వైసీపీలో కుమ్ములాట

ABN , First Publish Date - 2022-09-25T06:56:53+05:30 IST

అధికార పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. పరస్పరం విమర్శలతో ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కారు.

వైసీపీలో కుమ్ములాట
ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ కారును అడ్డగిస్తున్న శరగడం వర్గీయులు

పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు అసమ్మతి సెగ

వాహనాన్ని అడ్డుకున్న శరగడం చిన అప్పలనాయుడు వర్గీయులు

ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ నినాదాలు, కారు ముందు బైఠాయింపు

ఇరువర్గాల మధ్య బాహాబాహీ


పెందుర్తి, సెప్టెంబరు 24:


అధికార పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. పరస్పరం విమర్శలతో ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, విశాఖ రూరల్‌ జిల్లా వైసీపీ మాజీ అఽధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. శనివారం పెందుర్తిలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు శరగడం అనుచరుల నుంచి నిరసన ఎదురైంది. ఎమ్మెల్యేను శరగడం అనుచరులు ఘోరావ్‌ చేశారు. పార్వతీనగర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్పొరేటర్‌ను ఆహ్వానించి...వైసీపీ సీనియర్‌ నేత అయిన శరగడం చినఅప్పలనాయుడుకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ‘ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ గో బ్యాక్‌’, ‘ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌’ అంటు నినాదాలు చేశారు. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో మేయర్‌ అక్కడ శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు.

అనంతరం నల్లక్వారీ, ఆదిత్య నగర్‌, పెందుర్తి ఎల్‌ఐసీ కాలనీల్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల వద్దకు శరగడం అనుచరులు చేరుకుని వైసీపీ జెండాలతో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఆయన వాహనం ముందు బైఠాయించి గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ కార్పొరేటర్‌ను వెంట పెట్టుకుని శంకుస్థాపనలు చేస్తారా...అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దశలో పలువురు వైసీపీ కార్యకర్తలు అదీప్‌రాజ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తల మధ్యే ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శరగడం అనుచరులు, ఎమ్మెల్యే వర్గీయులు బాహాబాహీకి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని రోప్‌లతో నియంత్రించాల్సి వచ్చింది. అనంతరం పోలీసుల భద్రత నడుమ అదీప్‌రాజ్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 


గో బ్యాక్‌ అంటే వెళ్లిపోవాలా?: ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ప్రజలంతా ఓటు వేస్తే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి గో బ్యాక్‌ అంటే వెనక్కి వెళ్లేది లేదని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రచ్చ చేయడం తగదన్నారు. టీడీపీ కార్పొరేటర్లు తనకంటే ముందే అక్కడ ఉన్నారన్నారు. అభివృద్ధి పనుల్లో వివాదాలకు తావివ్వడం సమంజసం కాదన్నారు. సొంత పార్టీకి మచ్చ తెచ్చే చర్యలకు పాల్పడిన వారి గురించి అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.


ఎమ్మెల్యే వల్లే టీడీపీ కార్పొరేటర్ల గెలుపు

శరగడం చినఅప్పలనాయుడు

ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ నిర్వాకం వల్లే పెందుర్తి ప్రాంతంలో టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారని శరగడం చినఅప్పలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పెందుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ జిల్లా మాజీ అధ్యక్షుడినైన తనకు అభివృద్ధి కార్యక్రమాలపై సమాచారం కొరవడిందన్నారు. వైసీపీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే పోలీసులతో లాఠీచార్జి చేయించారని ఆరోపించారు.

Updated Date - 2022-09-25T06:56:53+05:30 IST