Abn logo
Apr 9 2021 @ 01:00AM

అధికారపార్టీ అరాచకం

  1. టీడీపీ కార్యకర్తలు, ఏజెంట్లపై దాడులు
  2. రాళ్లు, కర్రలతో రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు
  3. పోలీసుల కళ్లెదుటే వైసీపీ నాయకుల దుశ్చర్య
  4. పలుచోట్ల తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, కర్నూలు)

పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీవారు చెలరేగిపోయారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భౌతిక దాడులకు దిగి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కప్పట్రాళ్ల, బేతపల్లి, అమడగుంట్ల, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులు, ఏజెంట్లు, మద్దతుదారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని, అయినా గెలుస్తామన్న నమ్మకం లేకనే వైసీపీ వర్గీయులు ఇలా దాడులకు దిగారని టీడీపీ నాయకులు విమర్శించారు.


టీడీపీ ఏజెంట్లపై కర్రలు, రాళ్లతో దాడి

పత్తికొండ/దేవనకొండ: దేవనకొండ మండలం బేతపల్లి గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా టీడీపీ తరపున ఏజెంట్లుగా వెళ్లినవారిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వమని అడిగిన రామాంజినేయులు, సుంకన్నపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో  దాడి చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్‌ సీఐ నారాయణరెడ్డి, దేవనకొండ ఎస్‌ఐ కిరణ్‌ గ్రామానికి చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళుతున్న తమపై దాడి చేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. దాడి చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలను సీఐకి చూపించారు. దీంతో తాము వెంట ఉండి పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకువెళతామని సీఐ టీడీపీ వర్గీయులకు తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులపై కేసులు నమోదు అంశాన్ని పక్కనబెట్టి, కేవలం టీడీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రంలోకి పంపే విషయం గురించి సీఐ మాట్లాడడంతో తమకు ఎన్నికలు అవసరం లేదని టీడీపీ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలింగ్‌ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం గ్రామంలోని టీడీపీ వర్గీయులు 25 మందిపై పోలీసులు బైండోవర్‌ కేసులు పెట్టారు. కానీ వైసీపీ వర్గీయులలో ఒకరిని కూడా బైండోవర్‌ చేయలేదని, ఏజెంట్లపై, నాయకులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగినా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని టీడీపీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ ఓటర్లను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తాము ఓటు వేయడం లేదని అన్నారు. 


ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి

వెంకటాపురం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి విజయ భాస్కర్‌ గౌడ్‌పై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న విజయభాస్కర్‌ గౌడ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్‌ఐ సూచించారు. తాను అభ్యర్థినని, ఎందుకు వెళ్లిపోవాలని ఆయన ఎస్‌ఐని ప్రశ్నించారు. అప్పటికే రిగ్గింగ్‌ కోసం ఏర్పాటు చేసుకున్న వైసీపీ నాయకులు ఒక్కసారిగా పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చి విజయ భాస్కర్‌ గౌడ్‌పై రాళ్లతో దాడి చేశారు. పక్కనే ఉన్న టీడీపీ ఏజెంటు వెంకటేష్‌ ఆయనను రక్షించేందుకు అడ్డుగా వెళ్లారు. దీంతో వెంకటేష్‌ తలకు తీవ్ర గాయాల య్యాయి. ఈ దాడిలో విజయ భాస్కర్‌ గౌడ్‌తో పాటు ఆయన అనుచరులు చంద్రశేఖర్‌ గౌడ్‌, నాగభూషణంకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. బాధితులను దేవనకొండ ఆసుపత్రికి తరలించారు. 


నాలుగు రోజులుగా కవ్విస్తున్నారు.. 

ఎన్నికలకు నాలుగురోజుల ముందు నుంచే వైసీపీ వారు మాతో గొడవకు దిగాలని కవ్విస్తున్నారు. అవేమీ పట్టించుకోకుండా మేము సర్దుకుపోతున్నాం. పోలింగ్‌ కేంద్రంలోకి వెళుతున్న ఏజెంట్లను గురువారం అడ్డుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. మహిళలు కారంపొడి చేతులలోకి తీసుకుని మాపై చల్లేందుకు ప్రయత్నించారు. దీంతో భయపడి అక్కడి నుంచి వచ్చేశాం. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. అందుకే ఈ ఎన్నికలలో ఓటు వేయలేదు. సుమారు 400 మంది ఓటు హక్కుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. - ప్రమీల, బేతపల్లి


కర్రలు, రాళ్లతో దాడి చేశారు..

