యాదవులకు అన్యాయం చేస్తే సహించం

ABN , First Publish Date - 2021-09-29T06:47:06+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వా లు యాదవులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యావకాశాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నాయని, యాదవులకు అన్యాయం చేస్తే సహించేది లేదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ అన్నారు.

యాదవులకు అన్యాయం చేస్తే సహించం
విలేకరులతో మాట్లాడుతున్న యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రరావు

  • త్వరలో యాదవుల రాజకీయ పార్టీ ప్రారంభం
  • బీసీల కులగణన చేయాలి
  • యాదవ మహాసభ సమైఖ్య సమావేశయాత్ర సభలో నాయకులు 

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 28: దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వా లు యాదవులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యావకాశాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నాయని, యాదవులకు అన్యాయం చేస్తే సహించేది లేదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ అన్నారు. రాజమహేంద్రవరం వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో మంగళవారం అఖిలభారత యాదవ మహాసభ 13 జిల్లాల సమైఖ్య సమావేశయాత్ర సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న వెంగళరావుయాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ యాదవులకు రాజకీయ పదవులు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ వారిని అణగదొక్కుతోందన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా ఎంపికైన వారిలో ఒక్కరు కూడా తమ సంఘీయులు లేరన్నారు. యాదవులకు ఒక రాజ్యసభ సీటు, రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. యాదవ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, తక్షణమే రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరుతున్నామని డిమాండ్‌ చేశారు. బలహీనవర్గాలను కలుపుకుని ఒక రాజకీయపార్టీ ఏర్పాటుకు సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనికోసం 15 నుంచి 20 మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారని అన్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రరావు యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో బీసీల కులగణన చేయకపోవడం సిగ్గుమాలిన చర్య అని, ప్రధాని మోదీ తక్షణమే కులగణనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాదవులకు న్యాయం జరిగేందుకు త్వరలోనే రాజకీయపార్టీ రానుందని వెల్లడించారు. నెల్లూరు ఆనందయ్య మాట్లాడుతూ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మంచిదనే ఉద్దేశంతో అఖిలభారత యాదవ సభ ముందుకు వచ్చిందన్నారు. కరోనా మందు తయారీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా కనీసం సహకరించడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు కుండల సాయికుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ కొన్ని యాదవ సంఘాలు కలిసి వస్తే ఐక్యంగా హక్కులకోసం పోరాడుదామని కోరారు. శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు మరుకుర్తి రవియాదవ్‌, ప్రధాన కార్యదర్శి పడాల నాగరాజు, భాస్కరయాదవ్‌, అంకం గోపి, బర్ల సీతారత్నం, చావాలి రాజేశ్వరరావు, వారధి ఆంజనేయులు, గోకుల మూర్తి, జీటీపీ కుమార్‌, పట్టపగలు సత్యనారాయణ, కొయ్యాన కుమారి, సీరా లక్ష్మి, పడగల ప్రసాద్‌, గంగుల సూర్యారావు, అను యాదవ్‌, మిస్కా జోగినాయుడు, మొల్ల చిన్ని, గంగుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:47:06+05:30 IST