యర్రబల్లిలో యువకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-09-30T05:17:08+05:30 IST

కలువాయి మండలం యర్రబల్లికి చెందిన బరిగెల చంద్ర (35) గ్రామానికి సమీపంలో దారుణ హత్యకు గురైయ్యాడు.

యర్రబల్లిలో యువకుడు దారుణ హత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు.

ఘటనా స్థలానికి దగ్గరలో ఎర్రచందనం డంప్‌

స్మగర్లపైనే అనుమానం


కలువాయి, సెప్టెంబరు 29 : కలువాయి మండలం యర్రబల్లికి చెందిన బరిగెల చంద్ర (35) గ్రామానికి సమీపంలో దారుణ హత్యకు గురైయ్యాడు. గురువారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులు ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.   పోలీసుల కథనం మేరకు.. బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన చంద్రను గ్రామానికి సమీప పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు రెండు కాళ్లు నరికి దారుణంగా హత్య చేశారు. మృతదేహానికి వెనుక కాలిన గాయం కూడా కన్పించిందని, హంతకులు మృతదేహాన్ని మాయం చేసేందుకు కాల్చివేసి ఉంటారని  అయితే బుధవారం రాత్రి ఈ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో మృతదేహం కాలిపోలేదని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి దగ్గరలో రవాణాకు సిద్థం చేసిన 26 ఎర్రచందనం దుంగల డంప్‌ బయటపడింది. అలాగే మృతదేహం పక్కనే అన్నం ఉన్న గోతం సంచి కూడా ఉంది. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పాలుపంచుకుంటున్న వారికి చంద్ర అన్నం తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అక్కడ చంద్రకు, స్మగ్లర్లకు మధ్య విభేదాలు వచ్చి గొడవ జరిగి హత్యకు దారి తీసి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి చంద్ర భార్యకు ఫోన్‌చేసి మీ ఆయన కూలీలకు అన్నం తీసుకొస్తానని ఇంకా రాలేదని చెప్పాడని దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో గాలించగా చంద్ర మృతదేహం కనిపించినట్లు చెబుతున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలిని ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, రాపూరు సీఐ నాగమల్లేశ్వరావు పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం కూడా అక్కడకు చేరుకున్నాయి. కలువాయి ఎస్‌ఐ ప్రభాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


తమిళ కూలీలు దిగారు : సోమశిల జలాశయం అవతలివైపు ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు నరికేందుకు ఇటీవల తమిళనాడుకు చెందిన కూలీల బృందం ఒకటి వచ్చినట్లు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ తమిళ కూలీలు అక్కడ నుంచి సోమశిల జలాశయం మీదుగా ఎర్రచందనం దుంగలు తీసుకొచ్చి ఇక్కడ డంప్‌ చేసి ఉంటారని వారు భావిస్తున్నారు.


Updated Date - 2022-09-30T05:17:08+05:30 IST