వైసీపీలో రగులుతున్న అసమ్మతి

ABN , First Publish Date - 2022-05-23T06:51:27+05:30 IST

హిందూపురం నియోజకవర్గంలో అధికార వైసీపీలో మొదలైన వర్గపోరు ఆగేలా కనిపించలేదు. అసమ్మతి రగులుతోంది. ఆ వర్గం నాయకులు రెండ్రోజులపాటు సమావేశాలు నిర్వహించారు. మూడోరోజు కూడా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దేవుడి కార్యక్రమానికి అసమ్మతివర్గం నాయకులు హాజరయ్యారు.

వైసీపీలో రగులుతున్న అసమ్మతి

పోటాపోటీగా సమావేశాలు

పురంలో స్థానికులకే ఇనచార్జి బాధ్యతలు 

ఇవ్వాలంటున్న అసమ్మతి వర్గం

అధిష్టాన ం నిర్ణయమే శిరోధార్యం: ఎంపీ

హిందూపురం టౌన/చిలమత్తూరు, మే 22: హిందూపురం నియోజకవర్గంలో అధికార వైసీపీలో మొదలైన వర్గపోరు ఆగేలా కనిపించలేదు. అసమ్మతి రగులుతోంది. ఆ వర్గం నాయకులు రెండ్రోజులపాటు సమావేశాలు నిర్వహించారు. మూడోరోజు కూడా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దేవుడి కార్యక్రమానికి అసమ్మతివర్గం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు స్థానికులకే ఇనచార్జి ఇవ్వాలంటూ నినదించారు. అదేస్థాయిలో ఎమ్మెల్సీ వర్గం తరపున ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆదివారం చిలమత్తూరు మండలంలో పర్యటించారు. మండలంలోని జడ్పీటీసీతోపాటు పలువురు ఎంపీటీసీ, సర్పంచులతో సమావేశమయ్యారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హిందూపురం వైసీపీలో కొంతమంది నాదెండ్ల భాస్కర్‌రావు లాంటి వారున్నారనీ, అదిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్సీ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అదునుగా భావించి, ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. అదిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తామన్నారు. అనవసర రాజకీయాలు మానుకోవాలని అసమ్మతి నాయకులను ఎంపీ హెచ్చరించారు. స్థానిక నాయకులతో చిలమత్తూరు గ్రామ సచివాలయం వద్ద సమావేశమయ్యారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసుకోవాలన్నారు. సామాజిక న్యాయ జయభేరి పోస్టరును ఆవిష్కరించారు. ఈనెల 24 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయ జయభేరి బస్సు యాత్ర ఉంటుందనీ, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనూష, పలువురు సర్పంచలు, మరికొంతమంది ముఖ్య నాయకులు హాజరయ్యారు.


స్థానికుడైతేనే కార్యకర్తలకు న్యాయం..

హిందూపురం నియోజకవర్గంలో స్థానికేతరులకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించడం  ద్వారా వైసీపీ తీవ్రంగా నష్టపోతోందని రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన వైసీపీలోని అసమ్మతి నాయకులతో ఆదివారం చిలమత్తూరు మండలంలోని డి. గొళ్లపల్లిలో ఓ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి మరికొంతమంది ఎంపీటీసీలు, కొంతమంది నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ స్థానికేతరుడు కావడం మూలంగా పార్టీకి పనిచేసిన నాయకులు, కార్యకర్తల పేర్లు కూడా తెలుసుకోలేకపోయాడన్నారు. నియోజకవర్గం గురించి ఏమీ తెలియని వ్యక్తి ఇనచార్జ్‌ కావడం దురదృష్టకరమన్నారు. వీరి వల్ల పార్టీ కోసం కష్టపడిన వారు దిక్కులేని వారవుతారన్నారు. ఇనచార్జ్‌ కేవలం యాక్టర్‌ అని, ఆయన్ను వెనుకనుంచి ఆడించే వారు ఇద్దరు ఉన్నారన్నారు. గతంలో ఫ్లెక్సీలు కట్టేవారు.. ఇప్పుడు హిందూపురాన్ని పాలిస్తున్నారని విమర్శించారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని, నియోజకవర్గ బాధ్యతలు స్థానికులకు అప్పగించాలన్నారు. అప్పుడే పార్టీ క్యాడర్‌కి న్యాయం చేసే వీలు పడుతుందన్నారు. ఈ ఆలోచనతోనే తాము ఇనచార్జి బాధ్యతలను స్థానికులకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటుచేసి, ఈ నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Updated Date - 2022-05-23T06:51:27+05:30 IST