రౌడీయిజం

ABN , First Publish Date - 2022-06-29T05:55:08+05:30 IST

కొందరు వైసీపీ నాయకులు బరితెగించారు. పట్టపగలే.. అదికూడా ప్రెస్‌క్లబ్‌లోనే వీరంగం సృష్టింంచారు.

రౌడీయిజం

పట్టణ నడిబొడ్డున ప్రెస్‌క్లబ్‌లోనే వైసీపీ వీరంగం

బీజేపీ నాయకులపై ఇనుపరాడ్లు, కర్రలతో 

విచక్షణారహితంగా దాడులు

పరుగులు తీసిన ప్రజలు

ధర్మవరం, జూన 28: కొందరు వైసీపీ నాయకులు బరితెగించారు. పట్టపగలే.. అదికూడా ప్రెస్‌క్లబ్‌లోనే వీరంగం సృష్టింంచారు. బీజేపీ నాయకులపై రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. వారు టార్గెట్‌గా పెట్టుకున్న కొందరినైతే ఏకంగా గదుల్లోకి ఈడ్చుకెళ్లి, రక్తం చిందేలా బాదారు. మరికొందరిని కర్రలతో కొట్టారు. వారంతా స్పృహతప్పి, చావుబతుకుల మధ్య ఉంటే.. కర్రలు, రాడ్లు చూపిస్తూ.. వాహనాలు ఎక్కి, వెళ్లిపోయారు. ఆ దగ్గరలోనే పోలీసు డివిజన స్థాయి అధికారి కార్యాలయం ఉండడం శోచనీయం. అయినా.. వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడంతో అక్కడున్న వారు భయపడిపోయారు. ఏకంగా అక్కడి నుంచి పరుగులు పెట్టారంటే వారి దాడి ఎంత దౌర్జన్యంతో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామంతో పట్టుకేంద్రం ఉలిక్కిపడింది. పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని పట్టణవాసులు భయంభయంగా ఉంటున్నారు. 20 మందికిపైగా వైసీపీ నాయకులు ముందస్తు వ్యూహంతో చేసిన దాడుల్లో ఆరుగురు బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికే అక్కడికి చేరుకున్న మరికొందరు బీజీపీ నాయకులు.. దాడిని చూసి నిశ్చేష్టులయ్యారు. రక్తగాయాలతో పడిపోయిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ పట్టణ, మండల కన్వీనర్లు డిష్‌ రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, తుంపర్తి పరమేశ, రాప్తాటిరాము, అప్పస్వామి, డిజైనర్‌ రాజశేఖర్‌రెడ్డిని అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రమాకాంత, సీఐ సుబ్రహ్మణ్యం ఆస్పత్రికి వెళ్లి, గాయపడిన వారితో దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.


దర్మవరంలో ఉద్రిక్తత

బీజేపీ నాయకులపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకులపై జరిగిన దాడి పట్ల బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ డివిజన స్థాయి పోలీసు అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలో దౌర్జన్యకాండ సాగుతుంటే చూస్తుండిపోయిన పోలీసు వ్యవస్థ ఉన్నట్లా.. లేనట్లా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


తిమ్మంపల్లి సంస్కృతిని తీసుకొచ్చారు..

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల ఫైర్‌

ప్రశాంతంగా ఉన్న ధర్మవరానికి తిమ్మంపల్లి సంస్కృతిని అధికార పార్టీ నాయకులు తీసుకొచ్చారనీ, అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నాయకులపై వైసీపీ శ్రేణుల దాడి విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన ధర్మవరం చేరుకుని, ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి, దైర్యం చెప్పారు. ప్రెస్‌క్లబ్‌లో పరిశీలించి, అనంతరం డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి, అరగంటపాటు ధర్నా చేపట్టారు. డీఎస్పీ రమాకాంతను కలిసి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దాడికి పాల్పడిన రౌడీలపై కేసులు నమోదు చేయాలని కోరారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి, బాధ్యులపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో గోనుగుంట్ల ధర్నా విరమించారు. ఈ సందర్భంగా గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఎంతమందిని చంపుతావ్‌, నీ దౌర్జన్యాలకు అడ్డుఅదుపులేదా? భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావ్‌ జాగ్రత్త..’ అంటూ ఎమ్యెల్యేను హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు.. అనుకుని ఉండుంటే ధర్మవరంలో తిరిగేవారా అని ప్రశ్నించారు.


20 మందిపై కేసు..

బీజేపీ నాయకులపై దాడికి సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపడుతున్నామన్నారు.


Updated Date - 2022-06-29T05:55:08+05:30 IST