ఉండలేం.. ఉతికేద్దాం!

ABN , First Publish Date - 2020-11-25T06:52:27+05:30 IST

జిల్లా వైసీపీని వరుసపెట్టి అంతర్గత కుమ్ములాటలు..

ఉండలేం.. ఉతికేద్దాం!

అధికార వైసీపీలో రచ్చకెక్కుతున్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు

ఇంతకాలంగా ఒకరికొకరు నవ్వులు పులుముకుని, లోపల కత్తులతో కుతకుతలు

ఏడాదిన్నరగా ఓపిగ్గా భరించి ఇప్పుడు మింగలేక ఎక్కడికక్కడ కక్కేస్తున్న వైనం

బోస్‌పై ద్వారంపూడి తిట్ల దండకంతో వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

అనేక నియోజకవర్గాల్లో ద్వారంపూడి మైనింగ్‌ ఆధిపత్యంపై పార్టీ ఎమ్మెల్యేలూ భగభగ

కాకినాడలో మంత్రి కన్నబాబు, ద్వారంపూడి మధ్య అంతర్గత పోరు

రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌ వర్సస్‌ జక్కంపూడి రాజా.. మరోవైపు మంత్రి వేణు

మంత్రుల తీరుపై బహిరంగంగా నిప్పులు కక్కిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి

రామచంద్రపురంలో తోటపై బోస్‌ లేఖాస్త్రం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు అంతకంతకూ రచ్చకెక్కుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఏక్షణంలో ఏం విభేదాలు బద్ధలవుతాయో అన్నట్టు పరిస్థితులు ముదిరిపాకాన పడుతున్నాయి. ఏడాదిన్నరగా ఎన్ని విభేదాలున్నా బయటకు పొక్కకుండా నేతలు  జాగ్రత్త పడ్డారు. లోపల ఎన్ని కత్తులున్నా బయటకు నవ్వులు పులుముకున్నారు. తీరా ఇప్పుడు మింగలేక ఎక్కడికక్కడ బహిరంగంగా కక్కేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో నేతల మధ్య కీచులాటలు ఏ రీతిలో బయటకు వస్తాయోననేలా పరిస్థితులు తలెత్తాయి. తాజాగా బోస్‌పై ద్వారంపూడి తిట్ల దండకం వీరిద్దరి మధ్య ఇన్నాళ్లు దాగున్న విభేదాల పంచాయితీని బహిర్గతం చేశాయి. కాకినాడలో మంత్రి కన్నబాబు-ద్వారంపూడి మధ్య ఆధిపత్య పోరు, రాజమహేంద్రవరంలో ఎంపీ  భరత్‌-రాజా ఢీఅంటే ఢీ అనే పరిస్థితులు, మంత్రుల తీరుపై కొండేటి వ్యాఖ్యలు, మొన్న తోటపై బోస్‌ లేఖాస్త్రం.. ఇలా వరుస కుమ్ములాటలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.


జిల్లా వైసీపీని వరుసపెట్టి అంతర్గత కుమ్ములాటలు కమ్మేస్తున్నాయి. అధికారపార్టీ నేతలు ఎక్కడికక్కడ తమ మధ్య విభేదాలను బయటపెట్టుకుంటున్నారు. అధికారం అడ్డంపెట్టుకుని ఆధిపత్యం చెలాయించే క్రమంలో ఒకరికొకరు ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటూ కుమ్ములాటల వరకు వెళుతున్నారు. సోమవారం డీఆర్సీ సాక్షిగా ఎంపీ బోస్‌.. ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టిడ్కో ఇళ్ల అవినీతిపై ప్రశ్నించిన బోస్‌పై ద్వారంపూడి బూతు పురాణం విప్పడం సంచలనమైంది. తన సొంత బంధువుల వద్దే టిడ్కో ఇళ్ల కోసం పార్టీలో కొందరు లంచం తీసుకోవడంపై బోస్‌ ద్వారంపూడిపై మండిపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ద్వారంపూడి మైనింగ్‌ పెత్తనంపై బోస్‌ ఆది నుంచీ ఆగ్రహంగా ఉన్నారు. మండపేట మండలం కేశవరం మైనింగ్‌లోను బోస్‌కు ద్వారంపూడి నుంచి చుక్కలు కనిపించడం కూడా సోమవారం వివాదానికి ఓ తెరవెనుక కారణం. అటు జిల్లా కీలక అధికారి పుష్కల అండదండలతో ద్వారంపూడి మైనింగ్‌ ఆధిపత్యం చెలాయించడాన్ని అనేకమంది పార్టీ ఎమ్మెల్యేలు కూడా సహించలేక గుర్రుగా ఉన్నారు. కానీ బయటకు చెప్పుకోలేక భగభగమంటున్నారు.


ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో ఓ నేత మైనింగ్‌లో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ద్వారంపూడి పేరును పరోక్షంగా బోస్‌ డీఆర్సీలో బయటపెట్టేశారు. బోస్‌ నోటి ద్వారా ఇది బయటపడడంతో బాధిత ఎమ్మెల్యేలంతా వారంతా సంతోషంతో ఉన్నారు. కాకినాడలో మంత్రి కన్నబాబు-ద్వారంపూడి మధ్య విభేదాలు ముదిరిపోయాయి. సామాజికవర్గం పరంగా జిల్లా కీలక అధికారి, ద్వారంపూడి ఏకమై మంత్రికి విలువ లేకుండా చేస్తున్నారని అమాత్యుడి వర్గం గుర్రుగా ఉంది. జీజీహెచ్‌లో పోస్టుల దగ్గర నుంచి ఇళ్ల స్థలాల చదునుకు మట్టి అనుమతుల వరకు మంత్రి మాట కంటే ద్వారంపూడి మాటే చెల్లుబాటు అవుతోందని మంత్రిసహా ఆయన వర్గం ఆగ్రహంతో ఉంది. ఇటీవల జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభోత్సవానికి మంత్రికి తెలియకుండానే ఆయన నియోజకవర్గంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆగ్రహించిన కన్నబాబు ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. అంతేకాదు కాకినాడలో కన్నబాబు ప్రాధాన్యం తగ్గించడానికి మరో మంత్రి వేణును ద్వారంపూడి బాగా ప్రమోట్‌ చేస్తున్నారని కన్నబాబు వర్గం మండిపడుతోంది. 


అక్కడా.. అదుపు తప్పేసింది..

రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య నువ్వానేనా అన్నట్టు విభేదాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. ఆవ భూముల్లో అవినీతిపై ఒకరికొకరు బహిరంగంగా సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంత తిన్నావు అంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకున్నారు. ఇంకోపక్క వేణు మంత్రి అయ్యాక రాజమహేంద్రవరంపై పట్టుకోసం ప్రయత్నిస్తుండడం భరత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. మంత్రి గుడ్‌మార్నింగ్‌ రాజమహేంద్రవరంతోపాటు అనేక సమీక్షలు నిర్వహిస్తూ స్పీడ్‌ అవుతుం డడం భరత్‌కు నచ్చడం లేదు. దీంతో వేణు నిర్వహించే కార్యక్రమాలకు ఎంపీ దూరం పాటిస్తున్నారు. 


ఇటీవల పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి బహిరంగంగా మంత్రి విశ్వరూప్‌పై విరుచుకుపడ్డారు. మొదటిసారి ఎమ్మెల్యేనైన తనను తొక్కేస్తున్నారని.. మంత్రులు దుష్టశక్తుల్లా మారారంటూ మనసులో మాట కక్కేశారు. మంత్రి తీరుపై కొండేటి వర్గం అధిష్ఠానానికీ ఫిర్యాదు చేసింది. 


రామచంద్రపురంలోనూ అంతర్గత విభేదాలు బట్టబయలవుతున్నాయి. సొంత పార్టీ నేత అయిన మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తులపై ఎంపీ బోస్‌ లేఖాస్త్రం సంధించారు. తోట తన పలుకుబడితో శిరోముండనం కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని హోంమంత్రికి లేఖ రాయడం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో చేరినా త్రిమూర్తులు తనకు శాశ్వత శత్రువని ఇది వరకే బోస్‌ ప్రకటించారు. బోస్‌ లేఖతో త్రిమూర్తులు వర్గం సైతం మండిపడుతోంది. బహిరంగ లేఖలతో తోటకు ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ కేడర్‌ కారాలు మిరియాలు నూరుతోంది. ఇలా ఎక్కడికక్కడ పార్టీలో విభేదాలు బయటకు తన్నుకువస్తున్నాయి.

Updated Date - 2020-11-25T06:52:27+05:30 IST