చిల్డ్రన్‌ పార్క్‌లకూ వైసీపీ రంగు

ABN , First Publish Date - 2021-08-06T05:40:00+05:30 IST

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏర్పాటుచేసిన చిల్డ్రన్‌ పార్క్‌లను గమనిస్తే పబ్లిక్‌ పార్కులా లేక వైసీపీ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన పార్కులా అన్న అనుమానం కలుగుతోంది. నగరపంచాయతీ అధికారులు అత్యుత్సాహంతో పూర్తిగా వైసీపీ జెండా రంగులను పోలిన విధంగా ఉన్న రంగులతో చిల్డ్రన్‌ పార్కులను తీర్చిదిద్దారు. గతేడాది అద్దంకి పట్టణంలోని మూడో వార్డు పరిధిలో ఉన్న కాకానిపాలెంలో నగరపంచాయతీ పరిధికి చెందిన బావి స్థలం ఉంది.

చిల్డ్రన్‌ పార్క్‌లకూ వైసీపీ రంగు
చిల్డ్రన్‌ పార్క్‌ గ్రిల్స్‌ కు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులు

విమర్శలకు తావిస్తున్న అధికారుల తీరు 

అద్దంకి, ఆగస్టు 5: ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏర్పాటుచేసిన చిల్డ్రన్‌ పార్క్‌లను గమనిస్తే పబ్లిక్‌ పార్కులా లేక వైసీపీ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన పార్కులా అన్న అనుమానం కలుగుతోంది. నగరపంచాయతీ అధికారులు అత్యుత్సాహంతో పూర్తిగా వైసీపీ జెండా రంగులను పోలిన విధంగా ఉన్న రంగులతో చిల్డ్రన్‌ పార్కులను తీర్చిదిద్దారు. గతేడాది  అద్దంకి పట్టణంలోని మూడో వార్డు పరిధిలో ఉన్న కాకానిపాలెంలో నగరపంచాయతీ పరిధికి చెందిన బావి స్థలం ఉంది. ఆ స్థలాన్ని స్థానికులు ఆక్రమించి పూడ్చివేయగా నగరపంచాయతీ అధికారులు ఆలస్యంగా మేలుకొని ఆక్రమణకు గురైన ప్రాంతంలో కొంతభాగాన్ని ఆక్రమణదారులకు వదిలి వేసి మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని లేడీస్‌ ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్‌ పార్కు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరీకి వైసీపీ జెండా రంగులు వేశారు. అదే సమయంలో ప్రభుత్వ  జూనియర్‌ కళాశాల ఆవరణలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుచేసినా రాజకీయ పార్టీల జెండాల రంగులతో సంబంధం లేకుండా రంగులు వేశారు. ఓపెన్‌ జిమ్‌ ప్రాంతంలోనే ఇప్పుడు రూ.15 లక్షలతో చిల్డ్రన్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చిన్నారుల వ్యాయామానికి  వీలుగా పలు రకాల పరికరాలు ఏర్పాటుకు సిద్ధం చేశారు. చిల్డ్రన్‌ పార్క్‌ చుట్టూ ప్రహరీ, గ్రిల్స్‌కు పూర్తిగా వైసీపీ జె ండాను పోలిన రంగులు వేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్‌ పార్కుకు పార్టీ జెండాలను పోలిన రంగులు వేయటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. అద్దంకి నగరపంచాయతీ అధికారుల అత్యుత్సాహంతోనే వైసీపీ జెండా రంగులను పోలిన విధంగా చిల్డ్రన్‌ పార్కులకు రంగులు వేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు  స్పందించి చిన్నారులు వినియోగించుకునే చిల్డ్రన్‌ పార్క్‌కు ప్రభుత్వ నిబంధనల మేరకు రంగులు వేయటంతో పాటు చిన్నారులను, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ఉండే జాతీయ నాయకులు, పలు రకాల క్రీడల చిత్రాలతో తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు. 




Updated Date - 2021-08-06T05:40:00+05:30 IST