దక్కేలా ప్లాన్ చేశారు. కనీసం ఒక్క పదవి అయినా తమ వర్గానికి దక్కాలని సుబ్బారాయుడు వర్గం పట్టుబట్టింది. ఎన్నికల్లో ఓడిపోయిన బళ్ల వేంకటేశ్వరరావుకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని సుబ్బారాయుడు వర్గం కోరగా దానికి ప్రసాదరాజు అంగీకరించలేదు. ఆ పదవికి సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగడంతో అది కాస్తా ముదిరి సియం పేషీ వరకు వెళ్లింది. సీయం పేషీ నుంచి ఎటువంటి సూచనలు రాకపోవడంతో ఆ పదవికి ఎంపికను వాయిదా వేసారు.


రెండు వర్గాలుగా చీలిన వైసీపీ!

ఇలా అనేక రకాలుగా ఇద్దరి నేతల మధ్య తలెత్తుతున్న అభిప్రాయ బేధాలు పార్టీని నిలువునా చీల్చేశాయి. అలా పార్టీ చీలిపోవడం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. మున్ముందు ఏ నేతను పూర్తిగా సైడ్ చేస్తుందో మరే నేతకు మరింత పవర్‌ ఇస్తుందో చూడాలని వైసీపీ క్యాడరే కాదు అన్ని పార్టీల నేతలు, ప్రజలు అనుకుంటున్నారట.





Updated Date - 2021-08-16T18:44:57+05:30 IST