Abn logo
Mar 2 2021 @ 01:11AM

యాదాద్రిలో హరిహరులకు విశేష పూజలు

యాదాద్రి టౌన్‌, మార్చి1: హరిహరక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. ప్రధానాలయంలో స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయ కవచమూర్తులకు హారతి నివేదించారు. బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించిన అర్చకస్వాములు సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వరుడిని ఆస్థానపరంగా ఆరాధించి చరమూర్తులను పంచామృతం, బిల్వ పత్రాలతో అర్చించారు. హరిహరులను ఆరాధిస్తూ భక్తులు ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా సోమవారం రూ.13,24,143 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. నృసింహుడిని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా బాలాలయంలో కవచమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలను అర్చకులు అందజేశారు.

Advertisement
Advertisement