పేదల స్థలాలూ ఆక్రమణ

ABN , First Publish Date - 2022-01-18T06:39:14+05:30 IST

పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికార పార్టీ మద్దతుదారులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. ఆనక వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ రియల్‌ దందా సాగిస్తున్నారు.

పేదల స్థలాలూ ఆక్రమణ

వైసీపీ నేతల కబ్జాలపర్వం 

నలభై ప్లాట్లదాకా విక్రయాలు 

రూ.50 లక్షలకుపైగా లావాదేవీలు

ఫిర్యాదుల స్వీకరణకే అధికారులు పరిమితం

రాయదుర్గంటౌన్‌, జనవరి 17: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికార పార్టీ మద్దతుదారులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. ఆనక వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ రియల్‌ దందా సాగిస్తున్నారు. రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులకు కాసులు ముట్టజెబుతూ ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలైన ఆ స్థలాల లబ్ధిదారులు.. తమకు వాటిల్లిన అన్యాయంపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. వారు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమవుతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

ప్రభుత్వ లేఔట్లలోని ఖాళీ స్థలాలను కొందరు వైసీపీ మద్దతుదారులు కబ్జాలు చేస్తూ క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కబ్జాల దందా జోరుగా సాగుతోంది. ఇష్టానుసారంగా కబ్జాలు చేసి, విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కబ్జాల దందా చివరకు ప్రభుత్వ లేఔట్ల వరకు విస్తరించింది. రాయదుర్గం పట్టణంలో కొందరు వైసీపీ నాయకులు నేరుగా దందా చేస్తుండగా.. మరికొందరు కీలక నాయకులకు మద్దతుదారులుగా ఉంటూ వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా ప్రభుత్వం.. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం కబ్జా చేసి, విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు బాధితులు.. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే పరిస్థితిలో లేరనే వాదన వినిపిస్తోంది. అధికార అండతో రెచ్చిపోతున్న కొందరు వైసీపీ నాయకుల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ఆ మూడు సర్వే నెంబర్లలో కబ్జాల పర్వం 

పట్టణంలోని ఆంజనేయస్వామి ప్రభుత్వ మున్సిపల్‌ లేఔట్‌లోని 496, 497, 498 సర్వే నెంబర్లలో కబ్జాల వ్యవహారం జోరందుకున్నట్లు తీవ్ర చర్చ సాగుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి అనుచరులిద్దరు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి, వాటిని విక్రయించి రియల్‌ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కబ్జా చేసిన స్థలాలను ప్లాట్ల రూపంలో అమ్ముతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కొందరు లబ్ధిదారులు పునాదులు వేసుకున్నప్పటికీ వారిని సైతం బెదిరించి, ఆ స్థలాలను ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. లేఔట్లపై పెత్తనం చెలాయిస్తూ ఖాళీగా ఉండే స్థలాలపై ఆరాతీసి, వాటిని ఇతరులకు అమ్మేసి, సొమ్ము చేసుకుంటున్నారు.


రూ.50 లక్షల దాకా వ్యాపారం

కబ్జా చేస్తున్న స్థలాలను మార్కెట్లో విక్రయించి, సొమ్ము చేసుకోవడంలో ఆరితేరారు. ఇప్పటికే 40 ప్లాట్లదాకా ఇదే తరహాలో విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో ప్లాటు విస్తీర్ణాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నట్లు తెలియవచ్చింది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన రూ.50 లక్షల దాకా క్రయవిక్రయాల వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. వీటిని కబ్జా చేసిన అనంతరం కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ శాఖలో కొందరు తమకు అనుకూలమైన అధికారులకు పైసలు ముట్టజెప్పి, పట్టాలు ఇచ్చేలా వ్యవహారం పకడ్బందీగా నడిపిస్తున్నట్లు తెలియవచ్చింది. వీటన్నింటిపై అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారన్న విమర్శలొస్తున్నాయి. ముడుపులు ముట్టజెబుతుండటంతో అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితిలో లేరని తెలిసింది. అధికారులు కూడా వైసీపీ నాయకులకు మద్దతు పలుకుతుండటంతో బాధితులు ఎవరికి చెప్పాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడు లేడని పెదవి విరుస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం

సూర్యప్రతాప్‌, ఇనచార్జ్‌ తహసీల్దార్‌, రాయదుర్గం

ఆంజనేయస్వామి లేఔట్‌లో అక్రమంగా ప్లాట్లను విక్రయించడం, కబ్జాలు చేయడం లాంటివి మా దృష్టికి రాలేదు. వీటిపై వెంటనే దృష్టి పెట్టి, క్షేత్రస్థాయిలో విచారిస్తాం. అలాంటివి జరిగి వుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2022-01-18T06:39:14+05:30 IST