అప్రమత్తమైన వైసీపీ.. పార్టీ నేతలకు కీలక ఆదేశాలు..!

ABN , First Publish Date - 2020-10-17T17:35:27+05:30 IST

ఆ లేఖ కలకలం సృష్టించింది. పెద్ద గందరగోళానికి దారితీయటమే కాకుండా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న తరుణంలో పార్టీవాళ్లు ఎవరు

అప్రమత్తమైన వైసీపీ.. పార్టీ నేతలకు కీలక ఆదేశాలు..!

ఆ లేఖ కలకలం సృష్టించింది. పెద్ద గందరగోళానికి దారితీయటమే కాకుండా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న తరుణంలో పార్టీవాళ్లు ఎవరు కూడా నోరుమెదపవద్దని హుకుం జారీ చేశారు. మీడియా వెంటపడినా ముక్తసరిగా మాట్లాడాలని సూచించారు. ఇప్పటికే అంతా చెప్పేశామనీ, ముక్తాయింపు ఇవ్వాలనీ స్పష్టం చేశారు. చివరకు ఆ లేఖ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో అప్రమత్తమయ్యారు. ఇంతకీ ఆ లేఖ ఏంటి? అది ఎంత గందరగోళానికి దారితీసింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం...


ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాలపై రాష్ట్ర హైకోర్టులో వరుసగా ప్రజాప్రయోజనాల వాజ్యాలు దాఖలవుతున్నాయి. వాటిపై హైకోర్టు నుంచి వస్తున్న తీర్పులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు, ఆంగ్ల భాషలో విద్యాభోదన, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ, సోషల్ మీడియాలో న్యాయమూర్తులు, హైకోర్టుపై దూషణలకు సంబంధించి సీబీఐ విచారణ, గుంటూరులో పలువురు అక్రమ నిర్బంధంపై సీబీఐ విచారణకు ఆదేశించటం, ఇళ్ల స్థలాలకు సంబంధించి చెరువులు, స్మశానాలు, పాఠశాల స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు కేటాయించడంపై ఆయా ప్రాంతాలకు చెందినవారు ఏపీ హైకోర్టును ఆశ్రయించటంతో న్యాయస్థానం స్టే విధించింది. ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఏపీ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారాయి.


తీవ్ర దుమారం రేపిన లేఖ...

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల అంశంలో సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ, ఆ తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు అజయ్ కల్లాం మీడియాకు విడుదల చేసిన వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపడమే కాకుండా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా లేఖ విడుదల చేయటంపై జాతీయ పత్రికల్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు రావడం, రాష్ట్రంలో పలువురు సీనియర్ న్యాయవాదులు, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు పలువురు తీవ్రంగా స్పందించడమే కాకుండా ఏపీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. 


అప్రమత్తమైన వైసీపీ...

ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ లేఖ గురించి మీడియా వద్ద.. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులెవరూ కూడా మాట్లాడొద్దని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం కీలక సలహాదారులు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై మీడియా అడిగినా కూడా ఎవరూ నోరుమెదపొద్దని సూచించారు. మీడియా వెంటపడితే.. చెప్పాల్సింది ఇప్పటికే చెప్పేశామని రిప్లయ్ ఇవ్వాలని స్పష్టం చేశారట. దీంతో ప్రతిరోజు మీడియా ముందుకొచ్చే వైసీపీ అధికార ప్రతినిధులు, మంత్రులు, ఇతర నేతలు ఎవరూ కూడా ఈ ఉదంతంపై నోరు మెదపటం లేదని తెలిసింది. అయితే లేఖ రాసిన తర్వాత జరుగుతున్న పరిణామాలను పార్టీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారని సమాచారం.


జగన్ తీరును ఖండిస్తూ సుప్రీంలో పిటీషన్లు...

మరోవైపు జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అంతేకాదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం, న్యాయమూర్తులపై చేసిన ఆరోపణల వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి జగన్ తన పరిధి దాటారనీ, దీనిపై విచారణ జరపాలనీ, కోర్టు ధిక్కారంగా పరిగణించాలనీ సుప్రీంకోర్టులో ఇప్పటికే మూడు పిల్స్ దాఖలయ్యాయి. ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం, బహిర్గతంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పటంపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఘాటుగా స్పందించడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.


ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు...

మొత్తంమీద, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాసిన లేఖ వ్యవహారం రాజకీయంగా కాక రేపుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు తమ ప్రతినిధులకు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారట. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార వైసీపీలో కూడా అంతర్గతంగా పెద్ద చర్చకే దారితీసింది. పార్టీ కీలక నేతలు ఎవరు కూడా దీనిపై నోరు మెదపకపోవడం, లేఖను అధికారికంగా వెల్లడించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా ఆ పార్టీ ముఖ్య నేతల్లో అంతర్గత చర్చలకు దారితీశాయి. మరి ఈ లేఖ వ్యవహారంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Updated Date - 2020-10-17T17:35:27+05:30 IST