‘అమ్మా..’ నువ్వెక్కడ?

ABN , First Publish Date - 2022-04-21T07:00:16+05:30 IST

‘అమ్మా నువ్వెక్కడ?’.. ఇప్పుడు అధికార పక్ష క్షేత్ర స్థాయి నేతలు అంతర్గతంగా ఒకరినొకరు వేసుకుంటున్న ప్రశ్న. ఏప్రిల్‌ 19.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు, వైపీపీ నేతలు పదే పదే పలికే మహానేత

‘అమ్మా..’ నువ్వెక్కడ?

వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి జన్మదిన వేడుకలేవీ?

ఫోన్‌ కూడా చేసి తల్లిని పలకరించని జగన్‌

పార్టీ కార్యాలయాల్లో కేక్‌ కటింగ్‌ సంబరాలూ లేవు

సోషల్‌ మీడియా గ్రూపుల్లోనూ కనిపించని ‘అమ్మ’ ప్రస్తావన

జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చెరోపక్క నిలిచిన తల్లి, చెల్లి

తీరా అధికారం చేతికొచ్చాక అమ్మ కూరలో కరివేపాకే!

ప్లీనరీ సందర్భంగా పదవి నుంచి వైదొలగనున్న విజయలక్ష్మి?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘అమ్మా నువ్వెక్కడ?’.. ఇప్పుడు అధికార పక్ష క్షేత్ర స్థాయి నేతలు అంతర్గతంగా ఒకరినొకరు వేసుకుంటున్న ప్రశ్న. ఏప్రిల్‌ 19.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు, వైపీపీ నేతలు పదే పదే పలికే మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భార్య, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి జన్మనిచ్చిన తల్లి వైఎస్‌ విజయలక్ష్మి పుట్టిన రోజు. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం గానీ.. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి గ్రామ స్థాయి కార్యాలయం దాకా కేక్‌ కటింగ్‌లు గానీ ఎక్కడా కనిపించలేదు.  పోనీ.. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారమనుకుంటే.. కనీసం సామాజిక మాధ్యమాల్లోనైనా విజయలక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారా అంటే అదీ లేదు.


వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాత్రం ట్విటర్‌లో ఆమెకు మంగళవారమే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే రోజు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షుల నియామకాలను జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకతాళీయమో ఏమోగానీ.. ఈ నియామకాల్లో విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా కనిపించలేదు. సహజంగా రాష్ట్రానికి ప్రత్యేకమైన రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌ ట్విటర్‌లో సందేశాలిస్తారు. తన మాతృమూర్తి జన్మదినంనాడు కనీసం అలాగైనా సందేశమివ్వలేదు. ఇదేంటి.. ఇలా జరిగిందేమిటని వైసీపీ శ్రేణులు, నేతలు ఆశ్చర్యపోతున్నారు. మంగళవారం విజయవాడకు సమీపంలోని ఖమ్మం జిల్లాలోనే విజయలక్ష్మి పర్యటిస్తున్నారు.


తన తల్లికి ఫోన్లోనో, ట్విటర్‌లోనో కాకుండా వ్యక్తిగతంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనుకుంటే.. తాడేపల్లిలోని తన నివాసంలో హెలికాప్టర్‌.. ఖమ్మంలో ఆమె బస చేసిన చోటికి కాసేపట్లోనే వెళ్లవచ్చు. విశాఖలో ప్రకృతి చికిత్సను పొందుతున్న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను జగన్‌ మంగళవారం కలిసి పరామర్శించి వచ్చారు. పోనీ ఖట్టర్‌తో ముందునుంచి ఆయనకు స్నేహం ఉందా అంటే.. అదేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ సీఎంను పరామర్శించిన ఆయన.. తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు పార్టీ ముఖ్య నేతల నుంచి కూడా సమాధానం రావడం లేదు. కాగా,సొంత కొడుకు గానీ, పార్టీ నేతలు గానీ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో విజయలక్ష్మి నొచ్చుకున్నట్లు సమాచారం.


జగన్‌ జైల్లో ఉన్నప్పుడు..

అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలపై జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నప్పుడు.. ఒకవైపు అమ్మ, మరోవైపు సోదరి షర్మిల తోడున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. విజయలక్ష్మిని కూరలో కరివేపాకులా తీసేశారన్న సందేహాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయు. మరోవైపు.. జూలై 8వ తేదీన నిర్వహించే వైసీపీ ప్లీనరీలో గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలగబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

Updated Date - 2022-04-21T07:00:16+05:30 IST