అధికార.. దందా

ABN , First Publish Date - 2022-07-16T05:41:04+05:30 IST

మూడేళ్లు గడిచింది. మరో రెండేళ్ల సమయం ఉంది. సమయం దగ్గర పడుతోంది మిత్రమా అన్న తీరుగా అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకోవడమే పరమావధిగా జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్నారు.

అధికార.. దందా
చినగాదెలవర్రులో మట్టి తవ్వకాలు(ఫైల్‌ ఫొటో)

మళ్లీ అవకాశం రాదని రెచ్చిపోతున్న నాయకులు

అందినకాడికి దండుకోవడమే పనిలో అనుచరులు

రేషన్‌ బ్యియం నుంచి ఇసుక వరకు అన్నీ వారి కనుసన్నల్లోనే

అనుచరగణం నిర్వహణ.. కీలక నేతలకు భారీగా ముడుపులు

 


మనదే రాజ్యం.. దోచుకోవడమే ధ్యేయం.. మళ్లీ అవకాశం వస్తుందో రాదో.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. అన్న రీతిలో అధికార పార్టీ నాయకులు పలువురు అక్రమాల దందాలతో చెలరేగిపోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు.   రేషన్‌నుంచి ఇసుక, మట్టి తవ్వకాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, సివిల్‌ సెటిల్‌మెంట్లు, ఉద్యోగుల బదిలీలు ఇలా అదీ ఇదీ అన్న తేడా లేకుండా.. ఎక్కడ ఆదాయం వస్తుందనుకుంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. కీలక నాయకులకు    వాటాలు ముట్టచెప్పి అధికారమే అండగా  అనుచరులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో వారి ఆగడాలకు అడ్డు చెప్పే అధికారులను బెదిరించడానికి సైతం చోటామోటా నాయకులు జంకడం లేదు. ఫిర్యాదు చేసే వారిపై పోలీసుల సహకారంతో కౌంటర్‌ కేసులు పెట్టించి బాధితులనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పచ్చగా ఉండే పల్లెల్లో కూడా గ్రూపులను ప్రోత్సహించి అగ్గిరాజేసి పబ్బం గడుపుకోవడానికి కూడా అధికారపార్టీ నేతాగణం వెనకాడడం లేదు.   


 

బాపట్ల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లు గడిచింది. మరో రెండేళ్ల సమయం ఉంది. సమయం దగ్గర పడుతోంది మిత్రమా అన్న తీరుగా అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకోవడమే పరమావధిగా జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్నారు. పల్లె పట్టణం.. పంచాయతీ మున్సిపాలిటీ చెరువు కాల్వ, పొలం పుట్ట అన్న తేడా లేకుండా ఎక్కడ రూపాయి వస్తుందంటే అక్కడ వాలిపోతున్నారు. ఇటీవల బల్లికురవ మండలంలో ఉద్యోగుల నుంచి కూడా అధికార పార్టీ నాయకులు డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీరి ఆగడాలను భరించలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక పై అధికారులకు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కీలక నాయకుల నుంచి గ్రామాల్లో ఉండే చోటామోటా నాయకుల వరకు అందరిదీ ఒకేమాట.. ఒకే బాట.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో దేనిని వదలకుండా కాసుల వేట కొనసాగిస్తున్నారు. అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన రూరల్‌ మండల పార్టీ నాయకుడిదే మట్టి తవ్వకాల్లో హవాగా ఉంది. ఏకంగా పొలాలకు నీరందించే వాగులే  లక్ష్యంగా దందా చేస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఎవరన్నా వ్యతిరేకంగా గళమెత్తితే కౌంటర్‌ కేసులతో భయపెడుతున్నట్లు తెలుస్తోంది. లే అవుట్‌ కన్వర్షన్‌ కావాలంటే ఇంతని స్థానికంగా ఉన్న నాయకులకు ముట్టచెప్పాల్సిందే. లేకుంటే అనుమతులురాని పరిస్థితి నెలకొంది.


సింహభాగం పెద్ద తలకాయలకే 

వ్యవహారం మొత్తం నడిపించేది స్థానికంగా ఉన్న చోటామోటా నాయకులైతే వారికి అన్ని రకాల అండదండలు అందించేది కీలక నేతలేనన్నా ప్రచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దందాలకు ఏకంగా పాటలు కూడా పెడుతున్నారని సమాచారం.  చీరాల, పర్చూరు ప్రాంతంలో సాగే ప్రతి దందాకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అద్దంకి పరిధిలో గ్రానైట్‌ దందాకు అనధికారికంగా అక్కడ ఉన్న కీలక నాయకుడికి ముడుపులు వెళతాయని వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.


