వైసీపీలో నిరసన సమరం

ABN , First Publish Date - 2022-07-07T06:03:09+05:30 IST

పెనుకొండ వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్‌నారాయణ సోదరులపై అసమ్మతి సెగ రాజుకుంది.

వైసీపీలో నిరసన సమరం

పెనుకొండలో తారస్థాయికి విభేదాలు

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దీక్షకు 

సిద్ధమవుతున్న అసమ్మతి వర్గీయులు

అడ్డుకునేందుకు ఎమ్మెల్యే వర్గం తీవ్ర ప్రయత్నాలు

పోలీసులద్వారా బెదిరింపులు 

ఆడియో వైరల్‌ చేసిన కార్యకర్తపై కేసు.. ఇంటిపై దాడి

హిందూపురం టౌన, జూలై 6: పెనుకొండ వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్‌నారాయణ సోదరులపై అసమ్మతి సెగ రాజుకుంది. అసమ్మతి వర్గం నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డామనీ, చాలా నష్టపోయామనీ, అయినా ఎమ్మెల్యే సోదరులు తమపై వివక్ష చూపుతున్నారని నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈనెల 8న పెనుకొండలోని ఆయన విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని, నిరసన దీక్ష చేపడతామని సోషల్‌ మీడియాలో వారు పోస్టులు పెట్టడం అధికార పార్టీలో కలకలం రే పింది. మూడేళ్లుగా వర్గ విభేదాలున్నా.. ఈ స్థాయిలో బహిర్గ తం కాలేదు. విమర్శలు, ప్రతి విమర్శలతోనే సరిపెట్టుకున్నా రు. ఒక్కొక్కరుగా అసమ్మతి నాయకులు బయట కు రావడంతో అధికార పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో కొంతమంది నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు. 


అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు 

ఈనెల 8న కళ్లకు గంతలు కట్టుకుని, నిరసన దీక్ష చేపడతామని అసమ్మతి నాయకులు ప్రకటించడంపై ఎమ్మెల్యే వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సోదరుల ఆదేశాల మేరకు పోస్టులు పెట్టిన వారిపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఫోనలో బెదిరించినట్లు సమాచారం. నిరసన దీక్ష చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొంతమంది కార్యకర్తలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


పోలీసుల ద్వారా బెదిరింపులు

నిరసన దీక్ష చేపడతామనీ, నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటామని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడంపై ఎమ్మెల్యే వర్గీయులు.. పోలీసులను ఉసిగొలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పెనుకొండ ఎస్‌ఐ రమేష్‌.. సోమందేపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త కల్యాణ్‌ను ఫోనలో బెదిరించినట్లు ఆ వర్గాల్లో చర్చ సాగుతోంది. కావాలంటే సీఎం వద్ద దీక్ష చేసుకోగానీ, పెనుకొండలో చేస్తానంటే ఒప్పుకోనంటూ ఫోనలో బెదిరించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన సంభాషణను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన కార్యకర్త కల్యాణ్‌కు పెనుకొండ మునిసిపల్‌ చైర్మన ఉమర్‌ ఫారూక్‌, కౌన్సిలర్‌ ఫోన చేసి, బెదిరించారు. ‘నీవు ఎక్కడున్నావో చెప్పు. అక్కడికే వచ్చి నీ కథ తేలుస్తామం’టూ హెచ్చరించారు. ఆ ఆడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో చేసేదిలేక బుధవారం సాయంత్రం సోమందేపల్లి పరిధిలో కౌన్సిలర్‌పై దాడి చేశాడంటూ కల్యాణ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు దురుద్దేశపూర్వకంగా నమోదు చేశారంటూ కల్యాణ్‌తోపాటు అసమ్మతి నాయకులు ఆరోపించడం మరింత దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఈనెల 8న అసమ్మతి నాయకులు దీక్ష చేపడతారా.. పోలీసుల ద్వారా వారిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటారా అన్నది పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని వైసీపీలో ఆందోళన నెలకొంది.


