Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెజవాడలో రచ్చ.. రచ్చ.. సీఎం జగన్ ఫైర్‌

వైసీపీలోని ఇరువర్గాల వీరంగం

మద్దిశెట్టి, బూచేపల్లిపై సీఎం జగన్‌ ఫైర్‌

యద్దనపూడిలో ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్‌?

పలుచోట్ల లక్షలు పలుకుతున్న ప్రాదేశిక సభ్యుడి ఓటు రేటు

దర్శి, కొండపి, పర్చూరులో ఆరంభమైన క్యాంపు రాజకీయాలు

కనిగిరిలో ఎమ్మెల్యే కులాభిమానంపై తిరుగుబాటు ప్రయత్నం

నేతలపై మంత్రి బాలినేని మండిపాటు


(ఒంగోలు, ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపికపై అధికార వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. కొందరు నేతలు మంత్రి బాలినేని, సీఎం ఇంటి వద్ద బలప్రదర్శన చేశారు. మరికొందరు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసే వ్యవహారాలకూ తెరతీశారు. చివరకు సభ్యులను కిడ్నాప్‌ చేసే స్థాయికి పరిస్థితి చేరింది. ఒకవైపు ఎక్కడికక్కడ స్థానికంగానే గూడుపుఠాణీలు జరుగుతుండగా, మరికొన్ని మండలాల వ్యవహారాలు రాజధానికి చేరాయి. అక్కడ తొలుత మంత్రి బాలినేని.. ఆపై పార్టీ జిల్లా ఇన్‌చార్జి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద, చివరకు దర్శి నేతలు ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా ఢీ అంటే ఢీ అన్నారు.


జిల్లాలో అధికార వైసీపీలో ఆరంభమైన వర్గ విభేదాలు బెజవాడలో భగ్గుమన్నాయి. పలు నియోజకవర్గాల నుంచి తరలివెళ్లిన ఇరువర్గాల వారు తొలుత విజయవాడలోని మంత్రి బాలినేని ఇంటి వద్ద, సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మోహరించారు. ఇతర నియోజకవర్గాల నేతలకు సర్దిచెప్పి పంపిన బాలినేని దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలానికి చెందిన వైరివర్గాల వారిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముండ్లమూరు మండలానికి చెందిన వైసీపీలోని ఇరువర్గాల వారు ఢీ అంటే ఢీ అనటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ తర్వాత సీఎం జగన్‌ తనను కలిసిన ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై మండిపడ్డారు.ఇంకోవైపు యద్దనపూడి మండలంలో ఎంపీటీసీని వైసీపీలోని ఇంకోవర్గం నాయకులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. దీంతో పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. అక్కడే మరో రెండు మండలాల వ్యవహారంపై మంత్రి బాలినేని వద్ద ఇరువర్గాలు బారులు తీరారు. కొండపి ఎంపీపీ పదవిపై కూడా మంత్రి వద్ద పంచాయితీ జరగ్గా, అక్కడ కూడా క్యాంపు రాజకీయం ప్రారంభమైంది. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కులాభిమానం చూపిస్తున్నారంటూ ఇతర సామాజికవర్గాలకు చెందిన నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇలా ఇతరత్రా పలు నియోజకవర్గాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపికలపై అధికారపార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి.  


మద్దిశెట్టి, బూచేపల్లిపై సీఎం ఫైర్‌

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముండ్లమూరు ఎంపీపీ పదవిపై ఇరువురు ఢీ అంటే ఢీ అనుకుంటున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం తొలుత మద్దిశెట్టికి అనుకూలంగా ఉండే ముండ్లమూరు మండల నాయకులు బాలినేనిని కలిసి తమ వాదనను వినిపించారు. ఎంపీపీ అభ్యర్థిగా భావిస్తున్న మహిళ భర్త బ్రహ్మారెడ్డి తాను తొలి నుంచి పార్టీలో ఉంటున్నానని, తనకు అన్యాయం చేయవద్దంటూ మంత్రి వద్ద వాపోయారు. వారి తరఫున ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కూడా మరోసారి తన వాదన వినిపించారు. మధ్యాహ్నం తర్వాత బూచేపల్లికి అనుకూలంగా ఉన్న వెంకటేశ్వరెడ్డి ఇతరులు మంత్రి బాలినేనిని కలిశారు. వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన వారిలో ఏడుగురు తమ వైపు ఉన్నారని వివరించారు. అనంతరం బాలినేని సూచనతో ఇరువర్గాల వారు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని కలిశారు.


