Abn logo
Sep 25 2021 @ 01:01AM

యశ్వంత్‌రెడ్డికి 93వ ర్యాంకు

యశ్వంత్‌రెడ్డి

చాగలమర్రి, సెప్టెంబరు 24: సివిల్స్‌లో చాగలమర్రి మండలం కలుగొట్లపల్లె గ్రామానికి చెందిన చల్లపల్లె యశ్వంత్‌రెడ్డి 93వ ర్యాంకు సాధించారు. చల్లపల్లె పుల్లారెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు రెండో కుమారుడు యశ్వంత్‌రెడ్డి. కడప జిల్లా రాజపాలెం మండలం కూలూరు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివారు. కడప జిల్లా రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివి ప్రతిభ కనబరిచారు. విజయవాడలో ఇంటర్‌ పూర్తి చేశారు. కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేసి స్టేట్‌లో ర్యాంకు సాధించి బెంగళూరులోని ఐవోసీఎల్‌ కంపెనీలో చేరారు. గ్రూప్‌-1లో మూడో ర్యాంకు సాధించి సీటీవోగా కర్నూలులో పని చేస్తూ సివిల్స్‌కు శిక్షణ పొంది 93వ ర్యాంకు సాధించారు. యశ్వంత్‌రెడ్డి సోదరుడు నాగదస్తగిరిరెడ్డి అమెరికాలో పెల్సివియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. తండ్రి పుల్లారెడ్డి కడప జిల్లాలోని పలు పాఠశాలల్లో పని చేసి ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పదవీ విరమణ చేశారు. యశ్వంత్‌రెడ్డి సివిల్స్‌కు ఎంపికైనందుకు తల్లిదండ్రులు, సోదరుడు ఆనందం వ్యక్తం చేశారు. 


మేఘస్వరూప్‌కు 31వ ర్యాంకు 

కర్నూలు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా మూలాలున్న మేఘస్వరూప్‌ సివిల్స్‌-2020లో 31వ ర్యాంకు సాధించారు. గత సంవత్సరం 98వ ర్యాంకు సాధించిన ఆయన ఐపీఎస్‌కు సెలెక్ట్‌ అయి ప్రస్తుతం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (హైదరాబాద్‌)లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతూనే ఐఏఎస్‌ లక్ష్యంగా యూపీఎస్‌సీ పరీక్ష రాసి అనుకున్నది సాధించారు. మేఘ స్వరూప్‌ తండ్రి చంద్రశేఖర్‌ పంజాబ్‌ పవర్‌ గ్రిడ్‌లో ఉన్నతాధికారిగా పని చేస్తుండగా.. తాత రామలింగారెడ్డి స్థానిక కృష్ణానగర్‌ మున్సిపల్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు.