బీహార్ సంస్కృతిని బాగా ఫాలో అవుతున్న ఆ నాయకులు ఎవరు?.. కాదని ఏదైనా చేస్తే చితక్కొడతారు..!

ABN , First Publish Date - 2021-12-15T17:04:03+05:30 IST

అక్కడ కాంట్రాక్టు పనులు చేయాలంటే ముందుగా అధికార పార్టీ నాయకులతో మాట్లాడుకోవాలి. కమీషన్ల పంచాయితీ పూర్తి అయ్యాకే పనులు చేసుకోవాలి. కాదని కాంట్రాక్టర్ అభివృద్ది పనులు చేస్తే..

బీహార్ సంస్కృతిని బాగా ఫాలో అవుతున్న ఆ నాయకులు ఎవరు?.. కాదని ఏదైనా చేస్తే చితక్కొడతారు..!

అక్కడ కాంట్రాక్టు పనులు చేయాలంటే ముందుగా అధికార పార్టీ నాయకులతో మాట్లాడుకోవాలి. కమీషన్ల పంచాయితీ పూర్తి అయ్యాకే పనులు చేసుకోవాలి. కాదని కాంట్రాక్టర్  అభివృద్ది పనులు చేస్తే.. అంతే సంగతులు! కర్రలతో చితక్కొడతారు, రాళ్లతో దాడులు చేస్తారు. అంతేకాకుండా అసలు పనులే జరగకుండా.. వాహనాలు, యంత్రాలను తీసుకెళ్తారు. బీహార్  సంస్కృతిని బాగా ఫాలో అవుతున్న ఆ నాయకులు ఎవరు? వారి దౌర్జన్యాలు.. ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి? వాచ్‌ దిస్‌ స్టోరీ. అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


రాయలసీమలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న..వైసీపీ నేతలు..

రాయలసీమలో ఫ్యాక్షన్‌ గొడవలు, ప్రతీకార హత్యలు వంటి ఘటనలు తరుచుగా వార్తల్లో వస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లా వైసీపీ నేతలు కొత్త ట్రెండ్  ఫాలో అవుతున్నారు. అదేమిటంటే- "మా ఇలాకాలో పనులు మాకే!" అనే విధానాన్ని వారు అనుసరిస్తున్నారట. దీని ప్రకారం.. తమ నియోజకవర్గ పరిధిలో ఏ కాంట్రాక్టు పనులైనా తాము  మాత్రమే చేయాలన్నది వారి సిద్దాంతమట. ఒకవేళ నాన్‌లోకల్‌కు చెందిన కాంట్రాక్టర్లు ఎవరైనా టెండర్లు దక్కించుకుంటే.. ముందుగా తమతో మాట్లాడిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని  వారు హుకుం జారీ చేశారట. అయితే ఈ విషయం తెలియని నాన్‌లోకల్‌ కాంట్రాక్టర్లు.. అధికార వైసీపీ నేతల ఆగడాలు, దౌర్జన్యాలకు బలవుతున్నారని టాక్. "మా ప్రాంతంలో మా  పర్మిషన్‌ లేకుండా ఇతర ప్రాంతాల వారు కాంట్రాక్టు పనులు ఎలా చేస్తారు?" అని సీరియస్‌ అవుతున్నారట.


