వైసీపీ ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2021-03-04T06:51:16+05:30 IST

ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఇలా కూడా జరుగుతుందా..!

వైసీపీ ఇష్టారాజ్యం
ఆదోని ఆర్వో న్యూటన్‌రాజుతో చర్చిస్తున్న ఎమ్మెల్యే తనయుడు జయమనోజ్‌రెడ్డి

  1. ఉపసంహరణల్లో అధికారిక మార్క్‌
  2. ప్రలోభాలు.. ఒత్తిళ్లు.. బెదిరింపులు
  3. నాయకులే దగ్గరుండి విత్‌డ్రా


ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఇలా కూడా జరుగుతుందా..! అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటర్లతో నిమిత్తం లేదు, అభ్యర్థులతో నిమిత్తం లేదు. అధికారపార్టీ ఏది చెబితే అది చేయడమే తమ విధి అన్నట్లు కొందరు అధికారులు వ్యవహరించారు. ఎక్కడైనా నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకుంటారు. కానీ డోన్‌ మున్సిపాలిటీలో వారి ప్రమేయమే కనిపించలేదు. పోటీ అభ్యర్థుల నామినేషన్లను అధికార పార్టీ నాయకులే దగ్గరుండి విత్‌డ్రా చేయించారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఇలా చేశారని బాధిత టీడీపీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థికి ఫ్యాన్‌ గుర్తు కేటాయించాలని ఎమ్మెల్యే తనయుడు ఆర్వోపై తీవ్ర ఒత్తిడి చేశారు. గంటల తరబడి ఆయన వద్ద కూర్చుని పని చేయించాలని విఫలయత్నం చేశారు.


ఫ్యాన్‌ గుర్తు ఇచ్చేయండి..!

ఆదోని, మార్చి 3: మున్సిపల్‌ ఎన్నికల్లో వారు ఏం చెబితే అది జరుగుతోంది. అందుకే.. ఏకంగా స్వతంత్ర అభ్యర్థికి ఫ్యాన్‌ గుర్తు కేటాయిం చాలని ఆర్వోపై చిన్న బాస్‌ ఒత్తిడి తెచ్చారు. 30వ వార్డుకు వైసీపీ తరపున అల్తాఫ్‌, నాగరత్నమ్మ నామినేషన్‌ వేశారు. ఫారం-4లో నాగరత్నమ్మ స్వతంత్ర అభ్యర్థి అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా అధికార పార్టీవారు నాగరత్న మ్మను బరిలో ఉంచి, అల్తాఫ్‌ చేత విత్‌డ్రా చేయించారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని, ఎలాగైనా ఫ్యాన్‌ గుర్తును ఆమెకు కేటాయిం చేలా చూసేందుకు అధికారు లపై ఒత్తిడి పెంచారు. ఎమ్మె ల్యే తనయుడు జయ మనోజ్‌ రెడ్డి ఆర్వో న్యూటన్‌రాజును కలిసి నాగరత్నమ్మకు వైసీపీ గుర్తును కేటాయించాలని కోరారు. స్వత్రంత్ర అభ్యర్థి అని ఫారం-4లో ఉన్నందున, పార్టీ గుర్తును కేటాయించలేమని ఆర్వో స్పష్టం చేశారు. అయినా పట్టువీడకుండా దాదాపు మూడు గంటల పాటు ఆర్వో ఎదుట జయమనోజ్‌రెడ్డి కూర్చుండిపోయారు. ఒత్తిడి పెంచి పని చేయించుకోవాలని చూశారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పార్టీ లీగల్‌సెల్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. స్వతంత్ర అభ్యర్థికి అధికార పార్టీ గుర్తు కేటాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీకి అధికారులు వంతపాడితే సహించేది లేదన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు తమకెందుకు వచ్చిన గొడవ అని, గుర్తు కేటాయింపును వాయిదా వేశారు. సమస్యను ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ విషయమై ఉన్నతాధి కారులకు సమాచారం చేరవేశారు. అనంతరం 30వ వార్డు అభ్యర్థి నాగరత్నమ్మను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 



ఇవి ఉంచండి.. ఇవి తీసేయండి..!

