Abn logo
Oct 20 2021 @ 01:20AM

ప్రశ్నే నేరమా?

రణరంగాన్ని తలపిస్తున్న పట్టాభి నివాసం.. ధ్వంసమైన వస్తుసామగ్రి

టీడీపీ నేత పట్టాభి ఇంట్లో వైసీపీ మూకల విధ్వంసం

గంజాయి అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకే దాడి!

దాడికి పాల్పడింది 100 మందిపైనే

కత్తులు, కొడవళ్లతో వీరవిహారం

డ్రైవర్‌ మెడపై కత్తిపెట్టి బెదిరింపు

పట్టాభి కూతురిపైనా దాడికి యత్నం

భయపడి బాత్‌రూంలో దాక్కున్న చిన్నారి

ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువూ ధ్వంసం

ఫిబ్రవరిలో పట్టాభిపై హత్యాయత్నం

ఏడాది కాలంలో ఇది మూడో దాడి

సూత్రధారి ‘తూర్పు’ వైసీపీ నేతే అంటున్న టీడీపీ నేతలు


ప్రశ్నిస్తే దాడి చేస్తారు.. నిలదీస్తే నిలువునా నరికేసేందుకూ వెనుకాడరు.. అక్రమాలను అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైళ్లలో వేస్తారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షం గొంతును నొక్కేసేందుకు అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగబడేందుకు సిద్ధపడుతున్నారు. విపక్ష నేతలపైనే కాదు తమను ప్రశ్నించే సామాన్యులపైనా కర్కశంగా దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ దమనకాండకు తాజా నిదర్శనమే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై జరిగిన దాడి. 


(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : గంజాయి అక్రమ రవాణాపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ మూకలు ఏకంగా పట్టాభి ఇంటిపై దాడి చేశాయి. పట్టాభిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ మూకలు దాడులకు తెగబడడం ఏడాది కాలంలో ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టాభిని మట్టుబెట్టడమే లక్ష్యంగా దాడి జరిగింది. ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. తాజాగా మంగళవారం పట్టాభి ఇంటిపై దాడి చేసిన వైసీపీ మూకలు ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం జరిగిందని సమాచారం. 


పట్టాభి మాట్లాడిన కొన్ని గంటల్లోనే.. 

గంజాయి అక్రమ రవాణా విషయంలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. విశాఖ మన్యం కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతోందని సాక్షాత్తూ తెలంగాణ పోలీసు అధికారులే ప్రెస్‌మీట్లు పెట్టి చెబితే వారికి ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇదే విషయాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం ఏమిటని పట్టాభి ప్రశ్నించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఆయన ఇంటిపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో పట్టాభి ఇంటిపైకి సుమారు 100 మంది వైసీపీ గూండాలు వచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. కత్తులు, కొడవళ్లు, కర్రలతో వారు పట్టాభి ఇంట్లోకి చొరబడ్డారు. దాడి సమయంలో ఇంట్లో డ్రైవర్‌, పనిమనిషి, తొమ్మిదేళ్ల వయసున్న పట్టాభి కుమార్తె మాత్రమే ఉన్నారు. ఇంట్లోకి దూసుకొచ్చిన వైసీపీ మూకలు ముందుగా డ్రైవర్‌ మెడపై కత్తి పెట్టి ఆయన్ను పక్కన కూర్చోబెట్టారు. అనంతరం ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువునూ ధ్వంసం చేశారు. 


ఇంట్లో బీభత్సం

పట్టాభి డ్రైవర్‌ శివారెడ్డి జరిగిన దాడిని వివరిస్తూ.. తన మెడపై కత్తి పెట్టి బెదిరించారని, ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించారని తెలిపారు. పట్టాభిని చంపేస్తామంటూ అరచుకుంటూ వెళ్లారని వివరించారు. దాడి సమయంలో పట్టాభి కూతురు ఒక్కటే ఇంట్లో ఉండటంతో ఆ చిన్నారిపైనా దాడికి పాల్పడేందుకు వైసీపీ మూకలు యత్నించాయి. చిన్నారి భయంతో ఏడుస్తుండటంతో పనిమనిషి సమయస్ఫూర్తితో చిన్నారిని బాత్‌రూంలో పెట్టి గడియపెట్టేశారు. వైసీపీ మూకలు ఇంట్లోని అన్ని వస్తువులనూ ధ్వంసం చేసి, తమ ఆనవాళ్లు కనిపించకుండా సీసీ కెమెరాలనూ ధ్వంసం చేశాయి. చివరికి చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్‌ను, ఇతర ఆట వస్తువులను కూడా వదలలేదు. దాడి జరుగుతున్న సమయంలో ఇరుగుపొరుగు వారు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని పక్కకు నెట్టేసి మరీ దాడికి పాల్పడటం గమనార్హం. 


