Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 17 Dec 2021 00:00:00 IST

యథారాజా...

twitter-iconwatsapp-iconfb-icon
యథారాజా...

అది అందమైన అడవి. రావి, మర్రి, మోదుగ వృక్షాలతో దట్టంగా ఉండేది. ఎన్నో పక్షులకు, జంతువులకు ఆవాసాన్ని ఇస్తోంది. ఆ అడవి ప్రసేనుడు రాజైన కోసల రాజ్యంలో ఉంది. తన వంశం వృద్ధి కావాలని, తన పాలన వర్థిల్లాలనీ పెద్ద యజ్ఞం చెయ్యడానికి సంకల్పించాడు ప్రసేనుడు. యజ్ఞానికి కావలసిన ఎన్నెన్నో జంతువులను భటులు ప్రజల నుంచి సేకరించి తెస్తున్నారు. అడవిని నరికి, వందలాది చెట్లను బండ్ల మీద కోసల రాజధాని శ్రావస్తికి చేరవేస్తున్నారు. రాజపరివారం అడవిలోని చెట్లను నరకడంతో... పరిసర గ్రామాల ప్రజలు కూడా తమ శక్తి కొద్దీ చెట్లను నరుక్కోవడం మొదలుపెట్టారు. అడవిలో పెద్ద పెద్ద రావి చెట్లన్నీ హరించుకుపోతున్నాయి. 


శ్రావస్తి పొలిమేరలో... ఒక నదీతీరాన బుద్ధుడు తన భిక్షుగణంతో ఒక చెట్టు నీడన సేదతీరుతున్నాడు. వందల బండ్లమీద తరలిస్తున్న చెట్లను చూశాడు. అదే సమయానికి, పనుల పర్యవేక్షణ కోసం రథం మీద ప్రసేనుడు అటుగా వచ్చాడు. చెట్టు నీడన ఉన్న బుద్ధుణ్ణి చూశాడు. రథం దిగి వెళ్ళి, ఆయనకు ప్రణామం చేశాడు. తాను చేపట్టిన కార్యం గురించి వివరించాడు. అడవిలో చెట్లను కొట్టి తీసుకుపోతున్న ప్రజలను హెచ్చరించడానికి వచ్చానని చెప్పాడు.


అప్పుడు బుద్ధుడు ‘‘ప్రసేనా! రాజ్యాన్ని పాలించే రాజును బట్టే రాజ్యం ఉంటుంది. రాజ్యమే కాదు... లోకరీతి కూడా అతణ్ణి బట్టే నడుస్తుంది. రాజు అధర్ముడైతే సామంతరాజులు అధర్మపరులవుతారు. పండితులు, ప్రజలు అదే బాటలో నడుస్తారు. అప్పుడు నగరాలు, పట్టణాలు, గ్రామాలు అధర్మంలో కూరుకుపోతాయి. చివరకు నేల, నీరు, గాలి కూడా అధర్మమార్గానికే మరలుతాయి. అవి తమ ధర్మాలను తప్పుతాయి. ఈ అధర్మ చేష్టల వల్ల ఋతువులు గతి తప్పుతాయి. రేయింబవళ్ళు మార్పునకు గురవుతాయి. సూర్యచంద్రులు కాంతి విహీనులవుతారు. కాలాలు తల్లకిందులవుతాయి. పడవలసినప్పుడు వర్షం పడదు. పడవలసినంత వర్షం పడదు. పడవలసిన చోట పడదు. అప్పుడు పంటలు పండవు. దుర్భిక్షం ఏర్పడుతుంది. ప్రజలకు తిండి దొరక్క రోగాల పాలవుతారు. దేశం బలహీనులతో నిండిపోతుంది. జనం అల్పాయుష్కులవుతారు.


ఆ రాజు ధర్మమార్గంలో ఉంటే, ప్రజలు, ప్రకృతి, పంటలు ధర్మమార్గంలోనే ఉంటాయి. సకాల వర్షాలు, చాలినంత వర్షాలు పడతాయి. పంటలు చక్కగా పండుతాయి. ప్రజలు రోగాలపాలు కారు. సమృద్ధమైన ఆహారం వల్ల జనం బలవంతులు, బుద్ధికుశలులు, దీర్ఘాయుష్కులు అవుతారు. పశువులు రేవు దాటేటప్పుడు వాటిని ముందుండి నడిపించే వృషభరాజం సరైన మార్గంలో రేవు దాటితే... మిగిలిన పశువులన్నీ క్షేమంగా రేవు దాటుతాయి. ఆ వృషభం దారితప్పితే... ఆలమంద మొత్తం విపత్తులపాలవుతుంది. పశువులే కాదు... మనుషులైనా ఇంతే!’’ అని చెప్పాడు. ఆ సందేశం విన్న ప్రసేనుడికి... చెప్పకనే చెప్పిన బుద్ధుడి హెచ్చరిక అర్థమయింది. తన కార్యం విరమించాడు. వేలాది జంతువులు, వందలాది చెట్లకు రక్షణ దొరికింది. ఆలమందలు ఊపిరి పీల్చుకున్నాయి. అడవి ఆనందపడింది. అవని సంబరబపడింది. సంతోషంతో మేఘం సకాలంలో వర్షించింది. పుడమి పులకరించింది. పంట నవ్వులు కురిపించింది.ఆస్రవాలు

రాగం, ద్వేషం, ఈర్ష్య... ఇలాంటి మనో రుగ్మతలన్నీ ఆస్రవాలు. వీటిని ‘క్లేశాలు’ అని కూడా అంటారు. ‘ఆస్రవంతి ఇంద్రియాణ్యనేనేతి ఆస్రవః’ ... అంటే ఇంద్రియాలను చెదరగొట్టేది అని అర్థం. ఈ ఆస్రవాలను బౌద్ధం ‘కామ ఆస్రవ’, ‘భవ ఆస్రవ’, ‘దృష్టి ఆస్రవ’, ‘అవిద్య ఆస్రవ’ అని నాలుగు రకాలుగా విభజించింది. ఈ ఆస్రవాలలో ‘దృష్టి ఆస్రవం’ నశించినవారిని ‘స్రోతాపన్నులు’ అంటారు. ‘కామాస్రవం’ నశించినవారిని ‘అనాగామి’ అంటారు. మొత్తం నాలుగూ నశించినవారిని ‘అరహంత’ అని పిలుస్తారు. అంటే ముక్తుడు. ఆస్రవాలు నశించడాన్ని ‘ఆస్రవక్షయం’ అని అంటారు. ఆస్రవక్షయం పొందినవాడు దుఃఖరహితుడవుతాడు. బుద్ధత్వానికి చేరువ అవుతాడు.


 బొర్రా గోవర్ధన్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.