వైసీపీ దాడులకు భయపడేది లేదు

ABN , First Publish Date - 2021-10-21T05:17:15+05:30 IST

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి, పలు ప్రాంతాల్లో పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైసీపీ దాడులను సీఎం జగన్‌ సమర్థించుకోవడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

వైసీపీ దాడులకు భయపడేది లేదు
నంద్యాలలో ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు

  1. దాడులను సమర్థించుకోవడం సిగ్గుచేటు
  2. మాజీ మంత్రులు ఫరూక్‌, ఏరాసు ధ్వజం
  3. టీడీపీ నాయకుల హౌస్‌ అరెస్టు


నంద్యాల, అక్టోబరు 20: మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి, పలు ప్రాంతాల్లో పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైసీపీ దాడులను సీఎం జగన్‌ సమర్థించుకోవడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ దాడులకు భయపడేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపు నివ్వడంతో ఆ పార్టీ ముఖ్య నాయకులను బుధవారం తెల్లవారుజామునే పోలీ సులు గృహ నిర్బంధం చేశారు. ఈసందర్భంగా ఫరూక్‌, ప్రతాపరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవీసుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న నాయకులను, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌ చేస్తూ దాడులు, హింసాత్మక చర్యలకు పాల్పడుతూ తిరిగి అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. రాజ్యాంగ హక్కులను సైతం నిస్సిగ్గుగా కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి, కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. 


మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద వాగ్వాదం : నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గృహనిర్బంధంలో ఉంచడం ఏంటని, టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగితే నిరసన తెలపడానికి కూడా తమకు హక్కులేదా అంటూ పోలీసులను భూమా ప్రశ్నించారు. దాడులు చేసిన వారికి రోడ్డుపై ధర్నాలు చేయడానికి అనుమతి ఇచ్చి శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామన్నా అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శ్రీనివాససెంటర్‌లోని ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహం ఎదుట భూమా బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. 


ప్రభుత్వ కనుసన్నల్లోనే దాడులు: వైసీపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం ఏవీఆర్‌ ప్రసాద్‌ను పోలీసులు తెల్లవారుజామునుంచే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 


పోలీసులా?.. వైసీపీ కార్యకర్తలా?

భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి

ఆళ్లగడ్డ: పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని టీడీపీ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ఎవరెవరు ధ్వంసం చేశారన్న విషయం సీసీ ఫుటేజిలలో కన్పించిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని అన్నా రు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై దాడి చేయించడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శిరివెళ్ల కాటంరెడ్డి శ్రీకాంతరెడ్డి, బాచ్చాపురం శేఖరరెడ్డి, సోముల చంద్రశేఖరరెడ్డి, నాగిరెడ్డిపల్లె శేఖర్‌రెడ్డి, రాము యాదవ్‌, సల్లా నాగరాజు పాల్గొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరిమూకలచే సీఎం జగన్‌ దాడి చేయించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని మాజీ జడ్పీటీసీ చాంద్‌బాషా అన్నారు. ముందస్తున్న టీడీపీ నాయకుడు మాజీ జడ్పీటీసీ చాంద్‌బాషాను గృహ నిర్బంధం చేశారు. 


వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు 

మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌ 

ఓర్వకల్లు: టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడులు చేయడం సిగ్గు చేటని, రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన నడుస్తున్నదని, వైసీపీ నాయకుల దాడులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి హెచ్చరించారు. బుధవారం టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఓర్వకల్లులో మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హుశేనాపురం జాతీయ రహదారిపై మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రోడ్డుకిరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై, విశాఖ టీడీపీ కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో లక్ష్మికాంతరెడ్డి, అల్లాబాబు, శ్రీనివాసులు, అన్వర్‌, కేవీ మధు, సుధాకర్‌, రామగోవిందు, రజాక్‌ పాల్గొన్నారు. 


పాణ్యం: వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు సహించరని పాణ్యం మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం టీడీపి చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా పాణ్యం జాతీయ రహదారిపై టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ టీడీపీ నాయకులనే టార్గెట్‌గా పెట్టుకొని దాడులకు దిగుతున్నారన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మాజీ డైరెక్టర్‌ జయరామిరెడ్డిని గృహనిర్బంధం చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఖాదర్‌బాషా, రాంపుల్లారెడ్డి, రమణమూర్తి, రంగరమేష్‌, మోహన్‌రెడ్డి, మహబూబ్‌బాషా, రాంమోహన్‌నాయుడు, శ్రీనివాసులు, తిరుపాలు, కుమార్‌రెడ్డి, పుల్లారెడ్డి, రవికుమార్‌, సుబ్బయ్య, సుధాకర్‌ పాల్గొన్నారు.


శిరివెళ్ల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప అన్నారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బంద్‌ నిర్వహించేందుకు వెళ్తున్న నాయకులను బుధవారం తెల్లవారుజామునే పోలీసులు గృహ నిర్భంధం చేశారు. 


రుద్రవరం: వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తే దాడులు చేయడం, ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ మండల నాయకులు ఎల్‌వీ రంగనాయకులు, రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ లక్ష్మీకాంత్‌, ఉపసర్పంచ్‌ బండారు బాలరాజు ప్రశ్నించారు. బుధవారం టీడీపీ మండల నాయకుడు ఎల్‌వీ రంగనాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. సాయంత్రం రుద్రవరంలో రంగనాయకులు స్వగృహంలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే అమరావతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి శ్రీనివాసులు, చిన్నికృష్ణ, చంద్ర, బాలు, దస్తగిరి, రామయ్య, సుబ్బయ్య పాల్గొన్నారు.


చాగలమర్రి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా, మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ టీడీపీ బుధవారం చేపట్టిన రాష్ట్రబంద్‌లో భాగంగా ముందస్తుగా పోలీసులు టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా, మండల కన్వీనర్‌ లాయర్‌ నరసింహారెడ్డి, సల్లానాగరాజు, కొలిమి ఉసేన్‌వలి హౌస్‌ అరెస్టు చేశారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తి నరసింహులు, జెట్టి నాగరాజు, గఫార్‌, కొలిమి ఉసేన్‌వలి, సల్లా నాగరాజు, బాషా, టైలర్‌ అమీర్‌, ఉసేన్‌బాషా, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 


గడివేముల: రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని టీడీపీ నాయకుడు సత్యనారాయణరెడ్డి అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రబంద్‌లో పాల్గొనడానికి వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు గృహ నిర్భందం చేశారు. దీంతో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడంపైనే దృష్టి సారించిందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సీతారామిరెడ్డి, సుభ్రదమ్మ పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-21T05:17:15+05:30 IST