  1. పోటీ అభ్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయించారు
  2. డోన్‌ మున్సిపాలిటీలో 25 వార్డులు ఏకగ్రీవం


డోన్‌, మార్చి 3: మున్సి పాలిటీలో ఎన్నికల నిబంధ నలకు అధికార పార్టీ నాయ కులు పాతరేశారు. నామి నేషన్ల ఉపసంహరణ యావత్తూ వైసీపీ నాయ కుల కనుసన్నల్లో కొనసా గింది. అధికారపార్టీ వారు దగ్గరుండి పోటీ అభ్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయిం చారు. అధికారులు వారికి వంత పాడారు. వెరసి డోన్‌ మున్సిపా లిటీలో 25 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 32 వార్డులు ఉండగా, 125 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు మంగళవారం 46 మంది విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. చివరి రోజు బుధవారం అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. మున్సిపల్‌ కార్యాలయంలో నామినే షన్ల ఉపసంహరణ ప్రక్రియను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారుల సహకారం తోడవ్వడంతో నామినేషన్ల ఉపసంహరణ ఏకపక్షంగా జరిగింది. రెండోరోజు మరో 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 


రాత్రి 7.30 గంటల వరకు.. 

నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. కానీ డోన్‌లో ఏకంగా రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. మున్సిపాలిటీలోని 1, 2, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 18, 19, 21, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆ మేరకు అభ్యర్థులకు డిక్లరేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేఎల్‌ఎన్‌ రెడ్డి అందజేశారు. 


డోన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ

  1. మంత్రిపై కేఈ ప్రభాకర్‌ ఫైర్‌


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 3: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తన నియోజక వర్గంలో ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఆరోపించారు. ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకుని గుర్తింపు పొందాలని తహతహలాడుతున్నారన్నారు. డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు పార్టీ బీఫారాలతో నామినేషన్లు వేశారని, నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం గడువు కాగా, వీరు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులే తేల్చేశా రని మండిపడ్డారు. ఇది దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 9వ వార్డు అభ్యర్థి నిర్మల, 8వ వార్డు అభ్యర్థి సర్దార్‌, 16వ వార్డు అభ్యర్థి శ్రీనివాసులు, 13వ వార్డు అభ్యర్థి మల్లికార్జున, 17వ వార్డు అభ్యర్థి కె.గోపాల్‌, 14వ వార్డు అభ్యర్థి లక్ష్మిదేవి, 12వ వార్డు అభ్యర్థి రేణుకాదేవి తమ సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లను ఉపసంహరింపజేశాని విలేకరులకు వివరించారు.  కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నామినేషన్లు వేసిన తర్వాత తాము డోన్‌లో లేమని, వైసీపీ నాయకుల ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయామని తెలిపారు. అధికారులు తాము నామినేషన్లను ఉపసంహరిం చుకున్నట్లు ప్రకటించడంతో దిక్కుతోచడం లేదని అన్నారు. తమకు న్యాయం జరగాలని అన్నారు. తమ సంతకాల ఫోర్జరీ వెనుక అధికార పార్టీ వారి హస్తం ఉందని ఆరోపించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను అడ్డుకుంటామని కేఈ ప్రభాకర్‌ అన్నారు. అధికారులు, పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు మున్సిపల్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని, అధికారులు ఫోర్జరీ సంతకాలు పెట్టి, నామినేషన్లు ఉపసంహ రించుకున్నట్లు ప్రకటించినంత మాత్రాన చెల్లుబాటు కావని అన్నారు. ఈ దురాగతాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, అవసరమైతే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. 

డోన్‌లో తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయకపోతే ఆందోళన చేస్తామని సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వై.నాగేశ్వరరావు యాదవ్‌  హెచ్చరించారు. ఈ సమావేశంలో డోన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ, నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, నాగేంద్రకుమార్‌, హనుమంతరావు చౌదరి, అబ్బాస్‌, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T06:51:16+05:30 IST