వైసీపీ వచ్చింది.. రేషన్‌, పింఛన్‌ పోయాయి

ABN , First Publish Date - 2022-05-25T08:58:53+05:30 IST

లదీతలు ఆగలేదు. నిరసనలు తప్పడం లేదు.

వైసీపీ వచ్చింది.. రేషన్‌, పింఛన్‌ పోయాయి

అమ్మఒడి రెండేళ్లు ఇచ్చి ఆపేశారు..

రోడ్లు లేక అవస్థలు పడుతున్నాం

‘గడప గడప’కూ నిలదీసిన జనం


గోరంట్ల, సీతానగరం, ఆదోని రూరల్‌, కోడుమూరు, మే 24: నిలదీతలు ఆగలేదు. నిరసనలు తప్పడం లేదు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్న ఎమ్మెల్యేలపై జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమస్యలపై నిలదీస్తున్నారు. మంగళవారం కూడా పలు గ్రామాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం దిగువపల్లి తండాలో సుజాతాబాయి అనే మహిళ మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణను రేషన్‌ కార్డు విషయమై ప్రశ్నించారు. ‘వైసీపీ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు పోయింది. ఓట్ల కోసం తిన్నగా వస్తారు. తర్వాత ఉన్నవి తీసేస్తారు’ అని మండిపడింది. మూడేళ్లుగా రేషన్‌కార్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు పదెకరాల పొలం ఉన్నట్లు అధికారులు తప్పుగా చూపించారని, ఎవరో తప్పుచేస్తే తమ కార్డు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అమ్మఒడి డబ్బులు రెండేళ్లు ఇచ్చి ఆపేశారని బాలాజీనాయక్‌, అనితబాయి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని నిర్మలాబాయి ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా చెల్లంనాయుడువలసలో ఎమ్మెల్యే జోగారావును సర్పంచ్‌ వాకాడ అప్పమ్మ వర్గీయులు అడ్డుకున్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వలేదని, ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నియామకంలో అవకతవకలు జరిగాయని, ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన 21 మందిపై పోలీసులు కేసు పెట్టారు. ‘ఊరంతా రోడ్డేశారు. ఇక్కడ వేయలేదు. వానొస్తే చాలు బురదలో పడక తప్పదు. చీకట్లో బతుకుతున్నాం. ఒక్క లైట్‌ వేయలేరా?’ అంటూ  ఆదోని మండలం దిబ్బనకలులో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని 85 ఏళ్ల శేకమ్మ, లక్ష్మి, లక్ష్మమ్మ, చాకలి వీరేశ్‌ తదితరులు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ‘చంద్రబాబు ఉన్నప్పుడు నాకు పింఛను వచ్చేది. మీరొచ్చిన మూడేళ్ల నుంచి పింఛన్‌ రావడం లేదు. పింఛన్‌ రాకపోవడంతో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ మర్కట్టు ఈరమ్మ ఎమ్మెల్యేను దీనంగా అడిగింది. ‘ఆమెకు ముసలోళ్ల పింఛన్‌ రాయండ’ని అధికారులకు  చెప్పి.. ఎమ్మెల్యేఅక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-05-25T08:58:53+05:30 IST