Abn logo
Jun 24 2021 @ 00:09AM

వైసీపీ నేత వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం

వెస్టు డీఎస్పీ కార్యాలయం వద్ద పురుగుమందు డబ్బాతో నిరసన తెలియజేస్తున్న బాధితురాలు

వెస్టు డీఎస్పీ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో  హల్‌చల్‌

గుంటూరు, జూన్‌ 23: తనను ఓ వైసీపీ నేత వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ బుధవారం ఓ మహిళ పురుగుమందు డబ్బాతో వెస్టు డీఎస్పీ కార్యాలయం ఎదుట హల్‌చల్‌ చేసింది. శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు పీకలవాగు కట్ట ప్రాంతానికి చెందిన బాధితురాలు షేక్‌ జమీలా తెలిపిన వివరాలివి...  జమీలా భర్త కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. పక్కింటికి చెందిన ఇలియాజ్‌ అనే వ్యక్తి కొంతకాలంగా తనను లైంగిక వేధింపులకు గురి చేయటమేకాక తన వద్ద వీడియోలు ఉన్నాయని, బయటపెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని బాధితురాలు వాపోయారు. వైసీపీ బూత్‌ కన్వీనర్‌గా ఉన్న ఇలియాజ్‌ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు తమ చేతిలో ఉన్నారని, తాము ఏది చెబితే అది చేస్తారని బెదిరిస్తున్నాడని అన్నారు. కొద్దిరోజులుగా ఆయన తన కారును మా ఇంటి ముందు పార్కు చేస్తుండగా.. ఇదేమిటని అడిగితే బెదిరిస్తూ తాను ఇక్కడే పెడతానంటున్నాడన్నారు. కారులో కూర్చొని మద్యం సేవిస్తుంటాడని ఆమె పేర్కొంది. ఇంటికి బాత్‌రూం లేకపోవటంతో కార్పెంటర్‌ అయిన తన భర్త రేకులు ఏర్పాటు చేశాడన్నారు. అయితే కారులో నుండి తాను స్నానానికి వెళ్లే సమయంలో ఫొటోలు కూడా తీస్తున్నాడన్నారు. ఆయన వేధింపులు తట్టుకోలేక 20 రోజుల క్రితం నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన నగరంపాలెం సీఐ రత్నస్వామి కారు అక్కడ పార్కు చేస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటని చెప్పి వెళ్లిపోయాడన్నారు. దీనిని ఇలియాజ్‌, అతని కుటుంబ సభ్యులు మరింత అలుసుగా తీసుకుని తనను హేళన చేయటమేకాక బెదిరిస్తున్నారన్నారు. నీ భర్త రోగంతో బాధపడుతున్నాడని, నాతో సహజీవనం చేయాలంటూ బెదిరిస్తున్నాడన్నారు. ఆమె పురుగుమందు తాగేందుకు ప్రయత్నిస్తుండగా భర్త, కుమారుడు, స్థానికులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే డీఎస్పీ సెలవులో ఉండటంతో గురువారం రావాలని సిబ్బంది సూచించటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.