Abn logo
Oct 20 2021 @ 01:36AM

భగ్గుమన్నారు!

ఏలేశ్వరంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

  • టీడీపీ రాష్ట్ర కార్యాలయం, నేతల ఇళ్లపై దాడిని ఖండించిన ఆ పార్టీ నేతలు 
  • అధికారమదంతో పేట్రేగిపోయారంటూ తీవ్రస్థాయిలో మండిపాటు
  • పలుచోట్ల ఆందోళనలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు
  • సీఎం జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌
  • అటు వైసీపీ దాడుల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం
  • కాకినాడలోని పార్టీ కార్యాలయం వద్ద భద్రత పెంపు
  • నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
  • నియోజకవర్గ కేంద్రాల్లో మోటారు సైకిళ్లపై ర్యాలీలు
  • దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని వర్తక సంఘాలకు పిలుపు

అధికార వైసీపీ అరాచకంపై టీడీపీ జిల్లా నేతలు భగ్గుమన్నారు. గంజాయి అక్రమాలపై ప్రశ్నించినందుకు విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. అనేక జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లల్లో విధ్వంసానికి దిగడాన్ని తప్పుబట్టారు. అధికారమదంతో ఇష్టానుసారం రెచ్చిపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేకుండా పోలీసుల సాయంతో గూండాల తరహాలో                    దాడులకు పాల్పడడంపై విరుచుకుపడ్డారు. జరిగిన ఘటనకు బాధ్యత వహించి సీఎం జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క ఇతర పార్టీలు సైతం టీడీపీకి బాసటగా నిలిచాయి. అధికార పార్టీ హేయమైన చర్యకు పాల్పడిందని కమ్యూనిస్టు పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన వైసీపీ శ్రేణుల దాడి ఘటన తెలుసుకున్న టీడీపీ జిల్లా నేతలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలపైనా అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే ప్రభుత్వ పెద్దలు కొందరు స్వయంగా దాడులకు పురిగొల్పారనే విషయాన్ని టీడీపీ కీలక నేతలు బయట పెట్టడంతో పోలీసులపై ఆధారపడకుండా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అప్రమత్తమయ్యారు. మరోపక్క దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట భద్రత ఏర్పాటు చేశారు. నలుగురు సిబ్బంది అర్ధరాత్రి వరకు పహారా కాశారు. కాగా ప్రశ్నించిన ప్రతిపక్షంపై దాడులు చేయడాన్ని టీడీపీ జిల్లా నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను విఘాతమని, అధికార మదంతో చేస్తున్న ఇటువంటి ఘటనలను మానవవాదులంతా ఖండించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్మే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దాడులకు పురిగొల్పిన ముఖ్యమంత్రి జగన్‌ తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబును అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్‌ దారుణంగా తిట్టారని, ఏరోజూ టీడీపీ దాడులకు దిగలేదని గుర్తు చేశారు. ఆరోజు తాము అలా చేసుంటే వైసీపీ ఉండేదా? అని ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు టీడీపీ కార్యాలయాలపై, పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి దిగడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గతంలో టిడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏరోజూ తాము ప్రతిపక్షం జోలికివెళ్లలేదన్నారు. కానీ ఇప్పుడు నియంతృత్వ పోకడలతో వైసీపీ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కేవలం అధికారమదంతో చేస్తున్న దాడులకు గట్టిగా బుద్ధి చెప్తామని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హెచ్చరించారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చన్నారు. వీటిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, దాడులతో భయపెట్టి, ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై టీడీపీ చేస్తున్న పోరాటాన్ని ఎప్పటికీ ఆపలేరని           కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నవీన్‌ హెచ్చరించారు. ఇష్టానుసారం వైసీపీ వ్యవహరిస్తే తాము ఊరుకునేది లేదని మాజీ హోం మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హెచ్చరించారు. వైసీపీ కావాలని పద్ధతి ప్రకారం ఈ దాడి చేసిందని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ముమ్మిడివరం, అమలాపురం,           రాజోలు, కొత్తపేట, గన్నవరం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల ఇన్‌చార్జులు హెచ్చరించారు. అధికారాన్ని చేతులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలుగు మహిళ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షురాలు సుంకర పావని హెచ్చరించారు. కాగా టీడీపీపై దాడులకు నిరసనగా పలుచోట్ల మంగళవారం రాత్రి ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అక్కడక్కడా హైవేపై నిరసనలు వ్యక్తం చేశాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మోటారు సైకిళ్లపై నిరసన ర్యాలీలతో పాటు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని వర్తక సంఘాలకు పిలుపునిచ్చింది.

రాజమహేంద్రవరం: నగరంలోని కోటిపల్లి బస్టాండు సెంటర్లో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి బంద్‌కు శ్రీకారం చుడతామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఫ్యాక్షనిస్ట్‌ నేపథ్యంలో వచ్చిన సీఎం జగన్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామికవాదులంతా దాడులను ఖండించాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. అధికార పార్టీ తీరుకు ఇది పరాకాష్ట అని గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఏపీసీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీపై జరిగిన దాడులపై  పోలీసులు తక్షణం స్పందించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్‌ చేశారు.