ఛీ.. నోర్ముయ్‌!

ABN , First Publish Date - 2021-05-06T08:22:23+05:30 IST

కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అన్న కోసం ఆక్సిజన్‌ అడిగిన మహిళతో ఓ వైసీపీ నేత దురుసుగా ప్రవర్తించారు. ‘‘ఛీ... నోర్ముయ్‌’’ అంటూ బెదిరించడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది

ఛీ.. నోర్ముయ్‌!

ఆక్సిజన్‌ అడిగినందుకు వైసీపీ నేత బెదిరింపులు


రాజమహేంద్రవరం సిటీ, మే 5: కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అన్న కోసం ఆక్సిజన్‌ అడిగిన  మహిళతో ఓ వైసీపీ నేత దురుసుగా ప్రవర్తించారు. ‘‘ఛీ... నోర్ముయ్‌’’ అంటూ బెదిరించడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. రావులపాలేనికి చెందిన మహ్మద్‌ అలంగీర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో కుటుంబసభ్యులు రాజమహేంద్రవరంలోని ఆదిత్య ఆస్పత్రికి మంగళవారం తరలించారు. ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. బుధవారం తమ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ లేదని పేషెంట్‌ను తీసుకుని వెళ్లిపోవాలని ఆస్పత్రి నిర్వాహకులు సూచించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నగర కోఆర్డినేటర్‌ ఆకుల సత్యనారాయణ అక్కడకు చేరుకుని బాధితుడి చెల్లెలితో మాట్లాడారు. ఆస్పత్రిలో డబ్బులు కట్టామని వెంటిలేటర్‌పై ఉన్న తన అన్నను ఆకిజన్‌ లేదని తీసుకువెళ్లమంటున్నారని తన గోడును కాస్త గట్టిగా చెప్పడంతో ఆయన కోపంతో మండిపడ్డారు.. ‘‘నువ్వు నోర్ముయ్‌... డాక్టర్లంటే ఏమనుకుంటున్నారు, మీరు కట్టిన డబ్బులు ఇచ్చేయ్యమంటరా, నేను నగర ఇన్‌చార్జిని’’ అంటూ కోపంతో ఊగిపోయారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఆస్పత్రి యాజమాన్యానికి మద్దతుగా నిలవడంతో అంతా అవాక్కయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆక్సిజన్‌ ఇవ్వమంటే ప్రభుత్వాన్ని అడగండని చెప్పారని బాధితుడి చెల్లెలు వాపోయారు. ఆకుల తీరును నిరసిస్తూ ఆస్పత్రి వద్ద ఆయన కారును బాధితుడి బంధువులు అడ్డగించారు. కాగా, ఆదిత్య ఆస్పత్రికి కరోనా చికిత్సకు అనుమతి లేదని సమాచారం. అయినా అక్కడ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. వారికి ఆక్సిజన్‌ కొరత రావడంతో గొడవలు జరిగి అనుమతి లేదనే వాస్తవం బహిర్గతమైంది.  

Updated Date - 2021-05-06T08:22:23+05:30 IST