ఒకవైపు ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే నిల్చొని వేమిరెడ్డికి వారి వాదనలు వినిపించారు. ఎంతకీ తగ్గకపోవటంతో మంత్రి బాలినేని ఇరువురినీ సీఎం వద్దకు తీసుకుపోయారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయం వద్ద నేతల అనుచరులు భారీగా మోహరించారు. ఒకరిపై ఒకరు కలబడే ప్రయత్నం చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాగా తనను కలిసిన వేణుగోపాల్‌, శివప్రసాద్‌రెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బూచేపల్లి వెంకాయమ్మకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ‘పార్టీపరంగా మీరిద్దరు కలిసి పనిచేయాల్సిందే, కొన్ని సందర్భాల్లో మీ ఇద్దరి వ్యవహారం ఇబ్బందికరంగా ఉంది. పద్ధతి మార్చుకోండి’ అంటూ ఆగ్రహించారు. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు కలిసి పనిచేయాల్సిందే అంటూ సూచించారు. ఆ ఇద్దరిని ఒక దారిలో నడిపే బాధ్యతను తీసుకోవాలని వెంకాయమ్మను కోరారు. మద్దిశెట్టి గెలుపునకు పనిచేసినా తమకు సహకరించటం లేదని ఈ సందర్భంగా వెంకాయమ్మ సీఎంకు ఫిర్యాదు చేశారు. శివప్రసాద్‌రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని మద్దిశెట్టి వివరించారు.


వెంటనే సీఎం మంత్రి బాలినేని, ఇన్‌చార్జి వేమిరెడ్డి ప్రత్యేక జోక్యంతో వారానికో రోజు వారిద్దరితో మాట్లాడుతూ పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ముండ్లమూరు ఎంపీపీ పదవిపై చర్చకు రాగా ఇద్దరు కలిసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేకు ఉండే ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ బాలినేనిని ఆదేశించినట్లు సమాచారం. అధిష్ఠానం ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారినే ఎంపీపీ చేయాలని ఇద్దరి నేతలకు సూటిగా చెప్పినట్లే సమాచారం. 


ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్‌..

పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి మండలంలోని ఒక ఎంపీటీసీని వైసీపీలోని ఒక గ్రూపు వారు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై హైరానా పడిన పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. అనంతవరం నుంచి గెలుపొందిన ఇందిరాదేవిని ఎంపీపీ అభ్యర్థిగా భావించారు. మొత్తం ఏడుగురు ఎంపీటీసీల్లో నలుగురు ఇందిరా దేవి భర్త బ్రహ్మం వైపు నిలిచారు. అయితే వీరికి, నియోజకవర్గ ఇన్‌చార్జి రామనాథంబాబు మధ్య సఖ్యత లేదు. దీంతో ఆయన వర్గానికి చెందిన గ్రూపు నాయకులు వ్యతిరేక గ్రూపునకు చెందిన యనమదల ఎంపీటీసీ శ్యాంసన్‌ను కిడ్నాప్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు మంత్రికి ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడ ఇరువర్గాల వారు క్యాంపులు నిర్వహిస్తున్నారు. మార్టూరు వైస్‌ ఎంపీపీ పదవిపై కూడా ఇరువర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇన్‌చార్జి రామనాథంబాబు ఒకరిని ప్రతిపాదించగా సీనియర్‌ నాయకుడు ఉప్పలపాటి చెంగలయ్య స్వగ్రామానికి చెందిన ఎంపీటీసీ వైస్‌ చైర్మన్‌ పదవికి ప్రతిపాదించారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వ్యవహారం రచ్చకెక్కి ఎంపీటీసీల సమీకరణకు శ్రీకారం పలికారు. చెంగలయ్య మంగళవారం మంత్రిని కలిసి తమ వాదనను వినిపించారు. 


