దాడులా..?

ABN , First Publish Date - 2022-06-30T05:39:11+05:30 IST

అధికార వైసీపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ నాయకుడి గురించి ప్రెస్‌మీట్లు పెట్టి, విమర్శలు గుప్పిస్తే చూస్తూ ఊరుకునేదు లేదనీ, తగిన శాస్తి చేస్తామని వైసీపీ ద్వితీయశ్రేణి నాయకత్వం బహిరంగంగానే బెదిరింపులకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

దాడులా..?

అధికార పార్టీ నేతల 

తీరుపై సర్వత్రా విస్మయం

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమా?

ధర్మవరంలో మళ్లీ కక్షల కుంపటి రాజుకుంటోందా?

భయాందోళనలో ప్రజానీకం

ధర్మవరం, జూన 29: అధికార వైసీపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ నాయకుడి గురించి ప్రెస్‌మీట్లు పెట్టి, విమర్శలు గుప్పిస్తే చూస్తూ ఊరుకునేదు లేదనీ, తగిన శాస్తి చేస్తామని వైసీపీ ద్వితీయశ్రేణి నాయకత్వం బహిరంగంగానే బెదిరింపులకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో మూడేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి మాట దేవుడెరుగు, ఆధిపత్యం చెలాయించడం, తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడం, ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగడాన్ని కొందరు అధికార పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏకంగా భౌతికదాడులకు దిగుతున్నారు. ఈనెల 28న ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నాయకులపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. తమ నాయకుడిపై ఏకంగా బహిరంగసభలోనే ఎమ్మెల్యే దుర్భాషలాడడంపై కౌంటర్‌ ఇచ్చే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛను కాలరాసే హక్కు ఎవరిచ్చారంటూ మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. వైసీపీ అరాచకాలు శృతిమించుతున్నా.. పోలీసు వ్యవస్థ పట్టనట్లు వ్యవహరిస్తుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ధర్మవరంలో పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పట్టణంలో మళ్లీ ఫ్యాక్షన, కక్షలు పురుడు పోసుకుంటాయేమోనన్న భయం పట్టణ వాసుల్లో నెలకొంది.


ఎదిరిస్తే దాడులు, హత్యలే..

నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు, హత్యలకు తెగపడే పరిస్థితి నెలకొంది. వైసీపీ మూడేళ్ల పాలనలో అధికార పార్టీ నాయకుల చేతుల్లో పలువురు దెబ్బలు తినగా.. బత్తలపల్లి మండలంలో ఒకరు హతమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దెబ్బలు తిని కూడా బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని మిన్నకుండిపోతున్న వారు కోకొల్లలు. వైసీపీలో చురుగ్గా ఉన్న బిల్లే నరేంద్ర వారితో విభేదించి, అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యాట్సా్‌పలో పోస్టులు పెట్టారని దాడులకు తెగబడ్డారు. వ్యాట్సా్‌పలో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్‌ చేశారన్న నెపంతో ఏకంగా పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త తోట వాసుదేవను పోలీసులపై ఒత్తిడి చేయించి, కేసుల్లో ఇరికించారు. ముదిగుబ్బలో తన మాట వినలేదని ఏకంగా వైసీపీ మండల కన్వీనర్‌.. ఓ అధికారిపై బూతుపురాణం అందుకోవడం సోషల్‌ మీడియలో వైరల్‌ అయింది. తాజాగా ధర్మవరంలోని ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నాయకులపై  రాడ్లు, కర్రలతో భౌతకదాడులకు దిగి, తీవ్రంగా గాయపరచడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.


కక్షల కుంపటి రాజుకుంటోందా?

ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ తీరుతో రాజకీయ కక్షల కుంపటి రాసుకున్నట్లేనా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. అఽధికార పార్టీతోపాటు ఇక్కడ ప్రతిపక్షంకూడా బలంగానే ఉంది. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా.. ఇప్పుడే దాడులకు పాల్పడుతుండటం ఆందోళన రెకెత్తిస్తోంది. ఇవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. రెండు రోజుల క్రితం ప్రజాప్రతినిధి మాట్లాడుతూ ‘నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను సైగ చేస్తే మిమ్మల్ని (ప్రతిపక్షాలను) కళాజ్యోతి సర్కిల్‌లో తరిమి కొడతార’న్న మరుసటిరోజే ఆయన అనుకున్నట్టు గానే అదే ప్రాంతంలో దాడులకు పాల్పడడం పట్ల పట్టణ వాసులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ దాడుల పట్ల నియోజకవర్గవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యం

అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులను విమర్శించిన ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. గళమెత్తిన నాయకులపై ప్రత్యక్ష దాడులకు దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ చేసిన తప్పులను ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం సర్వసాధారణం. తప్పులను ఎక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లి, తమ నాయకుడిని ఎక్కడ అభాసుపాలు చేస్తారోనన్న దురుద్దేశంతోనే అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.


దాడి కేసులో 8 మంది లొంగుబాటు

బీజేపీ నేతలపై దాడి కేసులో 8 మంది నిందితులు ధర్మవరం పోలీసు స్టేషనలో బుదవారం లొంగిపోయారు. దాడికి సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 8 మంది పోలీసు స్టేషనలో లొంగిపోయారు. వారిని కోర్టులో హాజరుపరచగా ఈనెల 13వరకు జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని వారు చెప్పుకొచ్చారు.


కేతిరెడ్డీ.. దమ్ముంటే నాతో పెట్టుకో..

 మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

‘కేతిరెడ్డీ.. దమ్ముంటే నాతో పెట్టుకో. అమాయకుల జోలికొస్తే చూస్తూ ఊరుకోన’ని మాజీ ఎమ్మెల్యే,  బీజేపీ రాష్ట్ర నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని హెచ్చరించారు. బుధవారం స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి అరాచకాలు మితిమీరిపోయాయన్నారు. ఆయన అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారన్నారు.తమ పార్టీ కార్యకర్తలు.. కేతిరెడ్డి కబ్జా గురించి విమర్శలు చేశారన్న నెపంతో ప్రెస్‌క్లబ్‌లో రాడ్లు, కర్రలతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారన్నారు. ‘ఏదిఏమైనా కార్యకర్తలను టచ చేశావ్‌. నిన్ను, దాడికి పాల్పడిన వారిని వదలను ఖబడ్దార్‌..’ అంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. కేతిరెడ్డిపై కేసు నమోదు చేయకపోతే డీఎస్పీ, సీఐలపై హైకోర్టులో కేసు వేస్తామనీ, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీకెళ్లి, ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. దాడులకు సహకరించిన పోలీసులపై కూడా కోర్టుకెళ్తామన్నారు. త్వరలో గుర్రాల కోటను కూడా కూల్చి వేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చలపతిరావు, రమేశ, సుదర్శనరెడ్డి, పామిశెట్టి శివశంకర్‌, గొట్లూరుచంద్ర, నారాయణస్వామి, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:39:11+05:30 IST