Abn logo
Sep 16 2020 @ 11:30AM

ఆ టీడీపీ నాయకుడి పేరు వింటేనే వైసీపీ నేతలకు దడ!

ఆ టీడీపీ నాయకుడి పేరు వింటే.. ఆ నియోజకవర్గంలోని అధికార వైసీపీ నేతలకు దడ! ప్రజావ్యతిరేక విధానాలపై వినూత్న రూపాల్లో నిరసన తెలిపే ఆయన తీరు.. వారిని కంగారు పెడుతోంది. సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యే అలుపెరగని పోరాటం చేస్తుండటాన్ని అధికార పార్టీ జీర్ణించుకోవడం లేదు. ఆయన దూకుడుకు బ్రేక్ వేసేందుకు వైసీపీ వ్యూహం మార్చిందట. ఇంతకీ అధికార పార్టీ నాయకులను పరేషాన్‌ చేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనకు చెక్‌ పెట్టేందుకు వైసీపీ పెద్దలు ఎలాంటి ఎత్తుగడలకు దిగారు? వివరాలు ఈ కథనంలో చూద్దాం.


అయినా బెదరకుండా...

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ముఖ్యంగా ఇక్కడ బీసీ సామాజికవర్గ నేతలే పార్టీకి కొండంత అండ. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశాక సీన్‌ మారిపోయింది. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఒక్క 2009లోనే టీడీపీ ఓడిపోయింది. 2014లో తిరిగి టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ రామానాయుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రమంతా ఫ్యాన్‌ హవా గట్టిగా వీస్తున్న సమయంలోనూ గట్టి పోటీ ఇచ్చారు. జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వినూత్న రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అటు అసెంబ్లీలోనూ ఇటు నియోజకవర్గంలోనూ మాటల తూటాలు పేల్చుతూ అధికార పార్టీకి పంటి కింద రాయిలా మారారు. మరోవైపు నిత్యం ప్రజల్లోనే ఉండడానికి, ఏదో కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండడం వలన అటు అధికారుల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా ఏ మాత్రం నెరవకుండా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకుల్లో దడ పుట్టించేవిగా మారాయి. పాలకొల్లులో పాగా వేయడం కోసం వైసీపీ నేతలు అడుగులు వేస్తున్నట్లు వారి చర్యలను బట్టి అర్థమవుతోంది.


ఆయనకు పెద్ద పదవి ఇద్దామని...

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుకు పాలకొల్లులో చెక్‌పెట్టేందుకు వైసీపీ పెద్దలు కొత్త వ్యూహం పన్నినట్లు టాక్‌ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో నిమగ్నమైంది. ఇక్కడి ఎన్నికలను శాసించే స్థాయిలో ఉన్న బీసీలను  ప్రసన్నం చేసుకోవడానికి పదవుల పందేరానికి తెరలేపారట. ఈ ఎత్తుగడల్లో భాగంగానే జిల్లా స్థాయి, నామినేటెడ్‌ పదవులన్నీ పాలకొల్లుకే కట్టబెడుతున్నారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న బీసీ నేత కవురు శ్రీనివాస్‌ను ఆ పదవి నుంచి తప్పించి ఏకంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను చేద్దామనే ఆలోచనలో అధికార పార్టీ ఉందట. అలాగే పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్‌గా కాపు సామాజికవర్గ నేతనే నియమించాలని అనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ సర్కారు ఇటీవల బీసీ కార్పొరేషన్లకు సంబంధించి పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 50కి పైగా బీసీ కార్పొరేషన్లకు కమీటీలు వేయాలని భావించినా.. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. త్వరలోనే ఆయా కార్పొరేషన్ల పోస్టులను భర్తీకి రంగం సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక ఓటర్లను ఆకర్షించేందుకు బీసీ నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ శాతం పాలకొల్లుకు కేటాయించాలని వైసీపీ నాయకులు అధిష్టానానికి సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు పార్టీ హైకమాండ్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


మరి ఆ వ్యూహాలు పనిచేస్తాయో లేదో చూడాలి..

బీసీల ఆదరణ ఉన్న నిమ్మల రామానాయుడు వైసీపీ నాయకుల వ్యూహాలను నిశీతంగా గమనిస్తూ వారికి చెక్‌పెట్టేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారట. నియోజకవర్గంలో మరింత పట్టు బిగించే దిశగా నిమ్మల దూకుడుగా ముందుకు కదులుతున్నారని లోకల్‌గా వినిపిస్తున్న టాక్.  ప్రతీ రోజు ప్రజలకు సంబంధించిన ఏదో కార్యక్రమాన్ని భుజానకెత్తుకుని, నిత్యం వారితో మమేకమవుతున్నారట. అలాగే ప్రజావ్యతిరేక విధానాలపై జగన్ సర్కార్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు తనదైన పంథాను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లులో బలమైన నేతగా ఉన్న నిమ్మల రామానాయుడును ఢీ కొట్టేందుకు వైసీపీ వ్యూహాలు పనిచేస్తాయో..లేక బెడిసికొడతాయో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement