అరాచకీయం

ABN , First Publish Date - 2022-01-20T06:41:06+05:30 IST

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో జూద శిబిరాలను నిర్వహిస్తున్న వైసీపీ నేతలు తమను వీడియో తీసిన యువకుడిపై దాడికి తెగబడిన ఘటన జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో జరిగింది.

అరాచకీయం
గాయపడిన సురేష్‌

గంగినేనిపాలెంలో వైసీపీ నేతల అకృత్యాలు

డీవైఎఫ్‌ఐ ముగ్గుల పోటీలపై ఆంక్షలు

సంప్రదాయం ముసుగులో జూదం

కోతముక్కలో కూర్చున్న సర్పంచ్‌

వీడియో తీసిన డీవైఎఫ్‌ఐ నేతపై హత్యాయత్నం

మరో ఇద్దరు దళిత యువకులపై మూకుమ్మడి దాడి

కేసు నమోదు చేసి 24 గంటలు దాటినా చర్యలు నిల్‌ 


విజయవాడ, జనవరి 19 : సంక్రాంతి సంప్రదాయం ముసుగులో జూద శిబిరాలను నిర్వహిస్తున్న వైసీపీ నేతలు తమను వీడియో తీసిన యువకుడిపై దాడికి తెగబడిన ఘటన జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో జరిగింది. తమను వీడియోలో బంధించారనే ఆగ్రహంతో గ్రామ సర్పంచ్‌ పిల్లి రామారావు, ఎంపీటీసీ సభ్యుడు పిల్లి ప్రసాద్‌లు 30 మందితో కలిసి మండల డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు సంగీత సురేష్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ అన్నదమ్ముల దాడిలో సురేష్‌తో పాటు మరో ఇద్దరు దళిత యువకులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. 


ముగ్గుల పోటీలను అడ్డుకొని..

సంక్రాంతి సంబరాల్లో భాగంగా డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గంగినేనిపాలెం గ్రామంలో సురేష్‌ ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశాడు. దీంతో అన్నదమ్ములైన పిల్లి రామారావు, పిల్లి ప్రసాద్‌ సురేష్‌ను పిలిచి ‘గ్రామంలో మేం ఉండగా ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు మీరెవరు?’ అంటూ బెదిరించి,  నిలిపివేయించారు. అనంతరం వారే ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆ తరువాత సంక్రాంతి సందర్భంగా జరిగిన కోత ముక్కలో నేరుగా సర్పంచ్‌ పిల్లి రామారావు డబ్బులు పంచడం చూసిన సురేష్‌ రహస్యంగా వీడియో తీశాడు. అది తెలిసిన అన్నదమ్ములిద్దరూ సురేష్‌పై దాడి చేసేందుకు స్కెచ్‌ వేశారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఓ పెద్దకర్మకు సురేష్‌తో పాటు చిరంజీవి, చంటి అనే యువకులు వెళ్లారు. ఇది గమనించిన అన్నదమ్ములు తమ మనుషులను పంపి, సురేష్‌ తదితరులు గొడవకు దిగేలా ప్రేరేపించారు. ఆ సమాచారాన్ని అన్నదమ్ములకు అందించారు. దీంతో సుమారు 30 మందితో కలిసి వెళ్లి, సర్పంచ్‌ రామారావు, ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్‌లు సురేష్‌పైన, అతనితో ఉన్న ఇద్దరు దళిత యువకులపైన దాడికి పాల్పడ్డారు. గ్రామంలో దళిత యువకులు అడ్డుపడకుంటే సురేష్‌ను హతమార్చేవారని ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులంటున్నారు. 


24 గంటలు గడిచినా చర్యల్లేవు

తొలుత కేసు తీసుకొని జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు కానీ, వైసీపీ అగ్ర నేతల ఒత్తిడితో దళిత యువకులపై దాడికి పాల్పడిన నిందితులపై 24 గంటలు దాటినా చర్యలు తీసుకోలేదు.


తక్షణమే చర్యలు తీసుకోవాలి : దేవినేని ఉమ

ఎస్సీలపై దాడి చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సంప్రదాయం ముసుగులో జూద శిబిరాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతల ఆగడాలను అడ్డుకున్నందుకు ముగ్గురు దళిత యువకులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన వైసీపీకి చెందిన సర్పంచ్‌ పిల్లి రామారావు, పిల్లి ప్రసాద్‌లతో పాటు దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ విషయంపై మైలవరం ప్రజాప్రతినిధి నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా క్యాసినో వంటి అరాచక సంస్కృతిని తీసుకొచ్చి, గుడివాడ పరువు తీసిన మంత్రి మాదిరిగానే మిగిలిన చోట్ల కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడి అమానుష చర్య అని, పాల్పడినవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  


రెండు స్టేషన్లు తిప్పారు

సురేష్‌పై దాడికి పాల్పడినవారిపై ఫిర్యాదు చేసేందుకు తొలుత జి.కొండూరు పోలీసుల వద్దకు వెళ్లగా, ఎర్రుపాలెం మండలంలో పెట్టుకోమని చెప్పారు. ఎర్రుపాలెంలో పిల్లి రామారావు, పిల్లి ప్రసాద్‌తో పాటు మరో నలుగురుపై ఫిర్యాదు చేశాం. వాళ్లు ఘటనా స్థలిని పరిశీలించి, ఘటన జరిగిన ప్రదేశం జి.కొండూరు పీఎస్‌ పరిధిలోనిదని చెప్పారు. కేవీపీఎస్‌, డీవైఎఫ్‌ఐ నేతలు కలిసి జి.కొండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. బుధవారం మధ్యాహ్నం ఎఫ్‌ఐఆర్‌ కాఫీ ఇచ్చారు. - కొంకా బాలకృష్ణ, మండల సీఐటీయూ కార్యదర్శి


దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌ 

జి.కొండూరు : జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో దళితులపై దాడిచేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులను తక్షణం అరెస్టు చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జె.శ్రావణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన గంగినేనిపాలెంలో వైసీపీ సర్పంచ్‌ పిల్లి రామారావు, ఎంపీటీసీ సభ్యడు పిల్లి ప్రసాద్‌, తదితర వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన సంగీత సురేష్‌, వరగాల చిరంజీవి, ఇనపనూరు చంటిల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దళితులపైనే దాడులు చేస్తున్నదన్నారు. దాడిపై కేసు నమోదై 24 గంటలు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో నూజివీడు డీఎస్పీ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. తక్షణం దళితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం స్పందించని పక్షంలో 24 గంటల్లో తగిన ప్రణాళికతో రోడ్డెక్కుతామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ తక్షణమే నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలన్నారు.



Updated Date - 2022-01-20T06:41:06+05:30 IST