డ్వాక్రా గ్రూపులతో నడిపించేశారు

ABN , First Publish Date - 2022-05-28T07:02:25+05:30 IST

రాష్ట్ర మంత్రులు ‘సామాజిక న్యాయ భేరి’ పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో స్థానిక సమస్యలను ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

డ్వాక్రా గ్రూపులతో నడిపించేశారు
గాజువాకలో శుక్రవారం ఉదయం నిర్వహించిన సామాజిక న్యాయభేరి సభలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని. చిత్రంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, మంత్రులు జోగి రమేష్‌, వనిత, బొత్స, రాజన్నదొర, ఎంపీ ఎంవీవీ, ఎమ్మెల్యే నాగిరెడ్డి ఉన్నారు

‘సామాజిక న్యాయభేరి’ సభలో 90 శాతానికిపైగా వారే...

బస్సులు, ఆటోల్లో తరలింపు

16 మంది మంత్రులు, అగ్రనేతలు హాజరైనా కనిపించని కార్యకర్తలు, జనం

కనీసం స్టీల్‌ప్లాంట్‌ అంశాన్ని ప్రస్తావించని అమాత్యులు


విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి):


రాష్ట్ర మంత్రులు ‘సామాజిక న్యాయ భేరి’ పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో స్థానిక సమస్యలను ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే శుక్రవారం ఉదయం గాజువాకలో నిర్వహించిన సభకు పూర్తిగా డ్వాక్రా మహిళలపైనే ఆధారపడడం విమర్శలకు దారితీసింది. టీటీడీ చైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌తోపాటు 15 మంది మంత్రులు పాల్గొన్న సభకు పార్టీ కార్యకర్తల నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడం నేతలను విస్మయానికి గురిచేసింది. ఈ సభకు హాజరైన వారిలో 90 శాతానికిపైగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలే ఉన్నారు. వారిని కూడా జీవీఎంసీ యూసీడీ విభాగం  అధికారుల ఒత్తిడితో స్థానిక రీసోర్స్‌ పర్సన్లు తీసుకువచ్చారు. సభకు రాకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు నిలిచిపోతాయని చెప్పినట్టు పలువురు మహిళలు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు గ్రూపుల వారీగా ఫొటోలు దిగి ఆర్‌పీలకు పంపించడం కనిపించింది. ఏదేమైనా నగరంలో ఒక్కచోట మాత్రమే సభ ఏర్పాటుచేయడంతో కార్యకర్తల నుంచి భారీ స్పందన ఉంటుందని ఊహించిన నాయకులకు నిరాశే మిగిలింది. ఇదిలావుండగా ఇంతపెద్ద సంఖ్యలో మంత్రులు హాజరైన సభలో కీలకమైన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ సమస్య గురించి గానీ, నగరంలో ఇతర సమస్యలు, అభివృద్ధి గురించి గానీ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు.  

Updated Date - 2022-05-28T07:02:25+05:30 IST