వైసీపీ ఆటవిక దాడి

ABN , First Publish Date - 2021-10-20T06:21:35+05:30 IST

రేణిగుంటలో టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, చెప్పులు, చీపుర్లను విసిరికొడుతూ తరిమికొట్టారు.

వైసీపీ ఆటవిక దాడి

టీడీపీ శ్రేణులపై రాళ్లు, చెప్పులు, చీపుర్లతో వీరంగం

రేణిగుంటలో పోలీసుల ఎదుటే దాష్టీకం

బొజ్జల సుధీర్‌ వెన్నెముకకు గాయం 

 

రేణిగుంట/తిరుపతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రేణిగుంటలో టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, చెప్పులు, చీపుర్లను విసిరికొడుతూ  తరిమికొట్టారు. ఆటవికంగా దాడులకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. పెరిగిన విద్యుత్తు చార్జీలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో  నిరసన ర్యాలీ చేపట్టేందుకు మంగళవారం సాయంత్రం 3 గంటలకు ఆ పార్టీ శ్రేణులు రేణిగుంటకు చేరుకున్నారు.  ఎన్టీఆర్‌ విగ్రహానికి, అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ్నుంచి డిస్కం ఏఈ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ధరల పెంపుపై ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ వీధిలోకి చేరుకోగానే వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా ర్యాలీవైపు దూసుకొచ్చారు. ముందస్తు పథకం ప్రకారం వైసీపీ నేతలు, కార్యకర్తలు చీపుర్లతో, రాళ్లతో దాడి చేయడానికి పూనుకున్నారు. దీంతో రక్షణ కోసం పక్కనే ఉన్న డీఎస్పీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడికీ వైసీపీ వర్గీయులు వెంబడించారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టీడీపీ శ్రేణులు బైఠాయించి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. తరుముకుంటూ వస్తున్న వైసీపీ వర్గీయులను పోలీసులు నిలువరించలేకపోయారు. కాళ్లకు వేసుకున్న చెప్పులను విసిరి కొట్టారు. పక్కనే ఇళ్లలోకి దూరి చీపుర్లను చేతబట్టుకుని వెంబడించారు. రోడ్డుపై కనిపించిన రాళ్లు తీసుకుని రువ్వారు. పోలీసులు నామమాత్రంగా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒకదశలో వైసీపీ శ్రేణులు వారిని విదిలించుకుని టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. సుధీర్‌రెడ్డి వీపుపై ఇటుక రాయితో కొట్టడంతో వెన్నెముకకు దెబ్బతగిలి ఆయన నొప్పితో విలవిలలాడారు. అప్పటికే పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో  డీఎస్పీ రామచంద్రయ్య, సీఐ అంజుయాదవ్‌ కల్పించుకుని టీడీపీ నాయకులను అక్కడి నుంచి పంపడానికి ప్రయత్నించారు. పోలీసులు టీడీపీ వాళ్లనే చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ‘ఇది ఎక్కడి న్యాయం’ అంటూ పోలీసుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుపతిలో అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు బయలుదేరారు. బొజ్జల సుధీర్‌ రెడ్డి, నరసింహ యాదవ్‌, చక్రాల ఉష తదితరులు ఎక్కిన వాహనం బయలుదేరుతుండా మళ్లీ ఒక్కఉదుటున అధికార పార్టీ వర్గీయులు కారుపై దాడికి దిగారు. దీంతో కారు వేగంగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిపోయింది. ఇంత జరిగినా పోలీసులు ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. 


దాడిచేసిన వారిపై చర్యలేవి? 


పోలీసుల ఎదుటే వైసీపీ వర్గీయులు దాడి చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం దారుణం. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమజసం? రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటున్నామా? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ధర్నా చేయడం కూడా నేరమా? ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం తప్పా? వీరికి బుద్దిచెప్పే సమయం దగ్గర్లోనే ఉంది, 

- బొజ్జల సుధీర్‌ రెడ్డి


నేటి బంద్‌ను జయప్రదం చేయండి 


వినియోగదారుల డిమాండ్ల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేయడం అప్రజాస్వామ్యం. టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు బుధవారం బంద్‌కు ప్రజాస్వామ్య వాదులంతా సహకరించాలి. ఈ బంద్‌ అధికార పార్టీకి కనువిప్పు కావాలి.

- సుగుణమ్మ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే

Updated Date - 2021-10-20T06:21:35+05:30 IST