Abn logo
Sep 20 2021 @ 23:55PM

ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టిన వైసీపీ

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న ఎన్‌ఎండీ ఫరూక్‌

  1. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌


నంద్యాల, సెప్టెంబరు 20: రాష్ట్ర ప్రజల నమ్మకంపై వైసీపీ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. సోమవారం నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఐదో రోజు రిలే నిరాహార దీక్షలను ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రారంభించి మాట్లాడారు.  ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులు రూ.కోట్లు దండుకుంటున్నారని అన్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో, డీజిల్‌ ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతుందన్నారు. చెత్తపై పన్ను విధించడం దారుణమన్నారు. కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ముస్తాక్‌ అహమ్మద్‌, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రావు, ఆవాజ్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ మస్తాన్‌వలి, పీడీఎ్‌సయూ జిల్లా సహాయ కార్యదర్శి రఫి, ఐయూఎంఎల్‌ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, జానూజాగో కార్యదర్శి మహబూబ్‌బాషా, కాంగ్రెస్‌ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ఖాన్‌, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.