Abn logo
Sep 26 2021 @ 23:58PM

గిద్దలూరులో వైసీపీ నేతల డిష్యుండిష్యుం

గిద్దలూరులోని రాచర్ల గేటు వద్ద ధర్నా చేస్తున్న ఎంపీపీ వ్యతిరేక వర్గీయులు

పోటాపోటీగా సభలు, ఘర్షణ

పలువురికి గాయాలు

భారీ ధర్నాతో నిరసన తెలిపిన అసమ్మతి వర్గం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

గిద్దలూరు మండలంలో అధికార వైసీపీలోని ఇరువర్గాల వారు ఆదివారం ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతోపాటు కర్రలతో కొట్టుకున్నారు. హైవేపై రాత్రి ఒకవర్గం వారు ధర్నా నిర్వహించి ఇటు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, అటు పోలీసు అధికారుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇటు గిద్దలూరు నగర పంచాయతీ, అటు పొదలకుంటపల్లిలో వైసీపీ శ్రేణుల వీరంగంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గిద్దలూరు ఎంపీపీగా పొదలకుంటపల్లికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు వంశీఽధర్‌రెడ్డి సతీమణిని ఎమ్మెల్యే ఎంపిక చేశారు.  ఆదివారం గిద్దలూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో వంశీ స్వగ్రామమైన పొదలకుంటపల్లిలో ఆయన వ్యతిరేక వర్గం జయరామిరెడ్డి ఆధ్వర్యంలో మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బలహీన వర్గాలకు చెందిన ఆ గ్రామ సర్పంచ్‌, ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు కూడా ఎంపీపీ వ్యతిరేక వర్గంవైపు నిలిచారు. గిద్దలూరులో వంశీ విజయోత్సవ ర్యాలీకి ఎమ్మెల్యే రాంబాబు హాజరుకాగా, పొదలకుంటపల్లిలో అసమ్మతి వర్గం నిర్వహించిన సభలో  ఇటీవల గెలుపొందిన జడ్పీటీసీ సభ్యుడు మధుసూదనయాదవ్‌, ఇతర ముఖ్యులు  పాల్గొన్నారు. అనూహ్యంగా ఆదివారం సాయంత్రం ఎంపీపీ భర్త వంశీధర్‌రెడ్డి  ఆధ్వర్యంలో ఆయన అనుయాయులు పొదలకుంటపల్లిలో కూడా ర్యాలీ చేపట్టారు. ఆ సందర్భంగా ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పలువురు గాయపడ్డారు. పోలీసుల ప్రేక్షకపాత్ర వహించారు. సాయంత్రం అసమ్మతివర్గానికి చెందిన వైసీపీ శ్రేణులంతా గిద్దలూరు తరలివచ్చి ధర్నా చేశారు. పరిస్థితి తెలిసి కూడా వంశీధర్‌రెడ్డి వర్గానికి చెందిన వారిని ఎమ్మెల్యే తమపై ఉసిగొల్పారని రాంబాబుపై ధ్వజమెత్తారు. పెద్దల సహకారంతోనే ప్రత్యర్థివర్గం వారు తమ ఇళ్ల ముందుకు వచ్చి వచ్చి చిందులు తొక్కి దాడి చేశారని ఆరోపించారు. ఇటు పోలీసులు, అటు ఎమ్మెల్యే ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేసినట్లు ప్రకటించారు. దీంతో అటు పొదలకుంటపల్లిలోనూ, ఇటు గిద్దలూరులోనూ ఉద్రికత్త వాతావరణం నెలకొంది.