ఉత్కంఠకు తెరపడింది.. అదృష్టం.. MPPని చేసింది..!

ABN , First Publish Date - 2021-11-23T05:20:25+05:30 IST

ఉత్కంఠకు తెరపడింది.. అదృష్టం.. MPPని చేసింది..!

ఉత్కంఠకు తెరపడింది.. అదృష్టం.. MPPని చేసింది..!
లాటరీలో గెలుపొందిన ఎంపీపీ కామేశ్వరికి ధ్రువపత్రం ఇస్తున్న దృశ్యం

  •  ఎటపాక మండల పీఠం వైసీపీదే
  • లాటరీలో ఎంపీపీగా కామేశ్వరి ఎన్నిక


ఎటపాక, నవంబరు 22 : ఎటపాక మండల పీఠం ఎవరనేదానిపై ఐదు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించగా అధికార వైసీపీకే ఎంపీపీ పదవి దక్కింది. టీడీపీ, వామపక్ష కూటమికి వైస్‌ ఎంపీపీతో పాటు కో-ఆప్షన్‌ పదవులు వచ్చాయి. సోమవారం ఎంపీపీ ఎన్నికలో భాగంగా మండల పరిషత్‌ సమావేశ మందిరంలో తొలుత కో-ఆప్షన్‌ మెంబర్‌ ఎన్నిక నిర్వహించారు. వైసీపీ తరపున గూడపర్తి నాగయ్య, షేక్‌ రహీమ్‌పాషా, టీడీపీ-వామపక్ష కూటమి తరపున షేక్‌ ముబీన్‌ నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం రహీమ్‌ పాషా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కో-ఆప్షన్‌ మెంబర్‌  ఎన్నికకు  రిటర్నింగ్‌ అధికారి వి.సుబ్బారావు సమక్షంలో ఇరుపార్టీల ఎంపీటీసీలతో (ప్రత్యక్ష) చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు.


ఇరు పార్టీల కో-ఆప్షన్‌ సభ్యులకు చేరో ఆరుగురు ఎంపీటీసీల మద్దతు లభించడంతో అధికారులు లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. దాంతో ముబీన్‌, నాగయ్య పేర్లను ఐదైదు చొప్పున చీటీలు రాసి డ్రా తీశారు. సీపీఐ అభ్యర్ధి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు జరిపిన ప్రత్యక్ష ఎన్నికలో ఆరుగురు చొప్పున ఎంపీటీసీలు మద్దతు తెలపడంతో  టీడీపీ అభ్యర్థిని పాయం దేవి, వైసీపీ అభ్యర్థిని కాకా కామేశ్వరికి ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రిటర్నింగ్‌ అధికారి సుబ్బారావు లాటరీ పద్ధతిలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఇద్దరు పేర్లను ఐదేసి చొప్పున పేర్లు చీటీలో రాసి డ్రా తీశారు. వైసీపీ అభ్యర్థిని కామేశ్వరిని ఎంపీపీ పదవి వరించింది. వైస్‌ ఎంపీపీ ఎన్నికను కూడా ఇదే తరహాలో నిర్వహించగా టీడీపీ-వామపక్ష కూటమిలోని సీపీఎం ఎంపీటీసీ పెనుబల్లి కుమారి గెలుపొందారు. తొలుత ఎంపీటీసీలతో రిటర్నింగ్‌ అధికారి సుబ్బారావు ప్రమాణం చేయించారు. అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యులతో ప్రమాణం చేయించి తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించారు.


అలిగివెళ్లిన ఎటపాక ఎంపీటీసీ

కాగా ఎంపీపీ ఎన్నికకు ముందు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద వైసీపీలో హైడ్రామా నడిచింది. తొలుత వైసీపీ తరపున ఎంపీపీ పదవిని నెల్లిపాక ఎంపీటీసీ బూరం అంజలికి ఇస్తారని ఆ పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన ఎటపాక ఎంపీటీసీ కాకా కామేశ్వరి అలిగి అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దాంతో ఆ సమయంలో వైసీపీ క్యాడర్‌లో కొంత గందరగోళ పరిస్ధితి నెలకొంది. ఆమె జాడను తెలుసుకుని వైసీపీ నాయకులు ఆమె వద్దకు వెళ్లారు. దాంతో తనకు ఎంపీపీ అవకాశం ఇస్తేనే వస్తానంటూ కామేశ్వరి పట్టుబట్టినట్టు తెలిసింది. వైసీపీ ముఖ్య నేతలు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆమెకే ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పడంతో కామేశ్వరి తిరిగి వచ్చి ఎంపీపీ పదవికి నామినేషన్‌ వేశారు.

Updated Date - 2021-11-23T05:20:25+05:30 IST