Presidential polls: ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు

ABN , First Publish Date - 2022-06-27T19:52:43+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం పార్లమెంటులో

Presidential polls: ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం పార్లమెంటులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు. 


జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆయన వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. ఆయనకు టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ, శివసేన, ఎన్‌సీపీ, ఎస్‌పీ, డీఎంకే, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏఐయూడీఎఫ్, ఆర్ఎల్‌డీ, పీడీపీ, ఏఐఎంఐఎం మద్దతిస్తున్నాయి. 


యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైనవారిలో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి, డీఎంకే నేత ఏ రాజా, ఎన్‌సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, కొందరు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. 


యశ్వంత్ సిన్హా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్, రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి సమర్పించారు. సిన్హా శుక్రవారం మాట్లాడుతూ, తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మహిళలు, అణగారిన వర్గాల కోసం గళమెత్తుతానని చెప్పారు. తనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ మార్గదర్శకాలను, మౌలిక విలువలను నిర్భయంగా, రాగద్వేషాలు లేకుండా అమలు చేస్తానని తెలిపారు. 


రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న జరుగుతుంది.  జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2022-06-27T19:52:43+05:30 IST