Abn logo
Sep 23 2021 @ 00:28AM

బాంబు పేల్చిన ఎమ్మెల్యే ఆళ్ల!

దుగ్గిరాల ఎంపీపీ పదవి.. నీదా.. నాదా!

సర్వత్రా ఉత్కంఠ!

పది స్థానాలతో టీడీపీ -జనసేన కూటమి ఆధిక్యం

ఎనిమిది స్థానాలతో వెనుకబడిన వైసీపీ

టీడీపీకి చెక్‌ పెట్టేందుకు ఎమ్మెల్యే ఆళ్ల ఎత్తుగడలు

కౌంటర్‌దాడితో దూకుతున్న టీడీపీ


మంగళగిరి: దుగ్గిరాల మండల రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్షాలు రెండూ దుగ్గిరాల ఎంపీపీ పదవి తమ ఖాతాలోనే పడుతుందంటే కాదు... కాదు తమ ఖాతాలోనే పడుతుందని భరోసాగా చెప్పుకొంటున్నాయి. దీంతో ఈనెల 24న జరగాల్సిన ఎన్నికపై నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 


ఈ మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో రెండు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశాక వారిని లోబరుచుకుని కుట్రపూరితంగా ఏకగ్రీవం చేసుకున్నారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. మిగిలిన 16 ఎంపీటీసీ స్థానాలకు రెండింటిలో జనసేన అభ్యర్థులను టీడీపీ బలపరిచి, మిగిలిన 14 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇందులో తొమ్మిదింటిలో ఘన విజయం సాధించి మండలంలో మెజారిటీ స్థానాలను గెలిచిన పార్టీగా టీడీపీ అవతరించింది. ఇక వైసీపీ ఆరు స్థానాల్లో గెలుపొంది ఏకగ్రీవమైన రెండింటితో కలుపుకొని ఎనిమిది స్థానాలను కైవశం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. జనసేన పోటీచేసిన రెండు స్థానాలలో ఒక్క స్థానంలో విజయం సాధించింది. రెండోస్థానం పెడకొండూరులో ఫలితం తీవ్ర వివాదాస్పదమైంది. అక్కడ జనసేన అభ్యర్థి 65 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినప్పటికీ, వైసీపీ అధికారబలంతో కౌంటింగ్‌ సిబ్బందిని ప్రభావితం చేసి దౌర్జన్యపూరితంగా తామే 21 ఓట్లతో గెలిచినట్టు ప్రకటింపజేసుకుందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. 


ప్రలోభ పెట్టాలనుకుంటున్నారా..?

ఎన్నికలకు ముందే పొత్తులను కుదుర్చుకుని పోటీచేసిన దరిమిలా పది స్థానాలతో మెజారిటీగా ఉన్న టీడీపీ -జనసేన కూటమి ఎంపీపీ స్థానాన్ని కైవశం చేసుకునే అవకాశాలే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం మంగళగిరి దేవస్థానం వద్ద దుగ్గిరాల మండలాన్ని తమ పార్టీ కైవశం చేసుకోబోతుందంటూ బాంబు పేల్చారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ ప్రకటనపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. మా గుర్తుపై గెలిచిన ఎంపీటీసీలను కొనుగోలు చేసి ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని అనుకుంటున్నారా!? అంటూ విరుచుకుపడ్డారు. మా సైకిల్‌ గుర్తుపై గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెట్టి లాక్కుందామని చూస్తున్నారా? అంటూ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. 


కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా..

ఇంకోవైపు దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడం కూడా  టెన్షన్‌ను క్రియేట్‌ చేస్తుంది. జనరల్‌ కేటగిరిలో వున్న చిలువూరు-1 స్థానం నుంచి విజయం సాధించిన బీసీ అభ్యర్థిని షేక్‌ జబీన్‌ను టీడీపీ తమ ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఆమెకు కులధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆళ్ల దుగ్గిరాల తహసీల్దారుపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తాము అన్నీ ఆధారాలతో కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మండల రెవెన్యూ అధికారులు సర్వర్‌ పనిచేయడం లేదని.. పరిశీలిస్తున్నామని సంబంధం లేకుండా మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారని టీడీపీ ధ్వజమెత్తుతోంది. ఇంకోవైపు వైసీపీ జనసేన తరఫున గెలిచిన ఈమని-1 విజేత పసుపులేటి సాయి చైతన్యను తమవైపు తిప్పుకొనేందుకు బేరసారాలు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. అధికార వైసీపీ ఎత్తుగడల నుంచి తమ కూటమి అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపి కొందరు ఎంపీటిసి అభ్యర్ధులను రహస్య స్థావరాలకు తరలించింది. మొత్తంమీద దుగ్గిరాల ఎంపీపీ వ్యవహారం నియోజకవర్గంలో కాక రేపుతోంది.