అగ్రవర్ణ కోటా ఏదీ?

ABN , First Publish Date - 2020-07-14T08:19:57+05:30 IST

అగ్రవర్ణాల్లో పుట్టి సమాజంలో మధ్యతరగతి పేరుతో దారిద్య్రం అనుభవిస్తున్న అగ్రవర్ణ పేదలపై వైసీపీ ప్రభుత్వం కత్తి కట్టిందా?...

అగ్రవర్ణ కోటా ఏదీ?

  • కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ఇచ్చినా రాష్ట్రంలో అమలు చేయని ప్రభుత్వం
  • కాపులకూ రిజర్వేషన్లు దక్కకుండా చెక్‌
  • అందని ద్రాక్షలాగా ఉన్నత, విదేశీ విద్య
  • 10 వేల సచివాలయ పోస్టులు కోల్పోయిన ఈబీసీలు
  • ఆర్య వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్లకు నిధులు కట్‌
  • పేదలను ఆదుకొనే ఈబీసీ కార్పొరేషన్‌పైనా నిర్దయ
  • నవరత్నాల పేరుతో సంక్షేమానికి నోచని మధ్యతరగతి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అగ్రవర్ణాల్లో పుట్టి సమాజంలో మధ్యతరగతి పేరుతో దారిద్య్రం అనుభవిస్తున్న అగ్రవర్ణ పేదలపై వైసీపీ ప్రభుత్వం కత్తి కట్టిందా?... తరాలుగా రిజర్వేషన్లను నోచుకోక, ప్రభుత్వ సంక్షేమఫలాలు దక్కక నిర్వేదంలో బతుకుతున్న ఈ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్దయ ఎందుకు? కేంద్రం దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎ్‌స)కు రిజర్వేషన్లు అమలు చేస్తే... మన రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో అమలు కాకుండా అడ్డుకోవడంపై ఆ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈడబ్ల్యూఎ్‌సను కాపులకు, మిగతా అగ్రవర్ణాలకు సమానంగా పంచితే... జగన్‌ ప్రభుత్వం  దానిని రద్దు చేసి తమను శత్రువులుగా చూస్తోందని అగ్రవర్ణ పేదలు వాపోతున్నారు. 


కేంద్రమిచ్చినా ఎగ్గొడతారా?

ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ‘ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌(ఈడబ్ల్యూఎస్‌)’ రిజర్వేషన్‌ 10 శాతం అమలు చేయాలంటూ చట్టం చేసింది. ఆ రిజర్వేషన్లను ఆయా ఓసీ కేటగిరీలకు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. దీంతో జనాభా ఎక్కువగా ఉండి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతంగా వర్గీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అసెంబ్లీలో చట్టం చేసింది. అప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ లోపు కాపుల ప్రయోజనాలు కాపాడాలని అప్పటి సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారు.


అయితే కొత్తగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. సుమారు ఒక లక్ష గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ప్రభుత్వరంగ పోస్టులు, సుమారు రెండన్నర లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ క్రమంలో అగ్రవర్ణ పేదలకు దక్కాల్సిన ఈడబ్ల్యూఎ్‌సను అమలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం  విస్మరించింది. దీంతో రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు లక్ష పోస్టుల్లో 10 వేల పోస్టులు కోల్పోయారు. అదే విధంగా 25 వేల వలంటీర్ల పోస్టులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రిజర్వేషన్‌ను అమలు చేసి ఉంటే సుమారు 35 వేల పోస్టులు అగ్రవర్ణ పేద యువతకు దక్కేవి. 


బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు నిల్‌

అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణుల్లో చాలామంది కడు దారిద్య్రం అనుభవిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ఆ వర్గాలకు  విస్తృత ప్రయోజనాలు కల్పించింది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్పించిన కార్పొరేషన్‌ ఇది. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్‌ ద్వారా 1,54,182 మంది బ్రాహ్మణులు వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందారు. అప్పట్లో రూ.285 కోట్ల బడ్జెట్‌ విడుదల చేయగా 2019-20 సంవత్సరానికి రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. గాయత్రి పథకం ద్వారా ప్రభుత్వ, గుర్తింపు పొందిన స్కూళ్లు, కళాశాలల్లో మెరిట్‌ సాధించిన బ్రాహ్మణ విద్యార్థులు 761 మందికి రూ.76 లక్షల పారితోషికం అందించారు. భారతి పథకం ద్వారా పేదపిల్లలకు ఒకేసారి ఆర్థికసాయం అందించారు.


