చిన్నికృష్ణునిగా యాదాద్రి నారసింహుడు

ABN , First Publish Date - 2022-01-17T08:22:50+05:30 IST

యాదగిరిగుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆదివారం చిన్ని కృష్ణుని(వెన్నముద్ద కృష్ణుడు) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు

చిన్నికృష్ణునిగా యాదాద్రి నారసింహుడు

యాదాద్రి టౌన్‌, జనవరి 16 : యాదగిరిగుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆదివారం చిన్ని కృష్ణుని(వెన్నముద్ద కృష్ణుడు) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాలు నాలుగో రోజు, ఆదివారం స్వామివారికి విశేష అలంకారోత్సవాలు నిర్వహించారు. శ్రీకృషుని బాల్య లీలామహత్యాలు, భాగవత ఘట్టాలను కనులకు కట్టినట్టుగా చూపేలా అలంకరణలు జరిగాయి. ఉదయం జరిగిన కార్యక్రమంలో స్వామివారిని వెన్నముద్దలు ఆరాగిస్తున్న బాలకృష్ణునిగా అలకరించారు. సాయంత్రం జరిగిన వేడుకలో విష సర్పం కాళీయుడి గర్వం అణిచిన కాళీయమర్ధనుడి రూపంలో అలంకరించి ఉత్సవ మండపంలో పూజలు నిర్వహించారు. అంతకు ముందు రుత్వికులు, అర్చక బృందం వేదపఠనం, ప్రబంధ పారాయణం చేశారు. కాగా, యాదాద్రి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి పెద్దగా కనిపించలేదు. కరోనా ఉధృతి, రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటానికి తోడు కనుమ పండగ కావడంతో క్షేత్రానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాదాద్రీశుడి సన్నిధిలో వార్షిక అధ్యయనోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో మొక్కు, శాశ్వత కల్యాణాలు, సుదర్శన హోమాలను దేవస్థానం రద్దు చేసింది. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ కుటుంబసమేతంగా ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ధనుర్మాస వేడుకల్లో భాగంగా పలువురు మహిళలు.. ఆండాల్‌ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Updated Date - 2022-01-17T08:22:50+05:30 IST