పోలింగ్‌ ఏజెంట్లుగా అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నాం. పోలింగ్‌ కేంద్రంలోకి వెళుతుంటే వైసీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో భయపడి పారిపోయి వచ్చాం. - రామాంజినేయులు, సుంకన్న కప్పట్రాళ్లలో టీడీపీ వర్గీయులపై దాడి 

కప్పట్రాళ్లలో మరో గంటలో పోలింగ్‌ ముగుస్తుందనగా టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు చెబుతుండటంతో టీడీపీ వర్గీయులు ప్రశ్నించారు. తమనే ప్రశ్నిస్తారా అంటూ టీడీపీ వర్గీయులను నడిరోడ్డుపై వైసీపీ వర్గీయులు చితకబాదారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఫ్యాక్షన్‌ గ్రామమైన కప్పట్రాళ్లలో దశాబ్దం కాలంగా ప్రశాంత వాతావరణం ఉంది. తాజాగా రెండు వర్గాల మధ్య గొడవలు జరగడంతో ప్రజలు భయాందోళ చెందుతున్నారు. 


అమడగుంట్లలో టీడీపీ కార్యకర్తలపై దాడి 

కోడుమూరు(రూరల్‌):  మండలంలోని అమడగుంట్లలో బుధవారం రాత్రి వైసీపీ కార్యక ర్తలు తప్పతాగి టీడీపీ కార్యకర్తల పై దాడి చేశారు. ఒక ఆటోను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు, ముగ్గురు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామం లోని రాములవారి ఆలయ సమీపంలో అర్ధరాత్రి కొందరు వైసీపీ కార్యకర్తలు తప్పతాగి కేకలు వేస్తూ హంగామా చేశారు. టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్యాలను చిత్రీకరించారు. దీంతో వారిపై కట్టెలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు నరేష్‌, మధు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేశ్‌, రంగస్వామి స్వల్పంగా గాయ పడ్డారు. విషయం తెలుసుకుని, వారించడానికి వెళ్లిన సర్పంచ్‌ వరలక్ష్మి భర్త రఘునాథరెడ్డి చేతికి రాయి దెబ్బ తగిలింది. రంగస్వామి ట్రాలీ ఆటోను కూడా ధ్వంసం చేశారు. గాయపడ్డవారు కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వెళ్లారు. సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే ఫలితం వస్తుందన్న భయంతో వైసీపీ వర్గీయులు దాడులకు దిగారని టీడీపీ నాయకుడు రఘునాథరెడ్డి అన్నారు. ఎస్‌ఐ మల్లికార్జున వివరణ కోరగా తప్పతాగి గొడవకు దిగారని, ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని తెలిపారు.  


 వాగ్వాదాలు

తుగ్గలి: మండలంలోని ఎద్దులదొడ్డిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు పోలింగ్‌ సందర్భంగా వాగ్వాదానికి దిగారు. జొన్నగిరిలో వైసీపీ, స్వతంత్ర అభ్యర్థి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు ప్రాంతాలలో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. ఎన్నికల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణయ్య పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. తుగ్గలి, జొన్నగిరి ఎస్‌ఐలు నాగేంద్ర, సురేష్‌ బందోబస్తు నిర్వహించారు.


టీడీపీ అభ్యర్థిని నిర్బంధించారు: గౌరు చరిత

పాణ్యం: తెలుగుదేశం పాణ్యం- 1 ఎంపీటీసీ అభ్యర్థి గుర్రం రంగరమేష్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు. పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారారని, టీడీపీ అభ్యర్థి ఇంటి ముందు చీరెలు వేసి.. పంచుతున్నారని నిందమోపి అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓటమి భయంతో అధికార పార్టీ నాయ కులు ఇలా హౌస్‌ అరెస్టు చేయించారని అన్నారు. వైసీపీ నాయకులు బహిరంగంగా మహిళలకు చీరెలు, పురషులు డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. ఓటు వేయడానికి  కూడా అభ్యర్థిని అనుమతించలేదని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో సాయంత్రం విడుదల చేశారని అన్నారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా, వైసీపీ నాయకులకు గెలుస్తామనే ధైర్యం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని ఆమె అన్నారు. 


కప్పట్రాళ్ళలో రోడ్డుపై టీడీపీ వర్గీయులపై దాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలు


Advertisement
Advertisement
Advertisement