అధికార పార్టీలో కుమ్ములాటలు.. అమాత్యుడి ఇలాఖాలో అసంతృప్తి సెగలు

ABN , First Publish Date - 2020-09-21T09:41:13+05:30 IST

అధికార పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా అమాత్యుడి ఇలాఖా పెనుకొండ నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ఏకంగా మంత్రి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా ఆ పార్టీలోని కొందరు మండలస్థాయి నాయకులు గత కొంత కాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు

అధికార పార్టీలో కుమ్ములాటలు.. అమాత్యుడి ఇలాఖాలో అసంతృప్తి సెగలు

అసమ్మతి నేతల వేరుకుంపటి

జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా.... 

మిమ్మల్ని నేను వెనకేసుకుంటా....

ఓ ఎమ్మెల్యే అసమ్మతి నేతలకు అభయం

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఫోన్‌ సంభాషణ


అనంతపురం (ఆంధ్రజ్యోతి) : అధికార పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా అమాత్యుడి ఇలాఖా పెనుకొండ నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ఏకంగా మంత్రి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా ఆ పార్టీలోని కొందరు మండలస్థాయి నాయకులు గత కొంత కాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా గోరంట్లకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైన అసమ్మతి నేత గంపల రమణారెడ్డి పార్టీలోని తన వర్గంతో వేరు కుంపటి పెట్టారు. తన వర్గంతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రి సోదరులపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఆ పరంపర కొనసాగుతోంది. రెండు వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో కత్తులు దూస్తున్నాయి. ఇరువర్గాలు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సోదరుల్లో ఒకరు గంపల రమణారెడి ్డ చేసిన ఆరోపణలు, విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ మేరకు రూ. 5 కోట్లకు పరువునష్టం దావా వేస్తూ.. రమణారెడ్డికి నోటీసులు పంపారు. అదేస్థాయిలో ఆయన స్పందించినట్లు సమాచారం. ఈ రెండు వర్గాల మధ్య వర్గపోరు ఎట్టకేలకు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం.


ఈ నేపథ్యంలోనే రమణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే తనకు ఎలాంటి సస్పెండ్‌ నోటీసులు అందలేదని ఆ అసమ్మతి నేత బహిరంగంగానే ఆ పార్టీ వర్గాలతో చెబుతున్నారు. ఇదిలా ఉండగా.... ఆ అసమ్మతి నేత తన వర్గంతో కలిసి హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలను కలిసి మంత్రిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఎమ్మెల్యే ఆ అసమ్మతి నేతతో ఫోన్‌లో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణలో భాగంగా ఓ ఎమ్మెల్యే అసమ్మతి నేతకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే ఆ అసమ్మతి నేతతో మాట్లాడిన మాటలివీ....


’’మనం లోకల్‌... మంత్రి శంకర్‌నారాయణ లోకల్‌ కాదు. పార్టీలో ఈ రోజు ఉండొచ్చు... పోవొచ్చు. ఉంటాడోలేదో కూడా తెలియదు. మనం శాశ్వతంగా పార్టీలో ఉంటాం. మన చెట్టును మనం నరుక్కోవడం ఏంటి...? నా దగ్గరకు రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల మండలాలకు చెందిన కార్యకర్తలొచ్చి బాధను వెల్లగక్కుతుంటారు. పార్టీ మనది... మంత్రి శంకర్‌నారాయణ బాడిగింట్లోకి వచ్చాడు. మనతో బాగుంటే శాశ్వతంగా ఉంటాడు. లేకుంటే ఇంకో ఊరికి పోతాడు.... ఎవరేమీ చేసుకున్నా... నీకు నేనున్నాను. జగన్మోహన్‌రెడ్డన్న ఏ నిర్ణయం తీసుకున్నా... మీ అందరినీ వెనకేసుకుంటా... గతంలో పెనుకొండ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా పనిచేశా. పార్టీ హైకామండ్‌తో మాట్లాడుతా... సరేనా’’ అంటూ ఆ ఎమ్మెల్యే అసమ్మతి నేతకు అభయమివ్వడం చూస్తే... పార్టీలో అంతర్గత పోరు ఏస్థాయిలో జరుగుతోందో దీన్నిబట్టి అర్థమవుతోంది. 

Updated Date - 2020-09-21T09:41:13+05:30 IST