పోలీసుల అండతో వైసీపీ అరాచకాలు

ABN , First Publish Date - 2022-07-05T07:16:20+05:30 IST

పోలీసుల అండతో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.

పోలీసుల అండతో వైసీపీ అరాచకాలు
కఠారి హేమలతను పరామర్శిస్తున్న మాజీ హోం మంత్రి చినరాజప్ప

మహిళలపైనా ప్రతాపం చూపుతున్న అఽధికారులు 

మాజీ హోం మంత్రి చినరాజప్ప విమర్శ 


చిత్తూరు సిటీ, జూలై 4: పోలీసుల అండతో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పోలీసు జీపు తగిలి గాయపడిన మాజీ మేయర్‌ కఠారి హేమలతను సోమవారం ఆయన చిత్తూరులోని ఆమె నివాసంలో పరామర్శించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో చినరాజప్ప మాట్లాడారు. కఠారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్యకేసులో సాక్షులకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించమని హేమలత కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని హేమలత అనుచరులను అక్రమ అరెస్టుచేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులే గంజాయి మూటలను హేమలత అనుచరుల ఇంటిలో పెట్టడంతో ఆమె అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పోలీసులు దురుసుగా ప్రయత్నించడమే కాకుండా ఆమెపైకి వాహనాన్ని ఎక్కించడం దారుణమన్నారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె నడవలేని స్థితిలో ఉన్నారన్నారు. మహిళలని కూడా చూడకుండా హేమలతపైన, ఆ ఇంటి ఆడపడుచుపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు. హేమలత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో ప్రతిపక్షనేతలు, కార్యకర్తలను అణగదొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, దౌర్జన్యం చేయడం, అక్రమాలను ప్రశ్నించిన వారిని బెదిరించడం, భౌతిక దాడులకు దిగడం తప్ప ఇంకేమీ సాధించింది లేదన్నారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని పోలీసులు మాత్రం న్యాయం ప్రకారం తమ విధులు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు సూచించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు అధికారులను సైతం బ్లాక్‌మెయిల్‌చేస్తూ, బెదిరిస్తూ వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, నేతలు మోహన్‌రాజ్‌, సుబ్రి, అశోక్‌, లావణ్య, సతీష్‌, కిషోర్‌, రాజశేఖర్‌, డేగల రమేష్‌, రాణి, శ్రీదుర్గ తదితరలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T07:16:20+05:30 IST