మహిళా సర్పంచ్‌పై వైసీపీ నేతల దాడి

ABN , First Publish Date - 2022-08-04T05:08:08+05:30 IST

ఓ భూ వివాదమై నడిపల్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశంపార్టీ మద్దతు మహిళా సర్పంచ్‌ లంకలపల్లి గాయత్రిపై వైసీపీకి చెందిన వారు బుధవారం దాడి చేశారు.

మహిళా సర్పంచ్‌పై వైసీపీ నేతల దాడి
పోలీసులకు ఫిర్యాదు అందజేస్తున్న సర్పంచ్‌ గాయత్రి


 పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
భూ వివాదమే కారణం
పూసపాటిరేగ, ఆగస్టు 3:
ఓ భూ వివాదమై నడిపల్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశంపార్టీ మద్దతు మహిళా సర్పంచ్‌ లంకలపల్లి గాయత్రిపై వైసీపీకి చెందిన వారు బుధవారం దాడి చేశారు. ఘటనలో ఆమెకు  స్వల్ప గాయాలయ్యాయి. దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సర్పంచ్‌ గాయత్రి భర్త లంకలపల్లి శ్రీనివాసరావు గతంలో గ్రామంలోని సర్వే నెంబరు 10(36)లో కొంత భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నాడు. ఆ భూమి ఇంటికి దగ్గరగా ఉండటంతో రేకులషెడ్‌ వేసుకొన్నాడు. కాగా ఈభూమి తాతలు ఇచ్చారని, తమ వద్ద 1932 సంవత్సరానికి చెందిన రిజిస్టర్‌ డాక్యుమెంట్‌  ఉందని, ఆ భూమి తమదని కొంతకాలంగా అధికార పార్టీకి చెందినవారు చెబుతున్నారు. సర్పంచ్‌ భర్త కూడా తన దగ్గర ఉన్న ఆధారాలను చూపిస్తున్నాడు. ఆ భూమిపై గతంలో వేరొకరికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ జారీ అయిందని, ఆయన వద్ద తాను భూమిని కొని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నానని చెబుతున్నాడు. భూమి విషయమై కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా వైసీపీకి చెందినవారు బుధవారం రేకుల షెడ్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సర్పంచ్‌ గాయత్రి అడ్డుకుంది. ఎందుకు షెడ్‌ను తొలగిస్తున్నారని ప్రశ్నించగా ఆమెపై వైసీపీ నాయకులు దాడిచేసి అక్కడి నుంచి వెళ్లకుంటే చంపుతామని బెదిరించారని ఆమె చెబుతోంది. ఘటనను తెలుగుదేశంపార్టీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు తీవ్రంగా ఖండించారు. సర్పంచ్‌ గాయత్రి స్థానిక పోలీసులతో పాటు విజయనగరం దిశా పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.


Updated Date - 2022-08-04T05:08:08+05:30 IST