అధునాతన అన్న ప్రసాదాల మండపం

ABN , First Publish Date - 2021-03-07T06:13:02+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు అన్న ప్రసాదాల వితరణ జరిపే సముదాయాన్ని కొండకిందే గండి చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు.

అధునాతన అన్న ప్రసాదాల మండపం
కొండకింద అన్నదాన సత్ర భవనం నమూనా చిత్రం

రూ.6 కోట్లతో బేస్‌మెంట్‌ పనులు 

రూ.12కోట్లతో భవన నిర్మాణ పనులు

యాదాద్రి టౌన్‌, మార్చి6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే   భక్తులకు అన్న ప్రసాదాల వితరణ జరిపే సముదాయాన్ని కొండకిందే గండి చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. గండిచెరువు చెంతనే 2.55 ఎకరాల వైశాల్యంలో నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.6కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌అండ్‌బీ అధికారులు బేస్‌మెంట్‌ పనులను నిర్వహిస్తున్నారు. బేస్‌మెంట్‌ పనులు పూర్తయిన తర్వాత హైదారాబాద్‌కు చెందిన వేగేశ్న ఫౌండేషన్‌కు వైటీడీఏ అధికారులు ఉచిత నిత్యాన్నదాన భవన నిర్మాణ పనులను అప్పగిస్తారు. ఈసంస్థ రూ.12 కోట్లతో నిత్యన్నదాన సత్ర భవన సముదాయం నిర్మాణాన్ని చేపట్టనుంది. అన్నప్రసాద సత్ర భవనం ముందు పచ్చదనం పరిఢవిల్లే విధంగా ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లను ఏర్పాటు చేయనున్నారు. భవన నిర్మాణం పూర్తిగా ఆధ్యాత్మికత ఉట్టి పడే విధంగా డిజైన్‌చేశారు. త్వరలోనే అన్నప్రసాద సత్ర  భవనం బేస్‌మెంట్‌ పనులు పూర్తి చేసి వేగేశ్న ఫౌండేషన్‌ సంస్థకు అప్పగించనున్నట్లు వైటీడీఏ అధికారులు పేర్కొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల పూజల సందడి నెలకొంది. నిత్యకల్యాణోత్సవం, వ్రతాలు, సువర్ణ పుష్పార్చన పూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.11,21,003 ఆదాయం సమకూరినట్లు దేవస్ధాన అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే యాదాద్రి కొండకింద వైకుంఠ ద్వారం సమీపంలో ఆశ్వతవృక్ష సహిత ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అండర్‌పాస్‌ నిర్మించాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.   

Updated Date - 2021-03-07T06:13:02+05:30 IST