ఇంటి స్థలాల చదునులోనూ భారీ దోపిడీ

ABN , First Publish Date - 2020-07-01T07:38:57+05:30 IST

పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుల్లోనే కాకుండా ఆ భూమిని చదును చేసే పనుల్లోనూ దోపిడీకి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటి స్థలాల చదును పనులు...

ఇంటి స్థలాల చదునులోనూ భారీ దోపిడీ

ఉపాధి నిధులతో మట్టి కొనుగోలు

రెట్టింపు రేట్లకు అంచనాలు తయారు

నిబంధనలకు విరుద్ధంగా పనులు

వనరుల దోపిడీలో వినూత్న ప్రక్రియ

వైసీపీ నేతల జేబుల్లోకి1,560 కోట్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుల్లోనే కాకుండా ఆ భూమిని చదును చేసే పనుల్లోనూ దోపిడీకి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటి స్థలాల చదును పనులు వైసీపీ మండల, గ్రామ స్థాయి నేతలకు కల్పతరువులుగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి పథకం కింద చేపట్టిన ఈ పనుల్లో అధిక అంచనాలు రూపొందించి నేతలకు అప్పనంగా దోచిపెట్టేందుకు మార్గం సుగమం చేశారు. కూలీల కోసం తెచ్చిన ఈ పథకాన్ని వైసీపీ కార్యకర్తల జేబులు నింపే పథకంగా మార్చారంటున్నారు. సిమెంట్‌, ఇటుకలు కొన్నట్లుగానే, మట్టిని కొనుగోలు చేస్తున్నట్లు ఎస్టిమేట్లలో చూపించి రూ.1,560 కోట్ల మేర ఉపాధి నిధులను వైసీపీ నేతలు జేబుల్లో వేసుకుంటున్నారని ఫిర్యాదులొస్తున్నాయి.


మట్టి కొనుగోలు స్కాం...

ప్రభుత్వ పనులకు మట్టి కొనుగోలు చేసినట్లు గతంలో ఎక్కడైనా చూశారా? ఇప్పుడు ఇంటి స్థలాల చదును పనుల్లో జరిగే తంతు ఇదే. పైగా ప్రభుత్వ స్థలంలో మట్టిని తెచ్చి దాన్ని కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకునే విన్నూత్న దోపిడీ కొనసాగుతోంది. ఇంటి స్థలాలు చదునుకు ఎకరాకు సుమారు 4 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరమని అంచనాలు వేశారు. ఇందుకోసం ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు రూ.230 నుంచి రూ.300 దాకా రేట్లు నిర్ణయించి ఎకరా స్థలం లెవలింగ్‌ చేసేందుకు సుమారు రూ.10 లక్షలకు పైగా అంచనాలను తయారుచేశారు. అయితే, దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా అచ్చంగా ఇందులో కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ అనే పేరుతో క్యూబిక్‌ మీటర్‌కు రూ.134.34 ధర నిర్ణయించారు. వాస్తవానికి క్యూబిక్‌ మీటర్‌ మట్టి తవ్వి తీసేందుకు ఏ రకంగా రేట్‌ నిర్ణయించినా రూ.34కు మించదు. అంటే మిగిలిన రూ.100 ఉచితంగా ఇస్తున్నట్లే. ప్రభుత్వ స్థలంలో సేకరించే మట్టికి ఉపాధి నిధుల కింద ఎందుకు చెల్లింపులు చేయాలన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కేంద్రమిచ్చే ఉపాధి నిధులను వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టడమే పరమావధిగా అధికారులు చర్యలున్నాయని అంటున్నారు. 


చదునుకు రూ.2,613 కోట్లు..

రాష్ట్ర వ్యాప్తంగా 20,007 పనుల ద్వారా 39వేల ఎకరాల్లో రూ.2613 కోట్లతో ఇంటి స్థలాలను చదును చేసే పనులు చేపడుతున్నారు. ఇందుకోసం 15.60 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని వాడాల్సి ఉంది. మొత్తం ఈ పనుల అంచనా విలువలో రూ.2,104 కోట్ల మేర మెటీరియల్‌ పనుల కోసం, రూ.509 కోట్లతో కూలీలకు పనులు కల్పించాల్సి ఉంది. మట్టి సేకరణలో కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ క్యూబిక్‌ మీటర్‌కు రూ.134.34 చొప్పున నిర్ణయించిన మొత్తంలో రూ.100కు పైగా కేవలం పనులు చేపట్టిన వారికిఆదాయం కల్పించేందుకు ఉద్దేశించినదే. దీంతో  కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ పేరుతో మొత్తం రూ.1,560 కోట్లు అప్పనంగా కాజేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  


ఉపాధి పనుల్లో యంత్రాలు..

ఇది ఉపాధి హామీ పథకం కూలీల కోసం ఉద్దేశించిన పథకం. దీని ద్వారా చేపట్టే పనులన్నీ కూలీలకు పని కల్పించేవిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోను యంత్రాలు వాడరాదు. కూలీల వల్లకాని సందర్భంలోనే ట్రాక్టర్లు, రోలర్లు వంటి కొన్ని సూచించిన యంత్రాలను మాత్రమే వినియోగించాలి. జేసీబీ, పొక్లెయిన్లు ఈ పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదు. అయితే కూలీలతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టలేమంటూ, నిబంధనలకు విరుద్దమైనప్పటికీ మెటీరియల్‌ నిధుల కింద చేపట్టారు. యంత్రాలు వాడితే ఫిర్యాదులొస్తాయన్న ఉద్దేశంతో కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ను ఎస్టిమేట్‌లో చేర్చారు. మెషిన్లు యథేచ్ఛగా వినియోగించడంతో ఈ పనుల్లో కూలీల భాగస్వామ్యం 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. 

Updated Date - 2020-07-01T07:38:57+05:30 IST