పట్టాభి లక్ష్యంగా ఇది మూడో దాడి

అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నిస్తున్న పట్టాభిని లక్ష్యంగా చేసుకుని తాజాగా జరిగిన దాడి మూడోది. గత ఏడాది చివరిలో పట్టాభిని లక్ష్యంగా చేసుకుని తొలి దాడి జరిగింది. ఆయన ఇంటి బయట ఉన్న వాహనాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన పట్టాభిని హత్య చేసేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. ఆ దాడిలో పట్టాభి స్వల్ప గాయాలతో త్రుటిలో తప్పించుకున్నారు. తాజాగా మూడోసారి పట్టాభిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. దాడికి పాల్పడినవారిలో తూర్పు వైసీపీ నేత అనుచరులు ఎక్కువ మంది ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీరే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలోనూ పాల్గొన్నారని వారు ఆరోపిస్తున్నారు. 


ప్రశ్నిస్తే దాడులే..!

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే ఆ పార్టీ నేతలకు ఆగ్రహం. మంత్రులు, ప్రజాప్రతినిధుల అక్రమాలను ప్రశ్నిస్తే సహించరు. ఏకంగా తమ అనుచరులతో దాడులకు తెగబడతారు. 

- ఈ ఏడాది జూలైలో కొండపల్లి అటవీ ప్రాంతంలో అడ్డగోలుగా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన మైలవరం ఎమ్మెల్యే, ఆయన బామ్మర్ది అక్రమాలను ప్రశ్నించినందుకు మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగక, ఉమపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుపాలు చేశారు. 

- గుడివాడలో మంత్రి కొడాలి నాని అక్రమాలను ప్రశ్నిస్తే వెంటనే ఆయన అనుచరులు రంగంలోకి దిగిపోతారు. తమ నాయకుడిని విమర్శించిన వారి ఇంటికి వెళ్లి, వారిని, వారి ఇంట్లో ఆడవారిని అసభ్యంగా తిట్టి, తమనే వారు తిట్టారంటూ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తారు. 

- మచిలీపట్నం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. మంత్రి పేర్ని నాని రహదారుల టెండర్లలో  అడ్డగోలుగా వ్యవహరిస్తూ తన బినామీలకు కోట్లాది రూపాయల టెండర్లు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేశారు. జిల్లావ్యాప్తంగా అధికార వైసీపీ నేతల తీరు ఇదే తరహాలో ఉంటోంది. 


మహిళల మాటలు వినిపించాయి

అంతా ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చారు. పనిమనిషి నన్ను బాత్‌రూంలోకి పంపేసింది. నాకు మహిళల మాటలు మాత్రం వినిపించాయి. - అన్నపూర్ణ, పట్టాభి కుమార్తె


నేను తిరిగి వచ్చేసరికి విధ్వంసం 

నేను మధ్యాహ్నం 3.30గంటలకు బయటకు వెళ్లాను. తిరిగి 4.40 గంటలకు వచ్చాను. అప్పటికే  ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమైపోయాయి. - చందన, పట్టాభి భార్య


మేము చెప్పాం 

ఫ్యాక్షన్‌ నాయకులు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల సమయంలోనే మేము చెప్పాం. ఇలాంటి దౌర్జన్యాలు మాకు చేతకాక కాదు. ప్రజాస్వామ్యం కోసం భరిస్తున్నాం. మేం చేస్తే వైసీపీ నాయకులు తిరగలేరు. ప్రభుత్వం తన పతనాన్ని తానే కోరుకుంటోంది. ప్రజలు ఇప్పటికైనా చైతన్యంతో వ్యవహరించాలి. - బచ్చుల అర్జునుడు, టీడీపీ గన్నవరం ఇన్‌చార్జ్‌


దాడులకు నిరసనగా నేడు బంద్‌

మచిలీపట్నం టౌన్‌ : టీడీపీ కార్యాలయాలపైన, నాయకులపైన వైసీపీ మూకల దాడులను నిరసిస్తూ, బుధవారం జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సహకరించాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, వైసీపీ మూకల విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేయడం అమానుషమన్నారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతల, పాత్రికేయుల గొంతు నొక్కేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిత్యం ప్రభుత్వ వైఫల్యా లను ప్రశ్నించే పట్టాభిపై వైసీపీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులు చేశారని, ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. 


కంప్యూటర్లనూ వదల్లేదు