కొండపిలోనూ క్యాంపు రాజకీయాలు 

కొండపి ఎంపీపీ పదవిపై కూడా క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మండల కన్వీనర్‌ జీవీ ఆధ్వర్యంలో ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో విజయవాడలో శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిసింది. మొత్తం 12 మంది ఎంపీటీసీల్లో 11 మంది వైసీపీ తరఫున గెలుపొందారు. వెన్నూరు ఎంపీటీసీ స్వప్నకుమారికి దివి వర్గం మద్దతు ఇస్తుండగా, పెట్లూరు ఎంపీటీసీకి ప్రత్యర్థి వర్గం మద్దతునిచ్చింది. ఈ విషయమై మంత్రి వద్ద పంచాయితీ జరిగి చివరకు ఇరువురికి కాకుండా పెరిదేపి నుంచి గెలిచిన ఎంపీటీసీని ఎంపీపీ చేయాలని భావించారు. వైస్‌ ఎంపీపీ పదవి ఉప్పలపాడుకు చెందిన పిచ్చిరెడ్డి భార్యకు ఇవ్వాలని ఒక వర్గం, కాదని ఇంకో వర్గం భీష్మించాయి. ఈనేపథ్యంలో మంగళవారం మంత్రి బాలినేని వద్ద కూడా పంచాయితీ జరిగింది. ఇన్‌చార్జి వెంకయ్య మాట తప్పారంటూ పార్టీ నాయకుడు జీవీ ఆయనపై మండిపడ్డారు. తదనంతరం జీవీ విజయవాడలో క్యాంపు ప్రారంభించారు. దీనికితోడు జరుగుమల్లి వ్యవహారం కూడా బాలినేని వద్ద చర్చకు వచ్చినట్లు తెలిసింది. 


కనిగిరిలో రసవత్తరం

కనిగిరి నియోజకవర్గంలోనూ వెలిగండ్ల ఎంపీపీ వ్యవహారం రసవత్తరంగా మారింది. తొలుత రెడ్డి సామాజికవర్గానికి ఎంపీపీ అని అనుకోగా ఎమ్మెల్యే బుర్రా యాదవులకు ఎంపీపీ పదవి ఇవ్వాలని భావించారు. జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు రెండూ రెడ్లకు ఇవ్వడం సమంజసం కాదని బుర్రా వాదనగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం ఎమ్యెల్యేను విభేదిస్తూ ఢీ అంటే ఢీ అంటున్నారు. అంతేకాకుండా సీఎస్‌పురంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు రెండూ యాదవ సామాజికవర్గానికే కేటాయించటాన్ని ప్రశ్నిస్తూ పోరుకు సన్నద్ధమయ్యారు. కనిగిరి ఎంపీపీ పదవికి దళిత వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ప్రకాశం పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే మరొకరి పేరు ప్రతిపాదించారని అనుమానించటంతో ఇ రువర్గాలు రగిలిపోతున్నాయి. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో బేస్తవారపేట, రాచర్ల ఎంపీపీ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోగా అక్కడా గ్రూపు రాజకీయాలతో అట్టుడికిపోతోంది. జిల్లాలోని పలు మండలాల వ్యవహారంపై మంత్రి బాలినేని వద్ద పంచాయితీ జరిగనట్లు సమాచారం.


దీంతో ఆయన ఆయావర్గాల వారిపై మండిపడుతూ అభ్యర్థులను పార్టీ నిర్ణయించి సమాచారం సీల్డు కవర్‌లో పంపుతుందని చెప్పారు. వారికి మద్దతు ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిం చినట్లు సమాచారం. కాగా మండల పరిషత్‌ పదవుల ఎన్నికలకు మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో మరి కొన్ని మండలాలకు సంబంధించి కూడా లోలోపల జరుగుతున్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తోంది.


సీఎం జగన్‌కు బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి. పక్కన దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మంత్రి బాలినేని


Advertisement
Advertisement