మత్స్యకారులకు జగన్మోసం

ABN , First Publish Date - 2022-05-15T08:22:45+05:30 IST

‘‘ఓఎన్‌జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం ఇచ్చేది కేంద్రం. అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్‌ ఫోజులు కొట్టడం హాస్యాస్పదం.

మత్స్యకారులకు జగన్మోసం

కేంద్రం సొమ్ము సొంత జేబులోంచి ఇచ్చినట్లు ఫోజులు

ఇచ్చింది సగం పరిహారమే.. అదీ 6 నెలలు తొక్కిపెట్టారు

సొంత మీడియాకో న్యాయం.. మత్స్యకారులకో న్యాయమా?

శ్రీలంకలో ప్రభుత్వానికి పట్టిన గతే మీకూ పడుతుంది

ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి: యనమల

 

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ఓఎన్‌జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం ఇచ్చేది కేంద్రం. అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్‌ ఫోజులు కొట్టడం హాస్యాస్పదం. కేంద్రానికి చెందినవారిని పిలవకుండా అదేదో తన ఘనకార్యంగా చెప్పడం విడ్డూరం. మత్స్యకారులకు ఇప్పుడిచ్చిన పరిహారం కూడా సగమే. 6 నెలలుగా పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం మత్స్యకారులకు జగన్మోసం కాదా? మిగిలిన సగం పెండింగ్‌ పెట్టడం జగన్మోసం కాదా? సాక్షి మీడియా యాడ్స్‌ చెల్లింపుల్లో సగం ఇలాగే పెండింగ్‌ పెట్టారా? సొంత మీడియాకో న్యాయం, మత్స్యకారులకో న్యాయమా?’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మత్స్యకారుల భరోసా కార్యక్రమంలో సీఎం చెప్పిన మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్‌ పేరెత్తే అర్హత మీకుందా అని జగన్‌ను ప్రశ్నించారు. ఎంఎ్‌సఎన్‌ ట్రస్ట్‌ ఆస్తులు కబ్జా చేయాలని చూడలేదా? టీడీపీ అడ్డుకోవడంతో వెనక్కితగ్గడం నిజం కాదా? అని నిలదీశారు.


మత్స్యకారులను కాల్చి చంపిన చరిత్ర వైసీపీదైతే, వారిని ఆదుకున్న ఘనత టీడీపీదని అన్నారు. వేట నిషేధ సమయంలో పరిహారం రెట్టింపు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. డీజిల్‌ రాయితీ బకాయిల్లేకుండా చెల్లించామని,  మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేశామని, ఫిష్‌ మార్కెట్లు నెలకొల్పామని, పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. ‘‘జగన్‌రెడ్డి మాటలు తేనెపూసిన కత్తులు. మాయమాటలతో ఎన్నాళ్లు మోసం చేస్తారు? మీకూ మాకూ తేడా ఏంటో చెప్పాలా? రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించింది మేమైతే, విధ్వంసం చేసింది మీరు. ఆస్తుల కల్పన చేసింది మేమైతే, అప్పుల్లో ముంచింది మీరు. రెండంకెల వృద్ది సాధించింది మేమైతే, మైనస్‌ వృద్ధి చేసింది మీరు. విద్యుత్‌ కోతలు లేకుండా చేసింది మేమైతే, కోతలు పెట్టింది మీరు. ఉచిత విద్యుత్‌ ఇచ్చింది మేమైతే, మీటర్లు పెట్టి ఉరితాళ్లు తగిలిస్తోంది మీరు. ప్రాజెక్టులు నిర్మించింది మేమైతే, వాటిని దిష్టిబొమ్మలు చేసింది మీ ప్రభుత్వం. పేదలకు లక్షలాది ఇళ్లు కట్టింది మేమైతే, వాటిని పాడుబెట్టింది మీరు. మేం పెట్టిన అన్నా క్యాంటీన్లను మీరు మూసేశారు. మేం ఇచ్చిన పండుగ కానుకలు (రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు) రద్దు చేశారు.


ఆదరణ పనిముట్లు మేమిస్తే, మీరు తుప్పుపట్టేలా చేశారు. మేం యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తే, మీరు పొగొట్టారు. పెట్టుబడులదీ అదే పరిస్థితి. మేం పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తే, మీరు బెదిరించి తరిమేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ ఘోరాలు, నేరాలకు అంతే లేదు. జగన్‌ దోపిడీ సొమ్ము, ఈడీ, సీబీఐ జప్తుచేసిన రూ.5వేల కోట్ల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడు జమచేస్తారు? మీ దోపిడీకి, మీవాళ్ల నేరాలు-ఘోరాలకు ప్రజలే బుద్ధి చెప్తారు. శ్రీలంకలో పాలకులకు పట్టిన గతే ఇక్కడ మీకూ పడుతుంది. తరిమితరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’’ అని యనమల హెచ్చరించారు. 

Updated Date - 2022-05-15T08:22:45+05:30 IST