కోర్టు ఆదేశాలూ పట్టించుకోరా?: యనమల

ABN , First Publish Date - 2021-05-17T09:23:49+05:30 IST

రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోకుండా దురుద్దేశపూర్వకంగా కోర్టుకు తరలించడం దారుణమని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

కోర్టు ఆదేశాలూ పట్టించుకోరా?: యనమల

రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోకుండా దురుద్దేశపూర్వకంగా కోర్టుకు తరలించడం దారుణమని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. కోర్టు ఆదేశాల మేరకు రమేశ్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించకుండా దొడ్డిదారిన రఘురామకృష్ణరాజును జైలుకు తరలించడంలో సీఎం జగన్‌రెడ్డి దురుద్దేశం ఉందన్నారు. ఈ చట్ట వ్యతిరేక, అన్యాయమైన పద్ధతుల్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు గర్హించాలన్నారు.  


ప్రాణాలు తీయడానికే జైలుకు...

ఎంపీ రఘురామరాజు ప్రాణాలు తీయడానికే ఆయనను హడావుడిగా జైలుకు తరలించారని మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి ఆరోపించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి కక్షల రాజకీయం కరోనా వైరస్‌ కంటే ప్రమాదంగా మారిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు.  ఎంపీని కొట్టడం ద్వారా ప్రజలకు ఏం సంకేతాన్ని ఇస్తున్నామో పోలీసులు ఆలోచించుకోవాలని వర్ల అన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో... ‘‘అవినీతి కేసుల్లో జగన్‌ బెయిలు రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామరాజుపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ’’ అన్నారు. ఒక ఎంపీపై పోలీసులతో థర్డ్‌ డిగ్రీ ప్రయోగింపజేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి, ఎంపీ రఘురామరాజును పోలీసులు కొట్టడం అమానవీయమని మాజీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు మండిపడ్డారు. అధికార పార్టీ ప్రవర్తనతో ఏపీలో పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా తయారయ్యాయని,  కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమ యం ఆసన్నమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2021-05-17T09:23:49+05:30 IST