అచ్చం సినీఫక్కీలో జరిగిన దౌర్జన్యకాండ

ప్రస్తుతం జిల్లాలోని మద్దికెర నుంచి డోన్ మీదుగా బేతంచెర్ల వరకు రైల్వే స్టేషన్‌లలో ఫుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలను 19.50 కోట్ల రూపాయలు విలువజేసే పనులు జరుగుతున్నాయి.  అయితే ఈ పనులను అనంతపురం జిల్లాకు చెందిన వీవీఆర్‌కే అసోసియేట్ కంపెనీ వారు పనులు దక్కించుకున్నారు. ఇందులో భాగంగా మద్దికెరలో వారం రోజులుగా కంపెనీ మేనేజర్  కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుంపుగా కూలీల దగ్గరకు వెళ్లి.. "మాతో మాట్లాడకుండా పనులు ఎలా చేస్తున్నారు? అని బెదిరించారట. తాము కేవలం  పనిచేసేటోళ్లమేననీ, ఏదైనా ఉంటే కంపెనీ వారితో మాట్లాడుకోవాలనీ కూలీలు చెప్పారు. ఆ తర్వాత సరిగ్గా రెండు రోజులకే వారు మళ్లీ కూలీల దగ్గరకు వెళ్లారు. "మేం చెప్పినా వినకుండా  పనులు చేయడానికి ఎంత ధైర్యం.." అని సదరు వ్యక్తులు దాడులకు తెగబడ్డారు. కూలీలు, కంపెనీ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టి బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా.. రైల్వే పనులకు వాడే కంకర మిషన్, బొలెరో వాహనాన్నిఎత్తుకెళ్లారు.


కాగా, దాడిచేసి వెళ్తున్న వారిని కొందరు కూలీలు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వారు ఎవరని ఆరా తీశారు. పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులని  స్థానికుల సహాయంతో గుర్తించారట. ఈ విషయం తెలిసి మద్దికెర వాసులు భయాందోళన చెందారు. అచ్చం సినీఫక్కీలో జరిగిన దౌర్జన్యకాండ పత్తికొండ నియోజకవర్గంలోనే కాకుండా  జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి ఘటనలు బీహార్‌లో జరుగుతుంటాయని.. ఆ సంస్కృతి ఇప్పుడు ఇక్కడికి కూడా వ్యాపించినట్లుగా ఉందన్న చర్చ  జరుగుతోంది. మరోవైపు ప్రశాంతంగా ఉండే మద్దికెరలో పత్తికొండకు చెందిన వైసీపీ వర్గీయులు వచ్చి ఇలా దాడులు చేయడం ఏమిటని గ్రామస్థులు మండిపడుతున్నారు. గతంలోనూ  అధికార పార్టీకి చెందిన కొందరు రైల్వే పనులను ఇదే తరహాలో అడ్డుకున్న ఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు.


ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సీరియస్‌గా తీసుకోవడం లేదనే ప్రశ్నలు..

ఇక దాడులకు గురైన బాధితుల ఫిర్యాదు మేరకు మద్దికెర పోలీసులు కేసు మాత్రమే నమోదు చేశారు. అయితే కూలీలు, కంపెనీ సిబ్బందిపై దాడులు చేసింది ఎవరనేది  పోలీసులకు తెలిసినా.. వారిపై చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కూడా.. ఈ విషయాన్ని ఎందుకు  సీరియస్‌గా తీసుకోవడం లేదనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. పర్సంటేజీల కోసం సినీఫక్కీలో దాడులకు తెగబడే వారిపై వైసీపీ అధినాయకత్వం సైతం కఠినంగా  వ్యవహరించకపోవడం వల్లే.. పార్టీ నాయకులు, వారి అనుచరుల ఆగడాలు శ్రుతిమీరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు సహకరించాల్సిందిపోయి.. కమీషన్ల  కోసం పనులను అడ్డుకోవడం, పనులు చేసే వారిపై దాడులు చేయడం బీహార్‌ సంస్కృతిని తలపిస్తోందనీ, ఆ కల్చర్‌ను అధికార వైసీపీ నాయకులు బాగా ఫాలో అవుతున్నారనే చర్చ జిల్లా  రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. 


అధిష్టానం ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకుంటుందా..?

మొత్తంమీద కాంట్రాక్టుల్లో పర్సంటేజీలు అనేది ప్రస్తుత రాజకీయాల్లో అంతర్గత విషయమైతే.. ఇక్కడ మాత్రం అది బహిరంగంగానే అన్నట్లుగా అధికార పార్టీ శ్రేణులు  వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్ల కోసం కాలకేయుల్లా ఆగడాలు, అరాచకాలకు తెగబడుతున్న వైసీపీ వర్గీయులను.. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా సీరియస్‌గా  తీసుకుని కట్టడి చేస్తుందా? లేక చూస్తూ ఊరుకుంటుందా? అనేది చూడాలి.

Updated Date - 2021-12-15T17:04:03+05:30 IST