కార్యకర్తపై కేసు

సోమందేపల్లి: మండలంలోని గుడిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త కల్యాణ్‌పై కేసు నమోదైంది. సోమందేపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలివీ.. పెనుకొండ కౌన్సిలర్‌ శేషాద్రి పాలసముద్రం గ్రామానికి వెళ్లి పని చూసుకుని, తిరుగు ప్రయాణమయ్యాడు. నల్లగొండ్రాయనపల్లి వద్ద జాతీయ రహదారిపై కల్యాణ్‌ అడ్డగించి, కౌన్సిలర్‌పై దాడి చేసి, కులం పేరుతో దూషించాడని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. కల్యాణ్‌.. కొంతకాలంగా ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఆయన తమ్ముళ్లకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఆయనపై ఎమ్మెల్యే వర్గీయులు ఇదివరకే రెండు కేసులు నమోదు చేయించారు. తాజాగా పెనుకొండ ఎస్‌ఐ బెదిరింపుల ఆడియోను సోషల్‌ మీడియాలో పెట్టిన నేపథ్యంలో కౌన్సిలర్‌పై దాడి చేశాడంటూ అతడిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం.


నీ ఇంటి దగ్గర నిరసన తెలుపుకో..

లేదంటే సీఎం దగ్గర చేసుకో.. 

పెనుకొండకు వస్తే బాగుండదు

వైసీపీ కార్యకర్తకు ఎస్‌ఐ వార్నింగ్‌


‘నీ మింద తప్పుడు కేసులు పెట్టుంటే కోర్టుకుపొయి కొట్టేపిచ్చుకో. నీకేమైనా అన్యాయం జరిగుంటే నీ ఇంటి దగ్గర దీక్ష చేసుకో. లేకుంటే సీఎం దగ్గరికెళ్లి నిరసన తెలుపు. అంతేగానీ పెనుకొండకు వచ్చి దీక్ష చేస్తానంటే బాగుండదు. నా వద్దకు వచ్చి దీక్ష చేస్తావా..?’ అని అధికార పార్టీ కార్యకర్తకు ఓ ఎస్‌ఐ ఫోన చేసి వార్నింగ్‌ ఇచ్చాడు. పెనుకొండ ఎస్‌ఐ రమేష్‌ హెచ్చరికల ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలపై ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఆయన తమ్ముళ్లు అక్రమ కేసులు పెట్టించారనీ, బెదిరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఈనెల 8న వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని పెనుకొండలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన దీక్ష చేపడతామని సోషల్‌ మీడియాలో కొందరు కార్యకర్తలు పోస్ట్‌ చేశారు. దీనిపై కన్నెర్రచేసిన ఎస్‌ఐ రమేష్‌.. సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త కల్యాణ్‌కు ఫోన చేశారు. ‘బాబూ.. ఏంది సోషల్‌ మీడియాలో పెట్టినావు..? నీ మింద ఎన్ని కేసులు కట్టినారు..?’ అని ప్రశ్నించారు. దీంతో తాము అధికార పార్టీ కార్యకర్తలమనీ, తనపై రెండు కేసులు పెట్టారనీ, తాము నష్టపోయామనీ, ఈ విషయం సీఎం జగనకు తెలిసేలా నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నామని కల్యాణ్‌ సమాధానమిచ్చాడు. దీంతో ఎస్‌ఐ వార్నింగ్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. ‘నీ ఊర్లో చేసుకో.. నా స్టేషన పరిధిలో ఎందుకు చేస్తావు..?’ అని బెదిరించారు. పెనుకొండ తమ నియోజకవర్గ కేంద్రమనీ, అక్కడ నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని వైసీపీ కార్యకర్త ప్రశ్నించాడు. ఎస్‌ఐ వినిపించుకోకపోవడంతో ‘ఎక్కడ దీక్ష చేసుకోవాలో అక్కడే చేసుకుంటాం సార్‌..’ అని కార్యకర్త సమాధానమిచ్చాడు. పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్‌నారాయణ సోదరుల అన్యాయాలను పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామనీ, అయినా వారి ఆగడాలు తగ్గడం లేదని అధికార పార్టీకి చెందిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో నియోజకవర్గంలోని కార్యకర్తల ఆవేదనను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి తెలియజేసేందుకు, పార్టీని కాపాడుకునేందుకు అసలైన కార్యకర్తలు కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన దీక్షలో పాల్గొనాలని సోషల్‌ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ పోస్టులకు పత్రికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలను జోడించారు.

Updated Date - 2022-07-07T06:03:09+05:30 IST