ప్రభుత్వ ఖజానాకు గండి....

ఒకవైపు సహజసిద్ధమైన ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. కొన్ని చోట్ల నిబంధనల ప్రకారం మరికొన్ని చోట్ల విరుద్ధంగా ఈ విధ్వంసం సాగుతోంది. ఇంత నష్టం జరిగి కనీసం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందా అంటే అదీలేదు. వందలకోట్ల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళుతుంది. ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న జిల్లాకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. నిబంధనల ప్రకారం ఆ సొమ్మంతా పక్కదారి పట్టకుండా ప్రభుత్వ ఖజానాకు చేరితే జిల్లా పురోగమనానికి ఉపయోగపడే అవకాశం ఉంది.


ఇటీవల వెలుగుచూసిన ఆగడాలు..

- చినగంజాం మండలం పరిధిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇసుక రవాణా విషయంలో నానాయాగీ చేశాడు. అనుమతులు, పత్రాలు ఉన్నా ఇక్కడ మాత్రం తన కనుసన్నల్లో జరగాలంటూ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేసే వారిపై దాడి చేయబోయారు. ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరితే ఏకంగా అక్కడే ఇరువర్గాలు బాహాబాహీకి తెగబడ్డాయి. అడ్డుపడిన వ్యక్తికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీలకనేత అండదండలున్నాయనే ప్రచారం జరుగుతుంది. 

- ఇటీవల చీరాలలో రేషన్‌ బియ్యం పట్టుబడితే ముఖ్య నాయకులతో ఫోన్‌ చేయిస్తామంటూ అక్రమార్కులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

- చుండూరు మండల పరిధిలోని చినగాదెల వర్రులోని 25 ఎకరాల విస్తీర్ణంలో మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. దీనిని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిని చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడడం వారి ఆగడాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది.

- నిబంధనల ప్రకారం గ్రానైట్‌ లారీకి ప్రభుత్వానికి దాదాపు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదేమీ లేకుండా అక్కడున్న అధికారపార్టీ నాయకులకు కప్పం చెల్లిస్తే రాజమార్గంలో లారీలు వెళ్లిపోవచ్చు. ఈ వ్యవహారంలో అక్రమార్కుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరి ఘర్షణ పడిన ఽఘటన తాజాగా మార్టూరులో జరిగింది. దానికి కొనసాగింపు గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గ్రామంలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

- వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో గుండ్లకమ్మ నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతోంది. ఒక్కో ట్రిప్పుకు రూ.1000 చొప్పున వసూలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. జగనన్న కాలనీ బిల్లులతో అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. 

- ఇవన్నీ ఒక ఎత్తయితే బల్లికురవ మండలంలో ఇటీవల వ్యవసాయశాఖకు చెందిన ఓ ఉద్యోగి నుంచి మండలస్థాయి అధికారపార్టీ నాయకులు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో అతను చేసిన తప్పులను ఎత్తి చూపుతూ సస్పెండ్‌ కాకుండా ఉండాలంటే ఎంతో కొంత ముట్టచెప్పాలని తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. తీరా పై అధికారులు అతడిపై చర్యలు తీసుకోవడంతో సదరు ఉద్యోగి ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. తర్వాత అతడి నోరును కూడా అధికారపార్టీ నాయకులు మూయించగలిగారు. ఇవన్నీ కూడా గత నెలరోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలు.  

- రేపల్లె ప్రాంతంలో క్రికెట్‌ బెట్టింగ్‌లో స్థానిక నాయకుడొకరు అన్నీ తానై వ్యవహరిస్తుండగా అతడికి ముఖ్యనాయకుల అండదండలున్నాయని సమాచారం.

- డెల్టా ప్రాంతంలో అక్రమ మట్టి తవ్వకాలతో పాటు ఇసుకను కూడా బుసకగా చెప్పి తవ్వుకుంటున్నారన్నా ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త లీజు పొందిన  సంస్థ తాలూకా ప్రతినిధులు  దీనిపై  కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం. కానీ చాలా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు పనిచేయడంతో విషయం వెలుగులోకి రాలేదనేది సమాచారంగా ఉంది


దందాలపై కలెకర్‌ సీరియస్‌..

దాడులు చేస్తున్నా పరంపరగా రేషన్‌ పట్టుబడడం, ఇసుక, మట్టి దందాలపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. నిబద్ధత గల అధికారులపై ఒత్తిళ్లు వచ్చినా లొంగవద్దని అండగా ఉంటాననే సంకేతాలు కూడా పంపించినట్లు సమాచారం.  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఏ పని అయినా జరగాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-07-16T05:41:04+05:30 IST