ఎదురుదాడికి పక్కా స్కెచ్‌!

ABN , First Publish Date - 2022-01-22T06:22:04+05:30 IST

గుడివాడలో టీడీపీ నేతలపైన, ఆ పార్టీ కార్యాలయంపైన దాడికి ఒకరోజు ముందే పక్కా ప్రణాళిక సిద్ధమైందా?

ఎదురుదాడికి పక్కా స్కెచ్‌!
టీడీపీ ఆఫీసుపై దాడికి యత్నిస్తున్న వైసీపీ కార్యకర్తలు

జనాగ్రహంతో నానీ అనుచరుల్లో అసహనం

టీడీపీ నేతలపై దాడికి ముందుగానే వ్యూహం

దళితులను పావులుగా వాడుకున్న వైసీపీ

ఎస్సీ సెల్‌ మీటింగ్‌ పేరుతో సమీకరణ

రెండు వేల మందితో దాడికి ప్లాన్‌

మంత్రి ఓఎస్డీ శశిభూషణ్‌ నేతృత్వంలో దాడులు

ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని పోలీసులు


గుడివాడలో టీడీపీ నేతలపైన, ఆ పార్టీ కార్యాలయంపైన దాడికి ఒకరోజు ముందే పక్కా ప్రణాళిక సిద్ధమైందా? అందులో భాగంగానే నాని ఎస్సీ సెల్‌ పేరుతో దళితులను సమీకరించారా? ఆ సమావేశంలో వారిని రెచ్చగొట్టి టీడీపీ నాయకులపైౖ దాడికి ఉసిగొల్పారా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. జరిగిన పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని స్పష్టమవుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కేసినో సంస్కృతితో గుడివాడను మరో గోవాలా మార్చేస్తున్న మంత్రి కొడాలి నాని అనుచరుల తీరుపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాలు, పేకాట శిబిరాల నిర్వహణతో ఇప్పటికే గుడివాడ ప్రజలు మంత్రి అనుచరుల పేరు చెబితే హడలిపోతున్నారు. ఇప్పుడిక కేసినో ప్రభావంతో తమ బిడ్డలు ఎక్కడ దారి తప్పుతారోననే భయం తల్లిదండ్రులను చుట్టుముడుతోంది. దీంతో సహజంగానే వారి నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో మంత్రి కొడాలి నానితోపాటు ఆయన ముఖ్య అనుచరుల్లో అసహనం పెరిగిపోతోంది. దీనికి తోడు టీడీపీ నాయకులు కేసినో నిర్వహణ అంశంపై నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నియోజకవర్గానికి వస్తే తమ ప్రతిష్ఠ మరింత మంట కలుస్తుందని భావించిన నాని అనుచరులు ఎలాగైనా దాన్ని అడ్డుకుని ప్రజల దృష్టి మరల్చేందుకు పక్కా ప్రణాళికను రచించారు. అందులో భాగంగా వైసీపీని అభిమానించే దళితులను పావులుగా వాడుకున్నారు. 


దళితులను సమావేశ పరిచి.. దాడికి ప్రణాళిక

ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఒక్కసారి కూడా ఎస్సీ సెల్‌ మీటింగ్‌ నిర్వహించని మంత్రికి ఒక్కసారిగా పార్టీలోని దళిత నాయకులు, కార్యకర్తలపై అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది. గురువారం హడావిడిగా నియోజకవర్గంలోని దళిత నాయకులు, కార్యకర్తలందరికీ సందేశాలు పంపారు. శుక్రవారం కె కన్వెన్షన్‌లో ఎస్సీ సెల్‌ మీటింగ్‌ ఉంటుందని, అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకల్లా సుమారు రెండు వేల మంది వైసీపీ దళిత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కె కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి వారికి నాని ముఖ్య అనుచరుడు, ఓఎస్డీ శశిభూషణ్‌ దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నాయకులను గుడివాడలో ఎలా అడ్డుకోవాలో.. ఎలా దాడి చేయాలో.. పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. సమావేశానికి హాజరైన వారిని నాలుగు గ్రూపులుగా విడగొట్టి పట్టణంలో మోహరింపజేశారు. అనంతరం పక్కా ప్రణాళికతో టీడీపీ నాయకులపైన, వారి వాహనాలపైనా దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడు ముళ్లపూడి రమేశ్‌పై దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. ఈ మొత్తం దాడికి శశిభూషణ్‌ నాయకత్వం వహించడంతోపాటు స్వయంగా ఆయన కూడా పాల్గొన్నారు. 


నిబంధనలు కొందరికే

కె కన్వెన్షన్‌లో సుమారు రెండు వేల మంది సమావేశమైతే వారిని నిలువరించే ప్రయత్నం పోలీసులు చేయలేదు. పైగా కరోనా నిబంధనల పేరుతో టీడీపీ నిజనిర్ధారణ బృందం సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వేల మందితో జరిగే సమావేశానికి వర్తించని కరోనా నిబంధనలు పదుల సంఖ్యలో ఉన్న టీడీపీ నిజనిర్ధారణ బృందానికి ఎలా వర్తిస్తాయని బృంద సభ్యులు పోలీసులను ప్రశ్నించినా సమాధానం లేదు. వైసీపీ కార్యకర్తలు పట్టణంలో భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించినా.. టీడీపీ నాయకులను రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ దాడికి తెగబడినా పోలీసులు స్పందించలేదు. మంత్రి కన్వెన్షన్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత చేసిన పోలీసులు టీడీపీ కార్యాలయంపైన.. టీడీపీ నాయకులపైన.. వారి వాహనాలపైన దాడి జరుగుతుంటే నివారించకపోగా, టీడీపీ కార్యాలయాన్ని మూసివేయించారు. నాయకులను అరెస్టు చేసి వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ దాడుల్లో మంత్రి ముఖ్య అనుచరుడు, కబ్జాలు.. సెటిల్‌మెంట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెరుగుమాల కాళీ, జాన్‌విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T06:22:04+05:30 IST