యాసంగి రుణ ప్రణాళిక ఖరారు

ABN , First Publish Date - 2021-10-15T05:40:38+05:30 IST

జిల్లాలో రైతులకు యాసంగిలో రుణాలు ఇచ్చేందుకు రుణ ప్రణాళికను తయారు చేశారు. రైతులు వేసే పంటల ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేయనున్నారు.

యాసంగి రుణ ప్రణాళిక ఖరారు


జిల్లాలో రూ.1421 కోట్ల  రుణాలు ఇవ్వాలని నిర్ణయం
ప్రభుత్వ, గ్రామీణ బ్యాంకులకు లక్ష్యాల నిర్దేశం
ఆరుతడి పంటలు వేసే రైతులకే ముందు అవకాశం
స్కేల్‌ ఆఫ్‌ఫైనాన్స్‌ ప్రకారం అవసరమున్న ప్రతీ రైతుకు రుణం

 
నిజామాబాద్‌, అక్టోబరు 14:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
జిల్లాలో రైతులకు యాసంగిలో రుణాలు ఇచ్చేందుకు రుణ ప్రణాళికను తయారు చేశారు. రైతులు వేసే పంటల ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేయనున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ నెల నుంచి మార్చి వరకు యాసంగి రుణాలను రైతులకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మధ్యనే జరిగిన బ్యాంకర్ల సమావేశంలో జిల్లాలోని ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్ణయించారు. వాటికి అనుగుణంగా రుణాలు వందశాతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. జిల్లాలో యాసంగి రుణాలను రైతులకు బ్యాంకుల వారీగా మొదలుపెట్టారు. ఈ యాసంగిలో మొత్తం 1421 కోట్ల రూపాయలను రైతులకు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ, గ్రామీణ బ్యాంకులకు టార్గెట్‌లను నిర్ణయించారు. ఈ అక్టోబరు నుంచి వచ్చే సంవత్సరం మార్చిలోపు వందశాతం లక్ష్యాలను పూర్తిచేయాలని నిర్ణయించారు. యాసంగిలో రైతులు వరి, మొక్కజొన్న, శనగ, ఎర్రజొన్న, సజ్జతో, నువ్వులతో పాటు ఇతర పంటలను వేస్తున్నారు. ఈ పంటలకు స్కేల్‌ ఆఫ్‌ఫైనాన్స్‌ ప్రకారం అవసరమున్న ప్రతీ రైతుకు రుణం ఇవ్వాలని ఈ నెల 2వ వారంలో బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో పెట్టుబడికి ఎక్కువగా డబ్బులు అవసరం ఉంటాయని ఈ మూడు నెలల్లోనే 80 శాతంకుపైగా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంటలు వేసే రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ రైతుకు తప్పనిసరిగా రుణం అందేవిధంగా చూడాలని కోరారు. యాసంగి సీజన్‌ మొదలవుతున్నందున జిల్లాలో మొదట ఆరుతడి పంటలు వేసే రైతులకు ఈ రుణాలు అందేవిధంగా చూడాలని కలెక్టర్‌ కోరారు. ప్రతీ సంవత్సరం రుణ ప్రణాళికను ఖరారుచేసిన కొన్ని బ్యాంకులు అనుకున్న లక్ష్యాలను సాధించడంలేదు. వందశాతం రుణాలను ఇవ్వడంలేదు. మరికొన్ని బ్యాంకులు మాత్రం లక్ష్యాలను చేరుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రుణాలను రీషెడ్యూల్‌ చేస్తున్నాయి. జిల్లాలో వానకాలంలో రూ.2129 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా రూ.1682.91 కోట్లను రుణాలుగా ఇచ్చారు. జిల్లాలో నిర్ణయించిన లక్ష్యంలో 79 శాతం పూర్తిచేశారు. యాసంగి సాగు మొదలవుతున్న సమయంలో ఈ నెల నుంచే రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ఏర్పాట్లను చేశారు. ప్రతీ బ్యాంకుకు యాసంగి లక్ష్యాలను నిర్ణయించారు.
బీమా చేసుకునే రైతులకు సహకరించాలి
రుణాలు తీసుకున్న రైతులు ఎవరైనా పంటల బీమా చేసుకుంటే వారికి సహకరించాలని కలెక్టర్‌ ఆదేశాలను ఇచ్చారు. పంటల బీమాను తప్పనిస రి చేయకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు ఈ బీమాను చేసుకోవడంలేదు. వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో పంట లు దెబ్బతింటే కనీస పరిహారం కూడా బీమా లేకపోవడం వల్ల రైతుకు అందడంలేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనతో పాటు ఇతర బీమాలు చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ఽధర నిర్ణయించిన పంటల భీమా వర్తింపజేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వానాకాలంలో భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
రైతులందరికీ రుణాలు..
- లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు

జిల్లాలో రైతులందరికీ యాసంగి సాగుకు ఉపయోగపడేవిధంగా రుణాలను అందించేందుకు ఏర్పాట్లు చేశాం. లక్ష్యాలకు అనుగుణంగా రుణాలను మంజూరు చేస్తాం. స్కేల్‌ ఆఫ్‌ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు రుణాలను అందిస్తాం.

Updated Date - 2021-10-15T05:40:38+05:30 IST