88,682 మందికి రూ.119.22 కోట్లు, విదేశీ విద్య కోసం, వేదవ్యాస పథకం కింద వేదిక్‌ విద్య కోసం 155 మందికి రూ.21.60 లక్షలు, పోటీపరీక్షల్లో శిక్షణ కోసం వశిష్ట పథకం ద్వారా 377 మందికి రూ.1.22 కోట్లు, ద్రోణాచార్య పథకం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 173 మందికి రూ.38 లక్షలు, చిన్న పరిశ్రమలు స్థాపించుకునేందుకు చాణక్య పథకం ద్వారా 1501 మంది ఔత్సాహికుల కోసం  రూ.21.96 కోట్లు, కశ్యప అండ్‌ అహల్య పథకం కింద బ్రాహ్మణ అనాథలు, భర్త చనిపోయినవారికి, దివ్యాంగులకు భోజనం, వసతి కోసం 45,821 మందికి రూ.43.34 కోట్లు, గరుడ పథకం ద్వారా  అంత్యక్రియల ఖర్చుల కోసం 3093 మందికి రూ.3.09 కోట్లు అందించారు. కల్యాణమస్తు పథకం ద్వారా పెళ్లికానుక కూడా అందించారు. దీంతోపాటు బ్రాహ్మణ కార్పొరేషన్‌ రూ.50 కోట్లతో క్రెడిట్‌ సొసైటీని ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా 45,097 మందికి రుణాలు అందించి స్వయం ఉపాధి కల్పించింది. అయితే 2019-20 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించినప్పటికీ ఈ పథకాలకు ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. కొంత మేర నిధులు కేటాయించినప్పటికీ ఆ నిధులను ‘నవరత్నాల’ అమలుకు మాత్రమే విడుదల చేస్తున్నారు.

 

ఆర్యవైశ్యులపైనా చిన్నచూపు

ఆర్యవైశ్య సామాజికవర్గం కోసం చంద్రబాబు ప్రభుత్వం  ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మొదట బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత రూ.60 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్వతహాగా వ్యాపార కుటుంబాలకు చెందిన ఆర్యవైశ్యులకు అందించే సాయం, మిగతా స్వయం ఉపాధి యూనిట్లకు భిన్నంగా ఉండాలని ఆ సంఘాల నేతలు ప్రభుత్వానికి సూచించారు. దీంతో విద్యార్థులు, యువత కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆర్యవైశ్య వ్యాపారాలకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐల సమన్వయంతో పీపీపీ విధానంలో వైశ్యుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలని భావించారు. చిరు వ్యాపారాలు నిర్వహించే ఆర్యవైశ్య యూనిట్లకు కార్పొరేట్‌ మాల్స్‌, వాల్‌మార్ట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థలతో వీలైనంత వరకు అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని కార్పొరేషన్లను  రద్దు చేసింది. 


అగ్రవర్ణాలకు ఆగిన విదేశీ విద్య

విదేశాల్లో చదవడమంటే ఒకప్పుడు సగటు విద్యార్థికి నెరవేరని కల. విదేశీ యూనివర్సిటీల్లో సీటు సంపాదించడం ఒక ఎత్తయితే, దానికి అవసరమైన వీసా,  ఫీజులు, నివాసానికి అవసరమైన ఖర్చులు భరించడం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు సాధ్యం కాని పని. పేదల విదేశీ విద్య కోసం గత ప్రభుత్వంలో విదేశీ విద్య పథకాన్ని ఈబీసీల కోసం 2017-18 నుంచి ప్రారంభించారు. విదేశీ యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించారు. కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు ఆయా కార్పొరేషన్‌ ద్వారా ఈ పథకాన్ని అందించినప్పటికీ ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా 783 మందికి రూ.16 కోట్లు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే ఈబీసీ కార్పొరేషన్‌ కూడా నిధుల్లేకుండా మిగిలిపోయింది.


ఈబీసీ కార్పొరేషన్‌ నిర్వీర్యం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య, కాపు వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన చంద్రబాబు ప్రభుత్వం... ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, గ్రామాల్లో  ఏడాదికి రూ.60వేల లోపు, పట్టణాల్లో రూ.75వేల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు కార్పొరేషన్‌ను మొదట కంపెనీల చట్టం కింద రిజిస్టర్‌ చేసింది. ఆ తర్వాత ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రీమెట్రిక్‌ బీసీ హాస్టళ్లలో 6శాతం, బీసీ గురుకుల పాఠశాలల్లో 2శాతం సీట్లు ఈబీసీ విద్యార్థులకు కేటాయించింది. ఈబీసీలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు 2018-19 బడ్జెట్‌లోనే నిధులు ప్రకటించింది. పలు రకాల స్వయం ఉపాధి పథకాల యూనిట్లు అందించింది. ఉన్నత విద్య పథకం కింద పోటీ పరీక్షలకు శిక్షణ కోసం ప్రముఖ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ కోసం ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. 

Updated Date - 2020-07-14T08:19:57+05:30 IST