యలహంకలో త్వరలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

ABN , First Publish Date - 2022-04-27T17:30:41+05:30 IST

రాష్ట్రంలోనే తొలి క్రీడా విశ్వవిద్యాలయం కోసం యలహంకలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు క్రీడలు, యువజన సేవలు, పట్టు పరిశ్రమలశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ

యలహంకలో త్వరలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

                - రాష్ట్రంలో ఇదే తొలి వర్సిటీ: క్రీడల శాఖ మంత్రి కేసీ నారాయణగౌడ


బెంగళూరు: రాష్ట్రంలోనే తొలి క్రీడా విశ్వవిద్యాలయం కోసం యలహంకలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు క్రీడలు, యువజన సేవలు, పట్టు పరిశ్రమలశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ ప్రకటించారు. మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం 65 ఎకరాల భూమిని ఈ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ కోసం స్వాధీనం చేసుకుందని, మిగిలిన 35 ఎకరాల స్వాధీన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా అధికారిని కోరామన్నారు. ఈ యూనివర్సిటీ పూర్తయితే వివిధ క్రీడలలో రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ లభిస్తుందన్నారు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యం పొందుతారని తెలిపారు. జక్కూరు ఏరోడ్రమ్‌లో 100 మంది విద్యార్థులకు పైలట్‌ శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పైలట్లతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లోనూ స్టేడియంల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాఠాలతో పాటు ఆటలు అనే నినాదంతో ఈ పథకానికి రూ.504 కోట్ల గ్రాంటును కేటాయించామన్నారు. ప్రతి విద్యాసంస్థలోనూ కనీసం ఒక గంట ఆట, పాటలకు కేటాయించాలని ఆయన సూచించారు. విద్యాసంస్థల్లో 8వేల పీటీ మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆర్థికశాఖ అనుమతితో వీటిని దశలవారీగా భర్తీ చేస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కలలు సాకారం చేసేలా దేశంలోని నాలుగు విశ్వవిద్యాలయాలలో ఖేలో ఇండియా పోటీలు ఏకకాలంలో ప్రారంభమయ్యాయన్నారు. వీటిలో బెంగళూరు కూడా ఉండడం సంతోషంగా ఉందన్నారు. అమృతదత్తు పథకం ద్వారా 75 మంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మాజీ పహిల్వాన్‌లకు పింఛన్‌ రూ.వెయ్యి అదనంగా పెంచామన్నారు. కంఠీరవ స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ దెబ్బతినడంతో కొత్తగా నిర్మించేందుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇకపై స్టేడియంలో క్రీడలు తప్ప ఇతర వాణిజ్యపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కాగా కొవిడ్‌వేళ పట్టుగూళ్ల ధర గణనీయంగా తగ్గిందని, ఇప్పుడు మళ్లీ క్రమేపీ కోలుకుంటోందన్నారు. పట్టు రైతులకోసం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 

Updated Date - 2022-04-27T17:30:41+05:30 IST