అమరావతి: ఆందోళనకారులు నిప్పు పెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ (Minister Vishwaroop) పరిశీలించారు. కాలిపోయిన రెండు అంతస్తులను ఆయన పరిశీలించారు. అద్దె ఇల్లు కావడంతో ఇంటి యజమానితో మంత్రి మాట్లాడారు. తనకు న్యాయం చేయాలని మంత్రిని యజమాని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమలాపురం అల్లర్ల వెనుక వైసీపీ కౌన్సిలర్ (YCP councillor) ప్రమేయం ఉందని ఆరోపించారు. అల్లర్లకు రౌడీషీటర్లను కౌన్సిలర్ ప్రోత్సహించారని విశ్వరూప్ తెలిపారు. మంగళవారం ‘కోనసీమ జిల్లా’ పేరు మార్పును వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళన అనూహ్య మలుపు తిరిగింది. ‘కోనసీమ జిల్లా’ కేంద్రం అమలాపురం రణరంగాన్ని తలపించింది. బ్యాంకు కాలనీలో ఉన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని వందలమంది నిరసనకారులు చుట్టుముట్టారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు.
అక్కడి నుంచి బయలుదేరిన ఆందోళనకారులు హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. కింది భాగంలో ఉన్న ఆఫీసుతోపాటు ఇంటికి నిప్పంటించారు. ఎర్రవంతెన వద్ద ప్రయాణికులతో వెళుతున్న పల్లెవెలుగు, సూపర్ లగ్జరీ బస్సులను ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. ఈ రెండు బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఒకదశలో పోలీసులు కూడా నిరసనకారులపైకి రాళ్లు విసిరారు. రాళ్లదాడిలో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఉద్రిక్తతలు సాయంత్రం 6.30 గంటల దాకా కొనసాగాయి.
ఇవి కూడా చదవండి